పేదల ఆరోగ్యంకోసం మోదీ అనేక కార్యక్రమాలు: కిషన్ రెడ్డి
ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా మనకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు

విధాత,హైదరాబాద్: ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా మనకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ఆయన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన తెలంగాణ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌజ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి వంద మందిలో 95 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. రిటైర్ అయిన వారు పెన్షన్ మొత్తం వైద్య ఖర్చుల కోసమే వెచ్చించాల్సి వస్తోందన్నారు.
పేద,మధ్య తరగతి ప్రజలు కూడా అనారోగ్యం పాలైతే జీవితం మొత్తం సంపాదించిన సంపాదన వైద్యం కోసమే ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యం విషయంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి వ్యక్తికి ఏటా రూ.5 లక్షల ఉచిత బీమా అందించే ఆయుష్మాన్ భారత్ ఫథకాన్ని తీసుకొచ్చి, విజయవంతంగా ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందే వెసులుబాటు కల్పించారు. 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటీజన్లకు ఉచితంగా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నామని తెలిపారు.