వైభవ్​ సూర్యవంశీ: విరాట్​ కళ్లముందే విధ్వంసం – మనసారా అభినందించిన లెజెండ్​

ఐపీఎల్ 2026లో చిచ్చరపిడుగల్లే రెచ్చిపోతున్న వైభవ్ సూర్యవంశీ తన సెన్సేషన్ ఇన్నింగ్స్‌తో కింగ్​ కోహ్లీని సైతం ఆకట్టుకున్నాడు. మ్యాచ్ తర్వాత కోహ్లీ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్, ఆరెంజ్ క్యాప్‌తో వైభవ్ క్రికెట్ ప్రపంచంలో ఒకరోజు అందమైన జ్ఞాపకంగా మారింది.

Vaibhav Suryavanshi celebrates explosive innings Rajasthan Royals IPL 2026

ఆర్సీబీపై విధ్వంసక ఇన్నింగ్స్ తర్వాత బ్యాట్ ఎత్తి అభివాదం చేస్తున్న వైభవ్

Virat Kohli’s Special Gift to 15-Year-Old Vaibhav After Explosive IPL Knock Goes Viral

హైలైట్స్
● 26 బంతుల్లో 78 పరుగులు… మ్యాచ్‌ను ఒంటిచేత్తో ముగించిన వైభవ్
● కోహ్లీ ఎదుటే విధ్వంసం… చివరికి అదే లెజెండ్ చేతుల్లో క్యాచ్
● మ్యాచ్ తర్వాత కోహ్లీ నుంచి స్పెషల్ గిఫ్ట్… ఆటోగ్రాఫ్ క్యాప్ వైరల్
● ఐపీఎల్ 2026లో తొలి ఆరెంజ్ క్యాప్ + మాన్ ఆఫ్ ది మ్యాచ్ డబుల్ అచీవ్‌మెంట్

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​: 

వైభవ్ సూర్యవంశీ .. ఈ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్​లో మార్మోగిపోతోంది. క్రికెట్లో తమ ఆటతీరుతో ​ చరిత్ర సృష్టించిన ఎందరో మేటి క్రికెటర్లు కూడా ప్రశంసించకుండా ఉండలేకపోతున్న పేరు. ప్రత్యర్థి జట్లు ఒక్కడి కోసం ప్రణాళికలు రచించాల్సిన పరిస్థితి. అరివీర భయంకర బౌలర్లను కూడా ఊచకోత కోస్తున్న ఈ 15ఏళ్ల పిల్లాడు బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో వీరవిహారం చేసి పవర్​ప్లేలోనే మ్యాచ్​ను గెలిపించినంత పనిచేసాడు.

వైభవ్ విధ్వంసం.. పవర్​ప్లేలోనే గెలుపుబాట పట్టించిన యువ సంచలనం

ఆరెంజ్ క్యాప్‌తో ఇంటర్వ్యూలో పాల్గొంటున్న వైభవ్ సూర్యవంశీ

202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ ఆడిన దాడి క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసి పవర్‌ప్లేలోనే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అనుభవజ్ఞులైన బౌలర్లపై ఎలాంటి భయం లేకుండా ఆడటం అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించింది.

ఈ ఇన్నింగ్స్ వల్ల మ్యాచ్ 20 ఓవర్లు కూడా పూర్తి కాకముందే ముగిసిపోయింది. రాజస్థాన్ జట్టు 18 ఓవర్లలోనే విజయం సాధించడం ద్వారా ఇది ఏకపక్ష పోరాటంగా మారింది.

కోహ్లీ ముందే మెరుపులు.. ప్రశంసల్లో ముంచెత్తిన విరాట్​

మ్యాచ్ అనంతరం వైభవ్‌ను అభినందిస్తున్న విరాట్ కోహ్లీ

ఈ ఇన్నింగ్స్‌కు మరో ప్రత్యేకత ఏమిటంటే… ఇది విరాట్​ కోహ్లీ సమక్షంలో జరిగింది.తన ఆరాధ్య క్రికెటర్​,  ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్లలో ఒకరైన విరాట్​ కోహ్లీ ఎదుటే వైభవ్ తన ప్రతిభను నిరూపించాడు.

ఆర్సీబీ బౌలర్లను ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ భారీ షాట్లు కొట్టిన వైభవ్‌ను చివరకు కోహ్లీనే క్యాచ్ పట్టి ఔట్ చేశాడు. అయితే అవుట్ అయిన తర్వాత కూడా కథ అక్కడితో ముగియలేదు.

మ్యాచ్ అనంతరం కోహ్లీ స్వయంగా వైభవ్ దగ్గరకు వెళ్లి అతడిని ఆలింగనం చేసుకుని అభినందించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక లెజెండ్ నుంచి వచ్చిన ఈ గుర్తింపుతో వైభవ్​ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

 కోహ్లీ స్పెషల్ గిఫ్ట్,  ఆరెంజ్ క్యాప్‌తో ఆనందం రెట్టింపు

కోహ్లీ ఆటోగ్రాఫ్‌తో వైభవ్ సూర్యవంశీకి అందిన ప్రత్యేక క్యాప్

మ్యాచ్ తర్వాత జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైభవ్ కోరడంతో కోహ్లీ తన చేతులతో వైభవ్ క్యాప్‌పై ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాడు. అంతేకాకుండా “Dear Vaibhav, Well Done” అంటూ చిన్న మెసేజ్ కూడా రాశాడు.

ఈ బహుమతి వైభవ్‌కు జీవితాంతం గుర్తుండే అందమైన జ్ఞాపకంగా మారింది. ఇక ఈ మ్యాచ్‌తో వైభవ్ సూర్యవంశీకి మరో పెద్ద గౌరవం కూడా దక్కింది. ఐపీఎల్ 2026లో తొలిసారి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే 200 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా అందుకున్నాడు.

ఇంత చిన్న వయసులో ఈ స్థాయి ప్రదర్శన ఇవ్వడం అతన్ని భవిష్యత్ భారత జట్టుకు బలమైన స్థంభంగా నిలబెడుతోంది. కోహ్లీ వంటి దిగ్గజం నుంచి ప్రశంసలు రావడం అతని ఆత్మవిశ్వాసాన్ని పదింతలు పెంచిందనడంలో సందేహం లేదు.

Latest News