2027 ODI World Cup | ‘విరాట్‌’ పర్వం ముగిసినట్టేనా? రో‘హిట్‌’ బాదుడు చూడలేమా? సంచలన వార్తల సారాంశం?

భారత క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ(virat kohli), రోహిత్‌ శర్మ(rohit sharma,)ల స్థానం వేరు. వన్డే క్రికెట్‌(odi cricket)లో స్టార్‌ ద్వయం వీరవిహారాలకు స్టేడియాలు దద్దరిల్లిపోయాయి. వాళ్లు ఉంటే గెలుపుపై ఒక భరోసా ఉండేది. అయితే.. భారత క్రికెట్‌ వర్గాల నుంచి ఇప్పుడు ఒక సంచనలన వార్త వెలువడుతున్నది. అది తదుపరి 2027 వన్డే వరల్డ్‌ కప్‌ (2027 odi world cup) టోర్నమెంట్‌లో వారిద్దరి ఆట విషయం!

2027 ODI World Cup | ‘విరాట్‌’ పర్వం ముగిసినట్టేనా? రో‘హిట్‌’ బాదుడు చూడలేమా? సంచలన వార్తల సారాంశం?

2027 ODI World Cup | రోహిత్‌ శర్మ టీమిండియా వన్డే జట్టుకు సారథిగా ఉంటే.. విరాట్‌ కోహ్లీ విజయసారథిగా తన రోల్‌ ప్లే చేస్తున్నాడు. వీరిద్దరూ ఇప్పటికే టెస్ట్‌, టీ20 ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పారు. కేవలం వన్డే ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లకు మాత్రమే సెలక్షన్‌లకు అందుబాటులో ఉన్నారు. ఇద్దరి కెరీర్‌ అసామాన్యంగా ఉన్నా, ఇతరులకు మించిన అర్హతలు కలిగి ఉన్నా.. అనేక టోర్నమెంట్లలో భారత జట్టును విజయతీరాలకు చేర్చిన ఘనమైన చరిత్ర కలిగి ఉన్నా.. రాబోయే ప్రపంచ కప్‌ జట్టులో స్థానం పొందాలంటే కొన్ని పారామీటర్‌లను కలిగి ఉండటం తప్పనిసరిగా మారిందని చెబుతున్నారు. ఈ మేరకు దైనిక్‌ జాగరణ్‌ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. మరో రెండేళ్లలో ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ ఉన్నది. అయితే.. విరాట్‌, రోహిత్‌ ఇద్దరూ తదుపరి ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకుంటారా? అన్న సందేహాలను ఆ కథనం వ్యక్తం చేసింది.

విరాట్‌, రోహిత్‌ ఇద్దరూ 30వ పడిలో ఉన్నారు. ఒక ఫార్మాట్‌కు మించి ఆడలేని పరిస్థితి ఉన్నది. వారి ఫిట్‌నెస్‌పై బీసీసీఐ, అందులోని నిర్ణయాత్మక వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిసింది. వారిద్దరూ జట్టులో స్థానం సంపాదించుకోవాలంటే విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడాల్సి ఉంటుందని లేని పక్షంలో ప్రపంచ కప్‌ జట్టులో వారికి స్థానం లభించనట్టేనని దైనిక్‌ జాగరణ్‌ అభిప్రాయపడింది. ‘2027 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు సంబంధించి మా ప్రణాళికలకు వారిద్దరూ సరిపోయే స్థితిలో లేరు’ అని భారత క్రికెట్‌ వర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. ఇప్పటిదాకా వాళ్లు ఇద్దరూ ఆటోమేటిక్‌గా ప్రపంచ కప్‌ జట్టుకు ఎంపికవుతూ వచ్చారు. కానీ.. ఇప్పుడు ఆ అవకాశం లేదని అంటున్నారు. ప్రపంచ కప్‌ సహా ఏదైనా 50 ఓవర్ల ఫార్మాట్‌ కు ఆటోమేటిక్‌గా ఎంపికయ్యే అవకాశాన్ని వారు కోల్పోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జట్టులో స్థానం కోసం వాళ్లు మరింత శ్రమించాల్సి ఉంటుందని భారత క్రికెట్‌ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో ఆడేందుకు ఇద్దరూ ప్రయత్నాలు చేశారని, అయితే.. సెలెక్టర్ల ప్రణాళికలు తెలిసిన తర్వాత టెస్ట్‌ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

భారత జట్టుకు అక్టోబర్‌లో ఆస్ట్రేలియా షెడ్యూల్‌ ఉన్నది. ఈలోపు విరాట్‌, రోహిత్‌ వన్డేలపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఇద్దరూ దేశవాళీ క్రికెట్‌లో ఆడే అవకాశం లేని నేపథ్యంలో వారి కెరీర్‌కు తెరపడినట్టేనా? అనే చర్చ జరుగుతున్నది.

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ తమ రిటైర్మెంట్‌ ప్లాన్‌లను ప్రకటించే పక్షంలో టెస్ట్‌ జట్టుకు కొత్తగా కెప్టెన్‌ అయిన శుభమన్‌ గిల్‌ను రోహిత్‌ స్థానానికి బీసీసీఐ ఎంపిక చేయవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టెస్ట్‌ కెప్టెన్‌గా ఇంగ్లండ్‌ టూర్‌లో దాదాపు సక్సెస్‌ అయిన గిల్‌ను.. రాబోయే రోజుల్లో అన్ని ఫార్మాట్లకు సారథిగా బీసీసీఐ భావిస్తున్నదని అంటున్నారు. ఇదిలా ఉంటే.. భారత జట్టు తదుపరి వైట్‌ బాల్‌ అసైన్‌మెంట్‌ 2025 ఆసియా కప్‌. యూఏఈలో సెప్టెంబర్‌ 9 నుంచి ఈ టోర్నమెంట్‌ ప్రారంభం కానున్నది. దీనిని టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.

వారి ఎంపిక కష్టమే : గంగూలీ

రాబోయే ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల ఎంపికపై మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఆచితూచి స్పందించాడు. ఇతమిద్ధంగా చెప్పకపోయినప్పటికీ.. వారిని ఎంపిక చేసే అవకాశాలు లేవన్న వాదనలను తోసిపుచ్చలేదు. ‘ఈ విషయం నాకేమీ తెలియదు. దీనిపై కామెంట్‌ చేయలేను. అని ఏడబ్ల్యూఎల్‌ అగ్రి బిజినెస్‌ లిమిటెడ్‌ ఈవెంట్‌ సందర్భంగా మీడియా ప్రశ్నలకు గంగూలీ జవాబిచ్చాడు. ‘ఇప్పుడే చెప్పడం కష్టం. ఎవరు బాగా ఆడుతారో వారే ఆడుతారు (ప్రపంచకప్‌లో). వారు బాగా ఆడినట్టయితే వారిని కొనసాగించవచ్చు. కోహ్లీ వన్డే రికార్డ్‌ అసాధారణమైనది. రోహిత్‌ శర్మ రికార్డు కూడా. వారిద్దరూ వైట్‌బాల్‌ క్రికెట్‌లో అద్భుతమైన సామర్థ్యం ప్రదర్శించారు’ అని ఆయన అన్నాడు.