TG | కల్తీ విత్తనాలు అరికట్టాలి
వరంగల్ జిల్లాలో ఈ వర్షాకాల సీజన్లో అక్రమ దందాగా కొనసాగుతున్న కల్తీ విత్తనాలను అరికట్టాలని, నకిలీ క్రిమిసంహారక మందులు ,ఎరువులు అమ్ముతున్న వ్యాపారులపై చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్ )నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు.

కల్తీ విత్తనాలు అరికట్టాలి
– వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు న్యూ డెమోక్రసీ, ఏఐకేఎంఎస్ ల ధర్నా
– కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన నాయకులు
విధాత, వరంగల్ ప్రతినిధి:
వరంగల్ జిల్లాలో ఈ వర్షాకాల సీజన్లో అక్రమ దందాగా కొనసాగుతున్న కల్తీ విత్తనాలను అరికట్టాలని, నకిలీ క్రిమిసంహారక మందులు ,ఎరువులు అమ్ముతున్న వ్యాపారులపై చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్ )నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.
జిల్లాలో వరంగల్ నగరం తో పాటు నర్సంపేట వర్ధన్నపేట ప్రాంతాలు, మండల కేంద్రాల్లో మేజర్ పంచాయతీ గ్రామాల్లో నకిలీ విత్తనాల దందా కొనసాగుతున్నదని నాయకులు విమర్శించారు. పెద్ద కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలు పాకెట్ల ద్వారా సరఫరా జరుగుతుందని 750 రూపాయలు ఉండే ఒక పత్తి విత్తనాల పాకెట్ను 2వేల రూపాయల వరకు బ్లాక్ లో అమ్ముతున్నారని వారన్నారు . గత సంవత్సరం వరంగల్లో కూడా కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారని ఈ సంవత్సరం కూడా నకిలీ విత్తనాల వ్యాపారం చేసే వారిని గుర్తించి వారిపై చర్య తీసుకోవాలని వారి లైసెన్స్ కూడా రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ను వారు కోరారు.
నకిలీ విత్తనాలు అరికట్టే బాధ్యత రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్ని రకాల విత్తనాలను రైతులకు 70 శాతం సబ్సిడీ కింద అందజేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోటే రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి ఆగస్టు 15 లోపు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం రైతాంగాన్ని మోసగించడమేనని వారు అన్నారు. ఇప్పటికే బ్యాంకుల నుండి లక్ష రూపాయల అప్పు అసలు కాగా వడ్డీ 40 వేల నుండి 50 వేల వరకు పెరుగుతున్నదని పాత రుణాలు ఏమో గాని బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. దీనివల్ల రైతులు మరింత అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెంటనే రుణమాఫీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల పండించిన పంటకు ఫసల్ బీమా పథకమును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్ )రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాచర్ల బాలరాజు, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎలకంటి రాజేందర్, గంగుల దయాకర్, బండి కోటేశ్వరరావు, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు జక్కుల తిరుపతి, గట్టి కృష్ణ, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పూలక్క, పి వై ఎల్ జిల్లా నాయకులు గండ్రతి హరిబాబు, వీరన్న, భద్రాజి, వాగ్య, మహమూద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.