వరల్డ్‌కప్‌ సెమీస్‌కు ఎవరో తేల్చేసిన జహీర్‌ఖాన్‌.. ఆ నాలుగు జట్లు ఇవే..

వరల్డ్‌కప్‌ సెమీస్‌కు ఎవరో తేల్చేసిన జహీర్‌ఖాన్‌.. ఆ నాలుగు జట్లు ఇవే..

మరికొన్ని గంటల్లో ప్రపంచకప్‌ క్రికెట్‌ సంగ్రామం మొదలు కాబోతున్నది. ఇప్పటికే ఎవరికివారు జగజ్జేతపై అంచనాలు వేసుకుంటున్నారు. ఏ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో కూడా లెక్కలు కడుతున్నారు. ఈ క్రమంలోనే భారీ మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ కూడా తన అంచనాలు వెల్లడించాడు.



సెమీ ఫైనల్‌కు వెళ్లే నాలుగు జట్లను ఆయన ఎంపిక చేశాడు. ఇటీవల ఒక ఈవెంట్‌ సందర్భంగా జహీర్‌ ఖాన్‌ ఈ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు ఏయే జట్లు చేరుకుంటాయో వెల్లడించాడని క్రికెట్‌ టైమ్స్‌ పేర్కొన్నది. జహీర్‌ ఖాన్‌ అంచనాలు కరెక్టేనని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. జహీర్‌ ఖాన్‌ చెప్పిన నాలుగు జట్లలో ఇంగ్లండ్‌, ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ ఉన్నాయి. వాటి బలాబలాలు చూస్తే..

ఇంగ్లండ్‌: ఈ డిఫెండింగ్‌ చాంపియన్‌ జట్టులో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్లు, బ్యాటర్లకు చుక్కలు చూపించే బౌలర్లు ఉన్నారు. మరోసారి కప్‌ను ముద్దాడాలని ఇంగ్లండ్‌ జట్టు సర్వసన్నద్ధంగా ఉన్నది. దీనికి గిఫ్టెడ్‌ షాట్‌ మేకర్‌గా పేర్కొనే 33 ఏళ్ల జోస్‌ బట్లర్‌ నాయకత్వం వహిస్తున్నాడు.


ఇండియా: అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సమతూకంతో భారత జట్టు ఉన్నది. టోర్నీని ఎగరేసుకుపోగల అవకాశాలు మెండుగా ఉన్న జట్టు అనే అభిప్రాయాలు సర్వత్రా ఉన్నాయి. హిట్‌మ్యాన్‌గా ప్రసిద్ధికెక్కిన రోహిత్‌శర్మ నాయకత్వంలో అనుభవజ్ఞులు, యువ నైపుణ్యాల సమ్మేళనంగా భారత జట్టు ఉన్నది. ఈసారి ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు మెన్‌ ఇన్‌ బ్లూ (భారత జెర్సీ రంగు) తమ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తారని రోహిత్‌ శర్మ ధీమాతో చెప్పాడు.



పాకిస్థాన్‌: ఏ రోజైనా తిరుగులేని సామర్థ్యాన్ని ప్రదర్శించే శక్తిమంతమైన జట్టుగా క్రికెట్‌ క్రిటిక్స్‌ చెబుతుంటారు. ఇద్దరు ఆటగాళ్లు మొదటిసారి భారతదేశంలో ఆడబోతున్నారు. తమ జట్టు ప్రపంచకప్‌కు సర్వసన్నద్ధంగా ఉన్నదని కెప్టెన్‌ బాబర్‌ ఆజం చెప్పాడు.


ఆస్ట్రేలియా: పోరాట స్ఫూర్తికి, అత్యుత్తమ ప్రదర్శనకు ఆస్ట్రేలియా పెట్టింది పేరనే కీర్తి ఉన్నది. ఈసారి ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు ఆస్ట్రేలియా చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ జట్టుకు పాట్‌ కుమ్మిన్స్‌ నాయకత్వం వహిస్తున్నాడు.


డిస్నీ స్టార్‌ మొత్తం 48 మ్యాచ్‌లను టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడంతోపాటు.. ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన డిస్నీ హాట్‌స్టార్‌లోనూ లైవ్‌ స్ట్రీమ్‌ చేయనున్నది.