విధాత, హైదరాబాద్ : ఐపీఎల్ టోర్నీలో సునామీ బ్యాటింగ్ తో సత్తా చాటి..టీమిండియాలోకి ఎంట్రీకి సిద్ధంగా ఉన్న నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ ధనాధన్ క్రికెట్ తోనే ప్రపంచం ఆశ్చర్యపోతుంటే..ఇప్పుడు అతడికంటే ఘనుడు అన్నట్లుగా తమ్ముడు ఆశీర్వాద్ తన బ్యాటింగ్ తో రికార్డుల వేట మొదలుపెట్టాడు. అన్న ఐపీఎల్, ఫస్ట్ క్లాస్, లీస్ట్ ఏ క్రికెట్ మ్యాచ్ లలో రికార్డుల దుమ్ము దులిపి..ఇంటర్నేషనల్ క్రికెట్ ఎంట్రీకి సిద్దమవ్వగా.. తమ్ముడు ఆశీర్వాద్ స్థానిక క్రికెట్ లో తన బ్యాటింగ్ తో విధ్వంసం రేపుతున్నాడు.
ఇటీవల స్థానిక క్రికెట్ లో 10 ఏళ్ల వయసులోనే సెంచరీ బాదిన ఆశీర్వాద్ తన అన్నకు తగ్గ తమ్ముడినంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. బీహార్‌లో ఇటీవలే తేజ్‌పూర్ క్రికెట్ అకాడమీ తరఫున మ్యాచ్ ఆడిన ఆశీర్వాద్ 103 పరుగులతో మెరిశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఆ సెంచరీ మరువకముందే ఆశీర్వాద్ తాజాగా మరో సెంచరీ నమోదు చేశాడు. వైశాలి ఎలెవన్‌పై మ్యాచ్ లో 119బంతుల్లో 19ఫోర్లు, 6 సిక్స్ లతో 168 రన్స్ చేసి సంచలనం రేపాడు. ఆశీర్వాద్ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు బెంబెలెత్తిపోయారు.
ఓపెనర్‌గా దిగిన ఆశీర్వాద్ శతక ఇన్నింగ్స్ కారణంగా రిషవ్ ఎలెవన్ ఘన విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన స్కోరు కార్డును షేర్ చేస్తూ తమ్ముడి ప్రదర్శన పట్ల వైభవ్ మురిసిపోయాడు.వైభవ్‌కు అన్న ఉజ్వల్, తమ్ముడు ఆశీర్వాద్ ఉన్నారు. సూర్యవంశీ తరహాలోనే ఆశీర్వాద్ కూడా త్వరలో ఐపీఎల్ అరంగేట్రం చేసేలా కనిపిస్తున్నాడు.
26న అంతర్జాతీయ క్రికెట్ లోకి వైభవ్
బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పద్నాలుగేళ్లకే రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టాడు. రాయల్స్ ఓపెనర్‌గా 2025లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 2026లో సంచలన ప్రదర్శనతో మెరిశాడు.
మరోవైపు వైభవ్ సూర్యవంశీ తన 15 ఏళ్ల వయసులోనే సీనియ భారత జట్టుకు ఎంపికై.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డునే బ్రేక్ చేశాడు. ఈ నెల 26న ఐర్లాండ్‌తో ఆరంభమయ్యే టీ20 సిరీస్‌లో వైభవ్ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి.అంతర్జాతీయ క్రికెట్ ఆడిన పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా సచిన్ తెందుల్కర్ (16 ఏళ్ల 205 రోజులు) పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలు కొట్టబోతుండటం విశేషం.
