అన్నారం బరాజ్‌లో బుంగ

- వరుస సంఘటలతో ప్రజల్లో ఆందోళన
- ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు అగ్నిపరీక్ష
- కొత్త సాంకేతికతతో కట్టాం.. ఇవి మామూలే
- ప్రమాదం లేదంటున్న అధికారులు
- పరివాహక ప్రాంతవాసుల్లో ఆందోళన
- కాళేశ్వరం అస్త్రంగా రాహుల్ ఎటాక్
- వాటిపై మౌనం పాటిస్తున్న సీఎం కేసీఆర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేసుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టులో మరో లోపం వెలుగుచూసింది. కొద్ది రోజుల క్రితం ఈ ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ లక్ష్మీబరాజ్‌లో పిల్లర్ కుంగిపోగా.. తాజాగా దాని తర్వాతిది అయిన సరస్వతి బరాజ్‌లో బుంగ కనిపించింది. వరుసగా రెండు ఘటనలు ఒకే ప్రాజెక్టులో కనిపించడంతో ఆందోళనతోపాటు.. అనుమానాలూ ముసుకుంటున్నాయి. అన్నారం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సరస్వతీ బరాజ్‌లో 38, 40 పిల్లర్ల మధ్య ప్రాజెక్టుకు బుధవారం బుంగ పడింది. దీంతో పైకి నీరు ఉబికి వస్తున్నది. పిల్లర్ కింద ఇసుక కొట్టుకుపోవడంతో ఇలాంటి బుంగలు ఏర్పడుతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పిల్లర్ల పునాది దెబ్బతినే అవకాశం ఉన్నదని అంటున్నారు. ఈ బుంగతో ప్రమాదం ఉంటుందని పరివాహక ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలియగానే.. అప్రమత్తమైన ఇంజినీరింగ్ అధికారులు.. నాటుపడవలో ఇసుక బస్తాలు పంపించి, బుంగను పూడ్చేయత్నం చేస్తున్నారు.
ప్రమాదం లేదంటున్న అధికారులు
ఇంజినీరింగ్ అధికారులు మాత్రం ఈ బుంగతో ప్రమాదమేమీ లేదని, నూతన సాంకేతికతతో ఇసుక పైన నిర్మించిన కట్టడం మూలంగా ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెబుతున్నారు. మెయింటెనెన్స్‌లో భాగంగా ఇసుక బస్తాలు వేసి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అన్నారం రోడ్డు బరాజ్ 1.2 కి మీ పొడవుతో నిర్మించారు. బరాజ్‌కు 66 గేట్లు ఉన్నాయి. ఒక వైపు ఇసుక బస్తాలతో బుంగ పూడ్చే చర్యలతో పాటు బరాజ్‌లోని నీటిని ఒక గేటు ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రజల్లో ఆందోళనలు
ప్రభుత్వం, అధికార బీఆరెస్ నాయకులు, ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులెన్ని మాటలు చెబుతున్నప్పటికీ సంఘటనల పరంపరతో పరివాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన పెరుగుతున్నది. కాళేశ్వరం అవినీతి ఆరోపణలతో బీఆరెస్ ప్రభుత్వంపై దాడి చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. తాజాగా పిల్లర్‌కుంగిపోయిన అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు నిన్నటి వరకు తమ మానస పుత్రిక, ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టు అంటూ ఎన్నికల్లో ప్రధాన నినాదంగా చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, ఇతర ముఖ్య నాయకులు ఈ విషయం పై నోరు మెదపడంలేదు. సభల్లో నీళ్ళిచ్చాం, పొలాలు పచ్చబడ్డాయంటున్న సీఎం.. మొన్నటి పిల్లర్ కుంగుబాటుపై, నేటి బుంగపై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నేషనల్ కమిటీ రిపోర్టు పెండింగ్
మేడిగడ సంఘటన జరుగగానే వెంటనే ప్రతిస్పందించిన నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో ఆరుగురి సభ్యుల బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత జలసౌధలో ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. తర్వాత మరిన్ని వివరాలు కావాలంటూ అధికారులకు లేఖ రాశారు. గత నెల 21వ తేదీన మేడిగడ్డ సంఘటన జరిగింది. 24న కేంద్ర అధికారుల బృందం ప్రాజెక్టును సందర్శించింది. ఎనిమిది రోజులైనప్పటికీ నివేదిక బయటికిరాలేదు. నిర్మాణ సంస్థ మాత్రం ప్రాజెక్టులో నిల్వ చేసిన 10 టీఎంసీల నీటిని బయటికి పంపించి కాఫర్ డ్యామ్ నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. రోజువారీగా వస్తున్న 22,500 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. పెద్ద శబ్దంతో కుంగిపోయిన 7వ బ్లాకు 19, 20, 21 పిల్లర్లు కుంగిపోయాయి. ఇందులో 21 పిల్లర్ వద్ద పలుళ్ళు కూడా ఏర్పడినందున డిజైన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.