ఎన్నికల్లో పోటీచేయను: బీజేపీ నేత బాబూమోహన్‌

ఎన్నికల్లో పోటీచేయను: బీజేపీ నేత బాబూమోహన్‌

విధాత, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచీ తాను పోటీ చేయడం లేదని బీజేపీ నేత బాబూమోహన్ వెల్లడించారు. పార్టీ కార్యకలాపాలకూ దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు. టికెట్ ఖరారులో దోబూచులాటతోనే బాబూమోహన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధిష్టానం ప్రకటించిన మొదటి జాబితాలో తన పేరు లేకపోవడం పట్ల మనస్తాపం చెందినట్లు తెలిపారు. వరుస జాబితాలను వెల్లడిస్తున్న పార్టీ, అభ్యర్థుల పేర్ల దాపరికం తనకు నచ్చలేదని కుండబద్ధలు కొట్టారు.

ఈ క్రమంలోనే తాను పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మరోవైపు కుటుంబంలోనూ చిచ్చు పెడుతున్నారని, తాజాగా తన కుమారుడికి టికెట్ ఇస్తున్నట్లు లీకులతో తెరపైకి తెస్తున్నారని అసంతృప్తి వెళ్లగక్కారు. టికెట్ కేటాయింపులో అధిష్టానం నాన్చుడు ధోరణితో విసుగు చెందానని, తనకు వరుస జాబితాల్లో ఏ జాబితాలో టికెట్ కేటాయిస్తారో స్పష్టం చేయాలని కోరారు. అధిష్టానం పెద్దలకు పలుసార్లు ఫోన్లలో సంప్రదించినా ఎవరూ అందుబాటులోకి రావడంలేదని పేర్కొన్నారు. పార్టీలో కొనసాగాలా? రాజీనామా చేయాలా? అనేది త్వరలోనే వెల్లడిస్తానని బాబూమోహన్ తెలిపారు.