Jagdish Reddy | సూర్యాపేటలో కాంగ్రెస్ అరాచక పాలన … మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఫైర్
సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన సాగిస్తుందని, రాజకీయ కక్షలతో ఉద్యోగులు, వ్యాపారులను, వైద్యులను దాడులతో వేధిస్తుందని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

విధాత : సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన సాగిస్తుందని, రాజకీయ కక్షలతో ఉద్యోగులు, వ్యాపారులను, వైద్యులను దాడులతో వేధిస్తుందని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన అధికారులు అక్రమంగా కూల్చివేసిన జాజు హోటల్‌ను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. సూర్యాపేటలో జరుగుతున్న అరాచక పాలనకు జాజు హోటల్ కూల్చివేత నిదర్శనమన్నారు. మూడుసార్లు ప్రజలు బుద్ధి చెప్పినా సోయి రాకుండా మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి మతిస్థిమితం తప్పి ప్రవర్తిస్తున్నారని, అధికారం వస్తే మంచి పనులు చేయాలేగాని, దాడులు దౌర్జన్యాలు చేస్తామనడం ఓట్లు వేయని వారిని హింసకు గురి చేస్తామనడం సరికాదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ విషయమై కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్నారు.
వందేళ్ల క్రితమే తిరుగుబాటు చేసిన చరిత్ర సూర్యాపేటదని ప్రజా ఉద్యమంతో రాక్షస చర్యలను ఎదుర్కొంటామన్నారు. జాజు హోటల్ ఎత్తు ప్రాంతంలో ఉన్నదని సూర్యాపేట సగం కొట్టుకుపోయిన ఇక్కడికి నీళ్లు వచ్చే అవకాశం లేదని, ఐదు నెలల క్రితం ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని నోటీసులు ఇచ్చారని ఇది కొత్త నిర్మాణం కాదని 25 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారని జగదీశ్‌రెడ్డి వివరించారు. కొందరు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ట్యాంక్ బండ్ అభివృద్ధి చెందడంతో ఆహ్లాదం కొరకు వచ్చేవారికి రుచికరమైన ఆహారం అందించేందుకు హోటల్ గా మార్చి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇరిగేషన్ శాఖ ఇచ్చిన నోటీసుల్లోనే తప్పు ఉందని, సంజాయిషి ఇవ్వకుండా కూల్చివేయడం అన్యాయంగా ఉందన్నారు. అధికారులు నిబంధనల మేరకు పనిచేయాలని, రాజకీయ ఒత్తిళ్లతో పనిచేస్తే వారికే నష్టమన్నారు.