సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఐదింటిలో గెలిచి, నాలుగింటిలో ఓడి 10 పాయింట్లతో ఉంది. ఓ దశలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపుతో ప్లేఆఫ్ రేసులోకి త్వరగా దూసుకొచ్చిన హైదరాబాద్, ఇప్పుడు రెండు మ్యాచ్‌లలో పేలవమైన ప్రదర్శన కనబరిచి ఓటమిపాలై అభిమానులను నిరాశపర్చింది.
ప్రస్తుతం 10 పాయింట్లతో హైదరాబాద్‌తో కలిపి ఐదు జట్లున్నాయి. సన్‌రైజర్స్(Sunrisers Hyderabad) పాయింట్ల పట్టికలో ఇప్పుడు నాలుగోస్థానంలో ఉంది. ఈరోజు జరగబోయే కోల్‌కతా–ఢిల్లీ మ్యాచ్‌లో ఒకరు 12 పాయింట్లు తెచ్చుకుని హైదరాబాద్‌ను ప్లేఆఫ్ డెడ్‌లైన్ కిందికి నెడతారు. ఇక అక్కన్నుంచి మిగతా మ్యాచ్‌లన్నీ హైదరాబాద్‌కు ప్రాణసంకటాలే. తను ఆడే మ్యాచ్లేకాదు, ఇతరులు ఆడేవి కూడా తన ప్లేఆఫ్ రేసును నిర్ణయించనున్నాయి.
రేపటి లక్నో–ముంబై, ఎల్లుండి చెన్నై–పంజాబ్ మ్యాచులు కూడా సన్‌రైజర్స్ పాలిటి పీడకలలే. ఎందుకంటే లక్నో, చెన్నై కూడా 10 పాయింట్లతోనే ఉన్నాయి. పొరపాటున అవి గెలిస్తే 12 పాయింట్లతో పైకి దూసుకుపోతాయి. అప్పుడు మన స్థానం 7. మే2న సన్‌రైజర్స్ ప్రత్యర్థి టేబుల్ టాపర్ రాజస్థాన్‌తో. ఈ సీజన్లో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆర్ఆర్తో ఆడలేదు. అది కేవలం ఒకే ఒక్క ఓటమితో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఈ దశలో హైదరాబాద్ రాజస్థాన్‌ను నిలువరిస్తుందంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. దీంతో కలిపి సన్‌రైజర్స్ ఆడాల్సిన మ్యాచ్‌లు ఇంకా ఐదు మిగిలాయి. ఇవి రాజస్థాన్‌తో కలిపి, ముంబై, లక్నో, గుజరాత్, పంజాబ్. వీటిలో ముంబై, పంజాబ్‌పై గెలవగా, గుజరాత్‌తో ఓడిపోయింది. లక్నోతో ఇంకా ఆడలేదు. ఇక్కడితో అందరి భవిష్యత్తూ తేలిపోతుంది. (Tough time for Sunrisers)
ఇవ్వాళ్టి మ్యాచ్‌లో చేసేదేమీలేదు కనుక, రాబోయే రెండు మ్యాచుల్లో సన్‌రైజర్స్ అదృష్టం బాగుంటే ముంబై, పంజాబ్‌లు గెలిచి, తను స్వంతంగా రాజస్థాన్‌పై విజయం సాధిస్తే రేసులో నిలబడొచ్చు. లేకపోతే ఆశలు దాదాపు గల్లంతే.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధానబలం బ్యాటింగే. అందునా ఓపెనర్లు. గత రెండు మ్యాచుల్లోనూ ట్రవిస్ హెడ్ బలహీనతను కనిపెట్టిన ప్రత్యర్థులు స్పిన్ బౌలింగ్‌తో అటాక్ ప్రారంభించారు. అది ఫలితాన్నిచ్చింది. మొదటి నలుగురు బ్యాటర్లు హెడ్, అభిషేక్, మార్క్రమ్, క్లాసెన్‌లను కట్టడి చేస్తే మ్యాచ్ గెలిచినట్లేనన్న సంగతి ఇప్పుడు అన్ని జట్లకు తెలిసిపోయింది. పైగా సన్‌రైజర్స్ బలహీనత బౌలింగ్(weak bowling). వీరి బౌలింగ్‌లో ప్రత్యర్థులు ఊచకోత కోస్తున్నారు. బ్యాటర్లు 250 పరుగులకు పైగా చేసినా, ప్రత్యర్థులు కూడ దగ్గరికి వచ్చేలా వీరి బౌలింగ్ ఉంటోంది.
ఒకోసారి గెలుస్తారేమోననే భయం కూడా ఆవరించింది. ఇటువంటప్పుడు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం చాలా పెద్ద తప్పు. నిజంగానే పిచ్ బౌలింగ్‌కు అనుకూలించినా, దాన్ని సద్వినియోగం చేసుకునేంత గొప్ప బౌలర్ జట్టులో ఒక్కరూ లేరు. ఉన్న భువనేశ్వర్ కుమార్ తన ఫామ్‌ను కోల్పోయి చాలా ఏళ్లవుతోంది. ఒక నటరాజన్ మాత్రమే కొద్దోగొప్పో రాణిస్తున్నాడు. స్వయంగా మంచి బౌలరయిన కెప్టెన్ కమ్మిన్స్ కూడా విఫలమవుతున్నాడు. ఫీల్డింగ్ సరేసరి. ఒక్క రనౌట్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరుతుందంటే నమ్మడం కొంచెం కష్టమే. కానీ, ముందు ముందు రాణించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకుంటేనే ముందడుగు వేయొచ్చు. లేదంటే ఇంటిముఖమే. కావ్యామారన్ (Kavya Maran) ఆశలు అడియాసలే. జట్టులో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా ముఖ్యమనే విషయం ఇప్పుడు కావ్యకు బాగా అర్థమయిఉంటుంది.