Goat Head | హైద‌రాబాద్‌లో ఘోరం.. 1150 కిలోల మేక త‌ల‌కాయలు సీజ్..!

Goat Head | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో కుళ్లిన మాంసం నిల్వ‌లు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. పాత‌బ‌స్తీలోని అనేక ప్రాంతాల్లో భారీ స్థాయిలో కుళ్లిన చికెన్, మ‌ట‌న్ నిల్వ‌లను విక్ర‌యిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు.

Goat Head | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో కుళ్లిన మాంసం నిల్వ‌లు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. పాత‌బ‌స్తీలోని అనేక ప్రాంతాల్లో భారీ స్థాయిలో కుళ్లిన చికెన్, మ‌ట‌న్ నిల్వ‌లను విక్ర‌యిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు. తాజాగా బాలాపూర్ ప‌రిధిలోని సుల్తాన్‌పూర్ ఏరియాలోని స‌లామీ ఇండ‌స్ట్రీలో భారీగా కుళ్లిన మాంసాన్ని పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు.

స‌లామీ ఇండ‌స్ట్రీస్ య‌జ‌మానులు.. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు హోట‌ళ్ల‌కు, రెస్టారెంట్ల‌కు కుళ్లిన మేక త‌ల‌కాయ‌, కాళ్లు, చేప‌ల‌తో పాటు చికెన్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు బాలాపూర్ పోలీసుల‌కు విశ్వ‌స‌నీయ స‌మాచారం అందింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారుల‌తో క‌లిసి పోలీసులు శుక్ర‌వారం ఆ ఇండ‌స్ట్రీలో త‌నిఖీలు నిర్వ‌హించారు. దీంతో అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో భారీగా కుళ్లిన మాంసం నిల్వ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.

ఈ దాడిలో 4 టన్నుల కోడి వ్యర్థాలు, 1150 ట‌న్నుల మేక త‌ల‌కాయ‌లు, 5 టన్నుల కాళ్ల మాంసం/ బోటి, 2 టన్నుల కుళ్లిన చేపలను సీజ్ చేశారు. వీటిని సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులు మెఫీద్‌ ఖాన్‌, గులాం ఉస్మానీ, షేక్‌ మున్నా షైల్‌, మహ్మద్‌ ముజీబ్‌లను అరెస్టు చేసి విచారించగా.. వట్టేపల్లి వాసి అబ్ధుల్‌ గఫార్‌ అనే వ్యక్తి ఐదేళ్లుగా అక్కడ షెడ్డు వేసి ఈ దందాతో డబ్బు సంపాదిస్తున్నట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మంగ‌ళ్‌హాట్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని కిస్తీచ‌మ‌న్ ద‌ర్గా స‌మీపంలో నిర్వ‌హిస్తున్న‌ ఏ టూ జ‌డ్ షీప్ అండ్ గోట్ ఆఫ‌ల్స్ గోడౌన్‌పై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు క‌లిసి ఇటీవ‌ల సంయుక్తంగా దాడులు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ దాడుల్లో భ‌యంక‌ర‌మైన దృశ్యాలు వెలుగుచూశాయి. 14 ట‌న్నుల కుళ్లిన మాంసాన్ని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. మేక‌, గొర్రెల‌కు సంబంధించిన త‌ల‌కాయ‌, బోటి, కాళ్లు, బ్రెయిన్ వంటి విడిభాగాల‌ను పెద్ద ఎత్తున అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో భ‌ద్ర‌ప‌రిచారు. వీట‌న్నింటిని ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌లో చుట్టి ఉంచారు. కుళ్లిపోయిన మాంసాన్ని ర‌సాయ‌నాల‌తో శుభ్ర‌ప‌రిచి విక్ర‌యిస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

Latest News