- తెలంగాణ నుంచి వరంగల్ మహిళ ప్రాతినిథ్యం
- తన అనుభవాలను పంచుకున్న బండి మానెమ్మ
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
నేపాల్‌లో జరిగిన దక్షిణాసియా గ్రాస్‌రూట్స్ అసెంబ్లీ సదస్సులో తెలంగాణ మహిళా పారిశుధ్య వ్యాపారవేత్త బండి మానెమ్మ పాల్గొన్నారు. ఫ్రెష్ వాటర్ నెట్‌వర్క్ సౌత్ ఏషియా (FANSA) ఆధ్వర్యంలో 2026 జూన్ 12 ,13 తేదీలలో నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు నగరంలోని హోటల్ మల్లాలో “గ్రాస్‌రూట్స్ అసెంబ్లీ–2026 దక్షిణాసియా సదస్సు” నిర్వహించారు. ఈ సదస్సుకు స్వయం సహాయక సంఘాల వనరుల వ్యక్తి, కమ్యూనిటీ నాయకురాలు, వరంగల్ నగరానికి చెందిన బండి మానెమ్మ ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మానేమ్మ “లీడింగ్ చేంజ్ – ఎ ఉమెన్ ఛాంపియనింగ్ శానిటేషన్ ప్రోగ్రెస్” అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన అనుభవాలను సదస్సులో వివరించారు. స్వయం సహాయక సంఘ సభ్యురాలిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, క్రమంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంచుకున్నట్లు వివరించారు. తాను చేపట్టిన పనిని అంకితభావంతో చేస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలో పారిశుధ్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నట్లు తెలియజేశారు.
మానెమ్మ సేవలను గుర్తించిన మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ సబ్సిడీతో సెప్టిక్ ట్యాంక్ డీస్లడ్జింగ్ వాహనం కొనుగోలు చేసేందుకు సహకరించారు. దీని కోసం అవసరమైన మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుకుని పారిశుధ్య రంగంలో వ్యాపారవేత్తగా ఎదిగారు. ప్రస్తుతం ఆమె సెప్టిక్ ట్యాంకుల నుండి మురుగు వ్యర్థాలను సురక్షితంగా తొలగించే సేవలను అందిస్తూ, గృహ యజమానులకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరచడం తప్పనిసరి అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా స్థానిక స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ యజమానుల సంఘాల సహకారంతో ప్రతి కాలనీలో పారిశుధ్య మెరుగుదల కార్యక్రమాలను నిర్వహిస్తూ పరిశుభ్రమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. ఆమె సదస్సులో మాట్లాడుతూ “మహిళననే భయం లేకుండా నేను ఈ పారిశుధ్య సేవల రంగంలో కొనసాగుతున్నాను. అంకితభావం, నిబద్ధత ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించగలరు. ప్రతి మహిళ తన సామర్థ్యాన్ని గుర్తించి ధైర్యంగా ముందుకు సాగాలి” అని బండి మానెమ్మ పేర్కొన్నారు.
