లారీలో రూ.750 కోట్ల డబ్బు.. గద్వాల్ దగ్గర పట్టివేత

- తనిఖీలో చిక్కిన 750 కోట్ల నగదు
- బండి పత్రాల సమర్పణతో విడుదల
విధాత: ఎన్నికల ప్రక్రియలో భాగంగా గద్వాల జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులకు మంగళ వారం రాత్రి 11గంటల సమయంలో ఓ ట్రక్కులో తరలిస్తున్న ఏకంగా 750కోట్ల సొమ్ము పట్టుబడింది. ఒకేసారి అంత భారీ మొత్తంలో నగదు కట్టలను చూసిన పోలీసులకు సొమ్మసిల్లనంత పనైంది. అదంతా ఎన్నికల్లో పంచేందుకు తరలిస్తున్న డబ్బేనా అన్న అనుమానాలు.. స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తున్నారా అన్న సందేహాలతో పోలీసులు కొంత సేపు ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఆగమేఘాల మీద ఆ సొమ్ము ఎవరిదో తేల్చేందుకు ప్రయత్నించగా తీరా ఆ సొమ్ము అంతా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదిగా తేలింది. కేరళా నుంచి హైద్రాబాద్‌కు తరలిస్తున్నారని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంకు అధికారులు సంబంధిత డబ్బుకు సంబంధించిన అధికారిక పత్రాలు సమర్పించాకా ఆ వాహానాన్ని విడుదల చేశారు. అంతలోగానే ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌కు కూడా చేరవేశారు. ఆయన ఆదేశాల మేరకు 750కోట్లకు సంబంధించిన బ్యాంకు దృవీకరణ పత్రాలు సమర్పించాక ఆ నగదు తరలిస్తున్న వాహనాన్ని వదిలేయడం గమనార్హం.