ముస్లింలపై ఎందుకీ మిడిసిపాటు?: మంత్రి పొన్నం ప్రభాకర్
అధికారంలో ఉన్న పదేళ్లలో దేశ సంపదను అంతా అంబానీ, ఆదానీలకు దోచి పెట్టారు..లోకసభ ఎన్నికలు రాగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపద అంతా ముస్లింలకు పంపిణీ చేస్తుందంటూ

*విద్వేషాలు రెచ్చగొట్టి
ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నాలు
*దేశ సంపద అంతా దోచిపెట్టింది ఎవరికి?
*కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాం అన్న వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి
విధాత బ్యూరో, కరీంనగర్: అధికారంలో ఉన్న పదేళ్లలో దేశ సంపదను అంతా అంబానీ, ఆదానీలకు దోచి పెట్టారు..లోకసభ ఎన్నికలు రాగానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపద అంతా ముస్లింలకు పంపిణీ చేస్తుందంటూ ప్రధాని మోదీ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన ఈ వ్యాఖ్యలు దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని చెప్పారు. పది సంవత్సరాలు ప్రధానిగా చేసిన వ్యక్తి దేశానికి తాము ఏమి చేసింది చెప్పుకునే స్థితిలో లేరని విమర్శించారు. పార్లమెంట్ మొదటి దశ ఎన్నికలు పూర్తికాగానే నరేంద్ర మోడీకి ఓటమి భయం పట్టుకుందని తెలిపారు.
సోమవారం వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ దేశంలో ఉన్నది 85% హిందువులేనని, ప్రధాన మంత్రిగా వారి ఉన్నతికి మోడీ చేసింది ఏమిటో చెప్పాలని నిలదీశారు. కేవలం
మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి,మెజారిటీ హిందువుల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నంలో మోదీ వ్యాఖ్యలు ఒక భాగమే అన్నారు. లోకసభ ఎన్నికలకు సంబంధించి తాము రూపొందించిన మేనిఫెస్టో చూసి బిజెపి నేతలకు లాగులు తడిసి పోతున్నాయని తెలిపారు. పాంచ్ న్యాయ్ ద్వారా దేశంలో ఉన్న బడుగు, బలహీన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలన్నది తమ పార్టీ ఉద్దేశమన్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బీఆర్ఎస్ దశాబ్ద కాల పాలనలో తెలంగాణ కోసం చేసింది ఏమిటని నిలదీశారు. పార్లమెంట్ నిండు సభలో తెలంగాణ విభజనకు వ్యతిరేకంగా మాట్లాడి, అమరవీరులను అవమానపరిచేవిధంగా దొంగ దారిన రాష్ట్రాన్ని తెచ్చుకున్నారన్న నరేంద్ర మోడీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.
పార్టీ సూచనలు మేరకే…
కాంగ్రెస్ పార్టీ సూచన మేరకే సోమవారం నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని పూర్తి చేశామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజేందర్ రావు చదువుకున్న వ్యక్తి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ లోకసభ నియోజవర్గం మీద తనకుఅవగాహన ఉందని, ఇక్కడ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అంతా ఐక్యంగానే ఉన్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాల్సి ఉందన్నారు.
ఎల్లారెడ్డిపేట మొదలు ఎల్కతుర్తి వరకు మల్యాల నుండి మొదలు బెజ్జంకి వరకు ప్రతి పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్లు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాము అన్నవాళ్ళకు ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లోకసభ పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముందుకు తీసుకువెళతారని చెప్పారు. కరీంనగర్ కాంగ్రెస్ కి కంచుకోట లాంటిదని, దానిని రుజువు చేయాల్సిన బాధ్యత పార్టీ నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.