Virat Kohli | ‘ఇంగ్లండ్’​ కోహ్లీ ఇండియాకు… ఆస్ట్రేలియా సిరీస్ కోసం సిద్ధం

లండన్​లో స్థిర నివాసముంటున్న ఇండియన్​ క్రికెట్​ కింగ్​ విరాట్‌ కోహ్లీ భారత్‌లో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌ శర్మతో కలిసి బయల్దేరనున్నాడు. కింగ్‌ కోహ్లీ రాకతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

  • By: ADHARVA |    sports |    Published on : Oct 15, 2025 8:08 AM IST
Virat Kohli | ‘ఇంగ్లండ్’​ కోహ్లీ ఇండియాకు… ఆస్ట్రేలియా సిరీస్ కోసం సిద్ధం

Pravasi Kohli came to India for Australia ODI series

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మంగళవారం భారత్‌లో అడుగుపెట్టాడు. ఐపీఎల్‌ 2025 సీజన్‌ ముగిసిన తర్వాత లండన్‌లో కుటుంబంతో నివాసం ఉంటున్న కోహ్లీ, ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియాతో కలిసి బయల్దేరేందుకు భారత్​కు వచ్చాడు.

కోహ్లీ న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అభిమానులు, మీడియా పెద్ద ఎత్తున చేరుకున్నారు. బ్లాక్‌ షర్ట్‌, వైట్‌ ట్రౌజర్‌లో బాలీవుడ్‌ హీరోలా కనిపించిన కోహ్లీ, భద్రతా సిబ్బంది నడుమ కారులో వెళ్లిపోయాడు. ఆయన రాకతో #WelcomeBackKohli, #KingIsBack వంటి హ్యాష్‌ట్యాగ్‌లు నెట్టింట ట్రెండ్‌ అయ్యాయి. అలాగే #LondonKohli, #KohliEngland కూడా.

లండన్​లో నివాసముంటున్న కోహ్లీ కుటుంబం

టీ20 ప్రపంచకప్‌ 2024లో విజయం సాధించిన తర్వాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ, ఐపీఎల్‌ 2025లో చివరిసారి బరిలోకి దిగాడు. ఆ తర్వాత టెస్ట్‌ ఫార్మాట్‌కూ రిటైర్మెంట్‌ ప్రకటించి కుటుంబానికి సమయం కేటాయించనున్నట్లు ప్రకటించాడు. తన పిల్లలు సాధారణ జీవితంలో పెరగాలనే ఉద్దేశంతో కోహ్లీ లండన్‌లో స్థిరపడినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై భారత అభిమానులు మండిపడుతున్నారు. కోహ్లీ ఇంగ్లండ్​లో సెటిల్​ అవడం వారికి మింగుడుపడటం లేదు. చాలామంది సెలబ్రిటీల పిల్లలు  ఇక్కడ సాధారణంగానే పెరిగారని, వారి పేరు చెప్పి వీరు లండన్​లో నివాసముండటం కరెక్ట్​ కాదని వారి అభిప్రాయం.

ఇప్పుడు అతడు వన్డే ఫార్మాట్‌పై దృష్టి పెట్టాడు. వన్డే ప్రపంచకప్‌ 2027 టోర్నీకి సన్నద్ధమవ్వాలన్న లక్ష్యంతో మళ్లీ ఆటలోకి ప్రవేశించాడు. అక్టోబర్‌ 19 నుంచి ప్రారంభమయ్యే భారత్‌-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ కోసం రోహిత్‌ శర్మతో కలిసి తొలి బ్యాచ్‌లోనే కోహ్లీ ఆసీస్‌కు వెళ్లనున్నాడు. టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ మాట్లాడుతూ, “కోహ్లీ, రోహిత్‌ ఇద్దరూ జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లు. వారి అనుభవం, స్థిరమైన ఆట టీమిండియాకు బలాన్నిస్తాయి. వన్డే ప్రపంచకప్‌ 2027కి ఇంకా సమయం ఉంది. ఆ సమయానికి కొత్త ఆటగాళ్లు మరియు సీనియర్లు సమన్వయంగా ఆడితే పెద్ద ఫలితం వస్తుంది,” అని అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం కోహ్లీ రాకతో అభిమానులు ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. “రాజు వచ్చినాడో..” అంటూ అభిమానుల హర్షం సోషల్‌మీడియాలో వెల్లువెత్తుతోంది.