రాజకీయ చదరంగంలో బీసీ పావులు ప్రధాన పార్టీల చిత్తశుద్ధి పై అనుమానం! 42 శాతం రిజర్వేషన్లకు అడ్డంకెవరూ?
రాజకీయ చదరంగంలో బీసీ పావులు ప్రధాన పార్టీల చిత్తశుద్ధి పై అనుమానం!42 శాతం రిజర్వేషన్లకు అడ్డంకెవరూ? బీసీ ప్రజల అనైక్యత ప్రధాన కారణం ఎన్నికల్లో హామీలు తప్ప అమలెక్కడ? బీసీలు మందెక్కువే..మజ్జిగ పలుచన !

- రాజకీయ చదరంగంలో బీసీ పావులు
- ప్రధాన పార్టీల చిత్తశుద్ధి పై అనుమానం!
- 42 శాతం రిజర్వేషన్లకు అడ్డంకెవరూ?
- బీసీ ప్రజల అనైక్యత ప్రధాన కారణం
- ఎన్నికల్లో హామీలు తప్ప అమలెక్కడ?
- బీసీలు మందెక్కువే..మజ్జిగ పలుచన !
విధాత, ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు ఆశగానేమిగిలిపోతుందా? మరోసారి బీసీల పాలిట త్రిశంకు స్వర్గంగా మారుతుందా? అనే అనుమానాలు చుట్టుముడుతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాల పాచికలో బీసీలు పావులుగా మారుతున్నారనే చర్చసాగుతోంది. అంగట్లో అన్నీ ఉన్నా…అల్లుని నోట్లో శని ఉన్నట్లు కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు 42శాతం రిజర్వేషన్లకు గట్టి మద్ధతుదారులుగా బల్ల గుద్ది వాదిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. బీజేపీ మూడవ పక్షంగా కొనసాగుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ కొనసాగుతోంది. ఈ స్థితిలో రాష్ట్రంలో ఒకరు నిర్ణయం తీసుకుంటే కేంద్రం సహకరిస్తే కావాల్సిన కార్యక్రమం గంధర్వులు చేసినట్లు బీసీల స్థానిక రిజర్వేషన్లకు పెద్దగా అడ్డుపడే శక్తి ఎవరూ లేరు. కానీ, 42 శాతం రిజర్వేషన్ల అమలుపైన ఈ మూడు పార్టీల చిత్తశుద్ధిని కొందరు శంకిస్తున్నారు. మూడు పార్టీల్లో నిజాయితీ ఉంటే, పరస్పర సహకారం తీసుకుని బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే రాజకీయ నిర్ణయంతో పాటు చట్టసభల్లో అడ్డంకులు, రాజ్యాంగపరమైన ఆటుపోట్లను సులభంగా తొలగించవచ్చు. కానీ, ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటూ సమస్యను జఠిలం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మూడు రాజకీయ పక్షాల్లోని బీసీ నాయకులు సంఘటితంగా లేక పోవడం ఒక కారణమైతే, సమిష్టిగా తమ జాతి ప్రయోజనం కోసం పట్టుబిగించకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు. ఈ పార్టీల్లోని బీసీ నేతల్లో నిర్ణయాధికార పాత్రలేకపోవడంగా భావిస్తున్నారు. ఇతరుల నాయకత్వంలో పనిచేసే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులుగా ఉండడం మరో అంశంగా గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా బీసీ సమాజంలోని అనైక్యత, కొందరు సంఘనాయకుల భావదారిద్రానికి తోడు, స్వంత ప్రయోజనం కోసం అందరి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే స్వభావం వల్ల తీవ్రమైన ముప్పు నెలకొంటోంది. ముఖ్యంగా బీసీ సమాజం నుంచి రాజకీయ పక్షాలపై బలమైన ఒత్తిడి లేకపోవడం ప్రధాన కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు.
హామీలు తప్ప అమలెక్కడ?
ఈ నేపథ్యంలోనే తెలంగాణంలో పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలిప్పుడు ఫలిస్తుందా? తీరా ఎన్నికలనాటికి రిక్త హస్తం చూపెట్టి పాత ధోరణిలోనే ఒక పార్టీ పై మరో పార్టీ విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తూ తమ రాజకీయ పబ్బంగడుపుకుంటారా? అనే చర్చ తీవ్రంగా సాగుతోంది. ఎందుకంటే బీసీల పట్ల ఈ పార్టీలకు నిజాయితీ ఉంటే ఒకరు తీర్మానం చేస్తే మరొకరు సహకరించే పద్ధతిని అవలంభించి ఉమ్మడి రాజకీయ నిర్ణయంగా `చట్ట సభ`ల్లో రూపం తీసుకునేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. కానీ, ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ కేబినేట్ నిర్ణయం తీసుకుంటే మిగిలిన పక్షాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. తమ నాయకత్వాల పై ఒత్తిడి తెచ్చి బీసీలకు చట్టబద్ద అవకాశాలు కల్పించి ఆయా పార్టీల్లో బీసీ నాయకులుగా తమ గౌరవాన్ని, బీసీల గౌరవాన్ని కాపాడుదామనే సానుకూల దృక్పథం కంటే ఈ తంతును ఉపయోగించుకునే బీసీలను తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ ప్రత్యర్థిపార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. బీసీ సమూహం వీరికి కర్రుకాల్చివాత పెట్టాలని బీసీ సంఘాల నాయకులు కొందరు ఇప్పటికే విన్నవిస్తున్నారు.
మందెక్కువ మజ్జిగ పలుచన
తెలంగాణ సమాజంలో అధికారిక కుల గణన ప్రకారం 56.33 శాతంగా ఉన్న బీసీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ప్రధానంగా రాజకీయ రంగంలో బీసీల ప్రాధాన్యత అంతంత మాత్రమే. అది కూడా కొన్ని కులాలకే పరిమితమైంది. చట్టసభల్లో వీరి పాత్ర నామమాత్రంగా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తున్న కాసిన్నిరిజర్వేషన్ల పుణ్యమా అంటూ అక్కడక్కడ మెరుస్తుంటారు. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పక్షాలు బీసీలను ఓటు బ్యాంకుగా భావించి వరాలు కురిపిస్తున్నారు. హామీలు అమలు దగ్గరికి వచ్చేసరికి అనేక అడ్డంకులు సృష్టించి మోకాలొడ్డుతున్నారు. దీనికి ముఖ్య కారణం బీసీల్లో అనైక్యత, చైతన్యరాహిత్యం ప్రధాన కారణం కాగా, బీసీ సంఘాలకు చెందిన కొందరు నేతలు సమూహ ఆత్మగౌరవాన్ని తమ స్వార్ధప్రయోజనాలకు తాకట్టుపెట్టడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
రాజకీయ పక్షాల ద్వంద నీతి
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు స్థానికసంస్థల ఎన్నికల్లో 42శాతం అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టి జనాభా 56.33శాతంగా తేల్చింది. డెడికేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. బిల్లును అసెంబ్లీలో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. మూడు నెలలుగా బిల్లు కేంద్రం దగ్గరే మూల్గుతోంది. ఈ లోపు హైకోర్టు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు జరపాలని స్పష్టం చేసింది. దీని కోసం కాంగ్రెస్ ఆర్డినెన్స్ తీసుకరావాలని, 2018 పంచాయతీ రాజ్ చట్టాన్నిసవరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఆర్డినెన్స్ కు సానుకూలత లభిస్తుందా? అనే అనుమానం మిగిలిన పక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50శాతం మించుతున్నందున తమిళనాడుకు అవకాశం కల్పించినట్లు రాజ్యంగంలోని 9 షెడ్యూల్ సవరణ చేయాలంటే కేంద్రం చేతిలో ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పక్షాలు ఏకమై బీసీల హక్కుల రక్షణకు నిలబడాలని కోరుతున్నారు. కానీ, పరిస్థితి దీనికి భిన్నంగా కనిపిస్తోంది. 42శాతం రిజర్వేషన్ల అమలుపైన కొన్ని విపక్ష రాజకీయ పార్టీల నేతలు నోరుతో మద్ధతు తెలుపుతూ నొసటితో వ్యతిరేకిస్తున్నట్లుగా సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఈ పార్టీలు, నాయకుల తీరు పైన కొన్ని బీసీ సంఘాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరికొందరు ఇలాంటి వారికి మద్ధతుగా నిలవడం ఇక్కడ విచారకరంగా మారిందంటున్నారు. రిజర్వేషన్లకు అడ్డంకులు కల్పిస్తే సహించేది లేదంటూ బీసీ సంఘాల నాయకులు జాజుల శ్రీనివాస్, వేణుగోపాల్ గౌడ్, దాసు సురేష్ తదితరులు స్పష్టం చేస్తున్నారు. ఏ పార్టీలో ఉన్న బీసీల హక్కుల కోసం, రాజకీయ ప్రాతినిధ్యం పెరిగేందుకు ఆయా పార్టీల నాయకత్వం పై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు.