Speaker Gaddam Prasad : ముగిసిన 8మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో భాగంగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ శనివారం తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్లను విచారించారు. దీంతో ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేల విచారణ ముగిసింది.

Speaker Gaddam Prasad : ముగిసిన 8మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 10మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు పిటిషన్ల విచారణలో భాగంగా శనివారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిటిషన్ ల పై విచారణ నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు రెండు విడతల్లో 8మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ముగిసింది. తొలి విడతలో నలుగురు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ లను రెండు దఫాలుగా విచారించారు. రెండో విడతలో మరో నలుగురు ఎమ్మెల్యేలు డా. సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీల విచారణను స్పీకర్ ప్రసాద్ విచారించారు.

అనర్హత అభియోగాలు ఎదుర్కొంటున్న మొత్తం 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు మాత్రం ఇంకా స్పీకర్ నోటిసులకు సమాధానం ఇవ్వలేదు. దీంతో వారి అనర్హత అంశంపై విచారణ జరుగలేదు.

సోమవారం సుప్రీంకోర్టులో కీలక విచారణ

ఇప్పటికే సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణలో స్పీకర్ కు ఇచ్చిన మూడు నెలల గడువు ఆక్టోబర్ 31తో ముగిసిపోగా..మరో రెండు నెలల గడువు కావాలని స్పీకర్ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బీఆర్ఎస్ సైతం ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు గడువును పాటించకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ స్పీకర్ పై తాజాగా సుప్రీంకోర్టులో కేసు వేసింది. అటు గడువు పెంపు కోరుతూ స్పీకర్ వేసిన పిటిషన్, ఇటు స్పీకర్ పై బీఆర్ఎస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కారం పిటిషన్లను సోమవారం సీజేఐ గవాయ్ ధర్మాసనం విచారించనుండటం ఆసక్తికరంగా మారింది.