Vinesh Phogat, Bajrang Punia । కాంగ్రెస్‌లో చేరిన వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా.. అసెంబ్లీకి పోటీ?
ఫొగట్, పునియా కాంగ్రెస్‌లో చేరడంపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో స్పందించారు. ‘చక్ దే ఇండియా చక్ దే హర్యానా! ప్రపంచంలో భారతదేశాన్ని గర్వంగా నిలిపిన టాలెంటెడ్ చాంపియన్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాను 10 రాజాజీ మార్గ్‌లో కలిశాను. వారిని కలవడం గర్వంగా ఉన్నది’ అని పేర్కొన్నారు.

Vinesh Phogat, Bajrang Punia । రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం అనంతరం వారు కాంగ్రెస్‌లో చేరారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రముఖ రెజ్లర్లు కాంగ్రెస్‌లో చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ కాంగ్రెస్ తరఫున అభ్యర్థులుగా బరిలో దిగుతారని తెలుస్తున్నది. వారిద్దరిలో ఒకరు లేదా ఇద్దరూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వినేశ్, పునియా బుధవారం కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. వారు రాహుల్‌తో దిగిన ఫొటోను కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఫొగట్, పునియా కాంగ్రెస్‌లో చేరడంపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో స్పందించారు. ‘చక్ దే ఇండియా చక్ దే హర్యానా! ప్రపంచంలో భారతదేశాన్ని గర్వంగా నిలిపిన టాలెంటెడ్ చాంపియన్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాను 10 రాజాజీ మార్గ్‌లో కలిశాను. వారిని కలవడం గర్వంగా ఉన్నది’ అని పేర్కొన్నారు.
కష్టకాలంలోనే మన వెనుక నిలబడి ఉన్నదెవరో అర్థమవుతుందని వినేశ్ ఫొగట్ అన్నారు. ‘నా రెజ్లింగ్ కెరీర్‌కు మద్దతుగా నిలిచిన యావత్ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి ఆకాంక్షలకు తగినట్టే జీవించానని అనుకుంటున్నాను. తన కష్టకాలంలో వెన్నంటి నిలిచిందంటూ కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడిందని చెప్పారు. తమను రోడ్ల మీదకు లాగిన సమయంలో బీజేపీ తప్ప దేశంలోని అన్ని పార్టీలూ తమకు మద్దతుగా నిలిచాయని చెప్పారు. తమ బాధను అర్థం చేసుకున్నాయని, తమ కన్నీళ్లు తుడిచాయని అన్నారు. తాను అనుకుంటే జంతర్ మంతర్ వద్ద ఆందోళనల సందర్భంగానే రెజ్లింగ్ నుంచి వైదొలిగేదాన్నని, కానీ.. ఒలింపిక్స్ ఫైనల్స్‌దాకా చేరుకున్నానని తెలిపారు. కానీ దేవుడు మరోలా తలచాడని అన్నారు. ఇప్పుడు దేశ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడని చెప్పారు. రెజ్లింగ్‌లో ఎలాగైతే కష్టపడ్డామో కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే స్థాయిలో కష్టపడతామన్నారు. 90 సీట్లు ఉన్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
పునియా టోక్యో క్రీడల్లో కాంస్య పతక విజేత. ఫొగట్.. ఇటీవలి ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరుకుని.. కేవలం వంద గ్రాముల అధిక బరువు కారణంగా అన్హత వేటుకు గురైంది. ఈ నేపథ్యంలో ఆమె తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. కొంతకాలం క్రితం అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ లైంగిక వేధింపులపై భారీ స్థాయిలో పోరాటం చేశారు.
రైల్వేస్‌కు ఫొగట్ రాజీనామా
నార్తన్ రైల్వేస్‌కు రెజ్లర్ వినేశ్ ఫొగట్ శుక్రవారం రాజీనామా చేసింది. లెవల్ 7 అధికారిగా ఆమె ఓఎస్డీ స్పోర్ట్స్ హోదాలో ఆమె రైల్వేస్‌లో పనిచేశారు. రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఫొగట్ పోటీచేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె రాజీనామా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ‘రైల్వేస్‌కు సేవలందించడం ఒక మధురమైన జ్ఞాపకంగా, గర్వించే సమయంగా నిలిచిపోతుంది. నా జీవితంలో ఈ దశంలో రైల్వేస్ నుంచి నా జీవితాన్ని వీడదీయాలని నిర్ణయించుకున్నాను. ఇండియన్ రైల్వేస్‌లో సంబంధిత అధికారులకు నా రాజీనామాను సమర్పించాను’ అని ఆమె తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ‘రైల్వేస్ ద్వారా దేశానికి సేవ చేసేందుకు నాకు అవకాశం కల్పించిన ఇండియన్ రైల్వే కుటుంబానికి సదా కృతజ్ఞురాలినై ఉంటాను’ అని పేర్కొన్నారు.