Telangana Assembly Budget Session| రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..ఖాకీల రక్షణ వలయం!
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. మార్చి 16 నుంచి 30 వరకు జరిగే శాసన సభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.45 గంటలకు ప్రారంభం అవుతాయి. ఈ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వంతో వేసవి ఎండలను మరిపించే స్థాయిలో వాడివేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది.
విధాత, హైదరాబాద్ : రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. మార్చి 16 నుంచి 30 వరకు జరిగే శాసన సభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11.45 గంటలకు ప్రారంభం అవుతాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ హాల్‌లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అనంతరం సమావేశాల ఎజెండా ఖరారుకు బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు, ఏ అంశాలపై చర్చించనున్నారో ఖరారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు ఈనెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈనెల 20న బడ్ఝెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. గత బడ్జెట్ కంటే ఈసారి అన్ని శాఖలకు కేటాయింపులు పెంచే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు, వ్యవసాయం మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
అధికార, ప్రతిపక్షాల కసరత్తులు
శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇవ్వడంతో పాటుగా.. పెండింగ్‌లో ఉన్న పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు చేసే విమర్శల దాడిని తిప్పికొట్టడంతో అవసరమైన వ్యూహ ప్రతివ్యూహాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మార్గదర్శకం చేశారు. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై, అనుసరించాల్సిన వ్యూహాలపై తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహించడం గమనార్హం. బీజేపీ, ఎంఐఎం సైతం తమ వ్యూహాల మేరకు ప్రభుత్వంపై దాడికి అస్త్రశస్త్రాలకు పదును పెట్టాయి.
రైతులు, నిరుద్యోగుల సమస్యలు, ఆరు గ్యారెంటీలపై ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. మూసీ ప్రక్షాళన, హిల్ట్ పాలసీ, హైడ్రా, భూదాన్ భూములు, భూ భారతీ, కాళేశ్వరం మరమ్మతులు, కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఫ్యూచర్ సిటీ, విదేశీ పెట్టుబడులు, రైతు భరోసా పెండింగ్, జీహెచ్ఎంసీ మూడు కార్పోరేషన్ల విభజన, కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పులు, సింగరేణి నైనీ బొగ్గు టెండర్ వివాదం, నిధుల దుర్వినియోగం, పార్టీ ఫిరాయింపులు, విద్యారంగ సమస్యలు వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి. ప్రతిపక్షాలకు కౌంటర్ గా కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, కాళేశ్వం వంటి అంశాలతో ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది. దీంతో ఈ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వంతో వేసవి ఎండలను మరిపించే స్థాయిలో వాడివేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది.
భారీ బందోబస్తుతో రక్షణ వలయం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయసభల సమావేశాలు సజావుగా కొనసాగేందుకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణం పరిసరాల చుట్టు పోలీసులు కంచెలను, బారీ కేడ్లను ఏర్పాటు చేశారు. పలు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీల అనుబంధ సంఘాలు ప్రజా సమస్యలపై అసెంబ్లీ ముట్టడి నిర్వహించే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మరోసారి సమ్మె నోటీసు ఇవ్వడం..ప్రభుత్వం ఈ నెల 26వరకు స్పందించని పక్షంలో మెరుపు సమ్మెతో పాటు అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram