Ponnam Prabhakar | వారం రోజుల్లో 2లక్షల రుణమాఫీ : మంత్రి పొన్నం ప్రభాకర్
వారం రోజుల్లో రూ.2లక్షల వరకూ రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణ మాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని మంత్రి కొనియాడారు

విధాత, హైదరాబాద్ : వారం రోజుల్లో రూ.2లక్షల వరకూ రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణ మాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని మంత్రి కొనియాడారు. వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అక్కన్నపేట మండలం రామవరం రైతు వేదిక క్లస్టర్‌లో మంత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు హాజరయ్యారు. ఇప్పటికే రూ.లక్ష లోపు, రూ.1.50లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు మాఫీ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. వచ్చే వారం రోజుల్లోగా రూ.2లక్షల వరకు మాఫీ చేసి అన్నదాతలకు అండగా నిలుస్తామని చెప్పుకొచ్చారు. సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ రాని వారు ప్రతిపక్షాల మాటలకు భయపడి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. నగదు జమ కాని వారు కంగారు పడొద్దని, మాఫీకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి చెప్పారు. వ్యవసాయంలో మంచి లాభాలు ఆర్జించాలంటే సంప్రదాయ పంటలకు భిన్నంగా వాణిజ్య పంటలు వేయాలని రైతులకు సూచించారు. అధిక ఆదాయం పొందేందుకు భిన్నమైన పంటలు ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు రూ.431.50కోట్ల నిధులను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిందని, ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతుల ముఖాల్లో ఆనందం చూడాలని అనుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గృహ జ్యోతి పథకం కింద 200యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.500లకే వంట గ్యాస్ అందని లబ్ధిదారులు స్థానిక మండల కార్యాలయాల్లో ఫిర్యాదు చేయాలని మంత్రి పొన్నం సూచించారు.