RTI | సమాచార హక్కు చట్టానికి 20 ఏళ్లు

RTI | యూపీఏ హయంలో చారిత్రాత్మక చట్టాలు అమల్లోకి వచ్చాయని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

  • By: raj |    telangana |    Published on : Oct 13, 2025 7:30 AM IST
RTI | సమాచార హక్కు చట్టానికి 20 ఏళ్లు

యూపీఏ హయాంలో చారిత్రాత్మక చట్టాలు
బీజేపీ ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడుస్తోంది
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

RTI | హైదరాబాద్, అక్టోబర్ 12(విధాత): యూపీఏ హయంలో చారిత్రాత్మక చట్టాలు అమల్లోకి వచ్చాయని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ దూరదృష్టి నాయకత్వంలో, చారిత్రాత్మక సమాచార హక్కు చట్టం (RTI) 2005 అక్టోబర్ 12న అమలులోకి వచ్చిందన్నారు. నేటితో ఆర్టీఐ చట్టం అమలులోకి వచ్చి 20 ఏళ్ళు పూర్తి అయిందని వెల్లడించారు. దేశ చరిత్రలో ఆర్టీఐ చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకి వాస్తవాలను తెలుసుకోవడానికి మహత్తర అవకాశం ఆర్టీఐ ద్వారా కల్పించారని, ఈ చట్టం పేద, అణగారిన వర్గాలకు జీవనరేఖగా మారిందన్నారు. దీని ద్వారా సరుకుల పంపిణీ, పెన్షన్‌లు, బకాయిలు, స్కాలర్‌షిప్‌లు వంటి హక్కులను సాధించుకునే శక్తిని ప్రజలకు ఇచ్చిందన్నారు.

ఉపాధి కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిదని, అటవీ హక్కుల చట్టం (2006), విద్య హక్కు చట్టం (2009), భూసేకరణ న్యాయమైన పరిహారం చట్టం (2013), ఆహార భద్రత చట్టం (2013) లో చట్టాలు ప్రజలకు సంపూర్ణ హక్కులను యూపీఏ ప్రభుత్వం కల్పించిందని మహేశ్ గౌడ్ గుర్తు చేశారు.

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆర్టీఐని తూట్లు పొడుస్తోందని విమర్శించారు. 2019 సవరణలతో సమాచారం కమిషన్ల స్వతంత్రతను బలహీనపరిచాయి. కమిషనర్ల పదవీకాలం (5 సంవత్సరాలు), సేవా షరతులను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేలా మార్పులు జరిగాయని మండిపడ్డారు. స్వయం ప్రతిపత్తి తో నిర్వహించే ఆర్టీఐ కమిషనర్లు కేంద్రం ఒత్తిడిలకు తల్లోగే పరిస్థితి నెలకొందన్నారు.