ఏసీపీ ఉమామహేశ్వరావుకు ఏసీబీ ఉచ్చు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు
హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావుపై ఆదాయానికి మించి ఆస్తులు కల్గివున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనతో పాటు బంధువుల ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో ఆకస్మిక సోదాలకు దిగింది

ఆదాయానికి మించి ఆస్తులపై విస్తృత సోదాలు
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావుపై ఆదాయానికి మించి ఆస్తులు కల్గివున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనతో పాటు బంధువుల ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో ఆకస్మిక సోదాలకు దిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ఉమామహేశ్వర్‌రావు ఇండ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉన్న ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మహేశ్వరరావు బంధువు ఇంట్లో సైతం సోదాలు సాగుతున్నాయి.
ఏపీ తెలంగాణలో కొనసాగుతున్న ఏసీబీ సోదాల్లో కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఉమామహేశ్వరరావు బ్యాంక్ లాకర్‌లను గుర్తించారు. భారీగా బంగారం, భూముల పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. హైదరాబాద్‌లోని ఉమామహేశ్వర్‌రావు అశోక్ నగర్ లోని ఇంట్లో, మామ, సోదరి ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. విశాఖలో మరో రెండు ఇళ్ళలోనూ తనిఖీలు సాగించారు. సీసీఎస్ ఆఫీసులోని ఏసీపీ చాంబర్‌లో సైతం తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో పట్టుబడిన అక్రమాస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఏసీబీ అధికారికంగా వెల్లడించాల్సివుంది.