Minister Uttam Kumar Reddy | మంత్రి ఉత్తమ్ చ‌లో మేడిగడ్డ.. మూడు బ్యారేజీల మరమ్మతుల పరిశీలన

తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. ఉత్తమ్ తన పర్యటనలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు

Minister Uttam Kumar Reddy | మంత్రి ఉత్తమ్ చ‌లో మేడిగడ్డ.. మూడు బ్యారేజీల మరమ్మతుల పరిశీలన

జస్టిస్ పీసీ ఘోషన్ రెండు రోజుల పర్యటన

విధాత: తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. ఉత్తమ్ తన పర్యటనలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. మంత్రి వెంట ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్‌కుమార్‌, ఇతర నీటిపారుదల శాఖ అధికారుల బృందం వెళ్లనుంది. హెలిక్యాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1గంటలకు సుందిల్లకు చేరుకొని బ్యారేజీని పరిశీలించి, అనంతరం వరుసగా అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను పరిశీలిస్తారు. ఎన్డీఎస్‌ఏ మధ్యంతర నివేదిక సూచనల మేరకు మేడిగడ్డ వద్ధ జరుగుతున్న పనుల పురోగతిని ఉత్తమ్ బృందం పరిశీలించనుంది. జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ఉత్తమ్ బ్యారేజీలను సందర్శించనున్నారు.

ఘోష్ కమిషన్ బ్యారేజీల మరమ్మతు, పునరుద్దరణ పనులను జూన్ 10వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఘోష్ పర్యటన వేళ పనుల పురోగతిని మంత్రి ఉత్తమ్ పరిశీలిస్తారు. రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరదల నేపథ్యంలో చేపడుతున్న రక్షణ పనులను సమీక్షించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులను ఎల్‌ అండ్‌ టీ, ఆఫ్‌కాన్స్‌, నవయుగ వర్క్ ఏజెన్సీలు కొనసాగిస్తున్నాయి. బ్యారేజీల మరమ్మతులు,వర్క్ ఏజన్సీలు చేపట్టిన పనులు, ప్రస్తుత బ్యారేజీల పరిస్థితిని నిర్మాణ సంస్థల టాప్‌ మేనేజ్‌మెంట్‌ ప్రతినిధులు మంత్రికి వివరిస్తారు. బ్యారేజీల పరిస్థితి, వాటి మరమ్మతుల ప్రోగ్రెస్ గురించి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించనున్నారు.

రెండు రోజుల పాటు జస్టిస్ ఘోష్ పర్యటన

కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శుక్ర, శనివారాల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు హైదరాబాద్‌లోనే ఉండి విచారణను పూర్తి చేసి, జూన్ నెలాఖరులోగా నివేదిక ఇచ్చే ప్రయత్నం చేస్తారని సమాచారం. ప్రజాభిప్రాయ సేకరణలో పీసీ ఘోష్ కమిటీకి ఇప్పటిదాకా 54 ఫిర్యాదులు అందాయి. నిర్మాణ సంస్థలకు, ఇంజనీర్లకు, మాజీ ప్రజాప్రతినిధులకు నోటీస్‌లు జారీ చేసే అవకాశముంది.

ఇప్పటికే ఘోష్ కమిషన్‌కు సహరించేందుకు నియమించిన నీటి పారుదల శాఖ నిపుణుల కమిటీ మూడు బ్యారేజీల్లో దిగువ భాగాన రాఫ్ట్ పునాదుల వద్ధ సీపేజీతో పాటు పలు మరమ్మతు అవసరాలను గుర్తించింది. సీపేజీ అరికట్టేందుకు చర్యలను సూచించింది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ వద్ధ బుధవారం సెంట్రల్ సాయిల్ మెటిరియల్ రీసెర్చ్ స్టేషన్‌(సీఎస్‌ఎంఆరెస్‌) నిపుణుల బృందం పరీక్షలు కొనసాగిస్తుంది.ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకు నిపుణులు పరీక్షలు చేసి నివేదిక ఇవ్వనున్నారు. వారం రోజుల పాటు ఈ బృందం జియో ఫిజికల్‌, జియో టెక్నికల్‌, కాంక్రీట్ పరీక్షలను నిర్వహించనునుంది.