నీటిని నిల్వ చేయలేని దుస్థితిలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు ఉండడంతో కేవలం ఆరు రోజుల్లోనే 70 టీఎంసీల వరద నీరు సముద్రం పాలైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతున్నా నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఎన్డీఆర్ఏ సూచనల మేరకే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ గేట్ల ఎత్తివేత
విధాత: నీటిని నిల్వ చేయలేని దుస్థితిలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు ఉండడంతో కేవలం ఆరు రోజుల్లోనే 70 టీఎంసీల వరద నీరు సముద్రం పాలైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతున్నా నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మేడిగడ్డ ఎగువ ప్రాంతం నుంచి గోదావరికి భారీగా వరద వస్తోంది.
మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ లోని పియర్లు గత ఏడాది అక్టోబర్ లో కుంగిపోయాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు ముప్పు ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేయ వద్దని ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. బ్యారేజీలో నీటి నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ చేసిన సూచనల మేరకు 85 గేట్లు ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద నీరు వచ్చినట్టుగా మేడిగడ్డకు దిగువకు తరలిపోతోంది. ప్రస్తుతానికి ఇక్కడ ఒక్క బొట్టు నీటిని కూడా నిల్వ చేసే పరిస్థితులు లేవు.
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిని ఇప్పటికే దాదాపు తొమ్మిది నెలలైంది. ఈ మధ్య వ్యవధిలో గోదావరిలో చెప్పుకోదగ్గ నీటి ప్రవాహం రాలేదు. గత అయిదు రోజులుగా భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తింది. శుక్రవారం సాయంత్రానికి మేడిగడ్డ వద్ద ప్రవాహ ఉద్ధృతి 3,10,080 క్యూసెక్కులకు చేరుకోగా, శనివారం ఉదయం 3,84,400 క్యూసెక్కులుగా నమోదైంది. క్రమంగా శనివారం సాయంత్రానికి వరద కొంత మేరకు తగ్గుముఖం పట్టింది.
మేడిగడ్డకు ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీ వద్ద కూడా ప్రవాహం పెరిగింది. 12,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంటే.. అక్కడ కూడా నీటిని నిల్వ చేయవద్దని ఎన్ డీఎస్ఏ హెచ్చరించింది. అందుకే ఈ బ్యారేజీలో నే 66 గేట్లు ఎత్తి ఉంచారు. దీంతో వరద నీరు వచ్చినట్లు వచ్చి కిందికి తరలివెళుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కీలకమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలలో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేక పోవడంతో ఈ ప్రాజెక్ట్ పై ఆధారపడిన రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోసే పరిస్థితి కనిపించడం లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఆరు రోజులుగా సముద్రంలోని వెళ్లిన వరద నీరు
15 జులై 41200 క్యూసెక్కులు
16 జులై 41200 క్యూసెక్కులు
17 జులై 49500 క్యూసెక్కులు
18 జులై 53400 క్యూసెక్కులు
19 జులై 341000 క్యూసెక్కులు
20 జులై 280000 క్యూసెక్కులు