కాంగ్రెస్ గూటికి భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే తెల్లం

అంతా ఊహించిన విధంగానే భద్రాచలం బీఆరెస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఆయన రేవంత్‌రెడ్డిని కలవడంతోనే ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని

కాంగ్రెస్ గూటికి భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే తెల్లం

రేవంత్‌ సమక్షంలో పార్టీలో చేరిక

కండువా కప్పి ఆహ్వానించిన పొంగులేటి

విధాత‌: అంతా ఊహించిన విధంగానే భద్రాచలం బీఆరెస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఆయన రేవంత్‌రెడ్డిని కలవడంతోనే ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని తేలిపోయింది. తాజాగా శనివారం తుక్కుగూడలో కాంగ్రెస్‌ బహిరంగసభ వేదికపై కనిపించి.. తన చేరికను ఖాయం చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వచ్చిన తెల్లం వెంకట్రావుకు సీఎం సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే తెల్లంతోపాటు ప‌లువురు భ‌ద్రాచ‌లం బీఆరెస్ నేత‌లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ స‌మ‌క్షంలోనే కాంగ్రెస్ కండువా క‌ప్పుకోవాల‌ని చూసినా.. మ్యానిఫెస్టో విడుద‌ల హ‌డావిడిలో స‌మ‌యం ల‌భించ‌లేదు. దీంతో ఆయ‌న ఆదివారం ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి స‌మ‌క్షంలో హ‌స్తం గూటికి చేరుకున్నారు. తెల్లం చేరికతో బీఆరెస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు పెరిగింది. కాంగ్రెస్‌లోకి బీఆరెస్‌ నుంచి 26 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తుక్కుగూడ సభకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో చేరికలు రాహుల్‌ సమక్షంలోనే ఉంటాయని భావించినా.. అటువంటిదేమీ జరుగలేదు.

కాంగ్రెస్ ద్వంద్వ నీతి: కేటీఆర్

పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిపై అనర్హత వేటు వేసేలా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో సవరణలు చేస్తామని రాహుల్‌ గాంధీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి, తెలంగాణలో మాత్రం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుననారని, ఫిరాయింపులపై ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నారని బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్‌ చేస్తూ.. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు. గెలిచేంత వరకూ ఒక మాట.. గెలిచాక ఇంకో మాట అన్నట్టుగా కాంగ్రెస్‌ పార్టీ తీరు ఉందని కేటీఆర్ విమర్శించారు. బీఆరెస్‌ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి మరీ పార్టీలో చేర్చుకుంటున్న కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే బీజేపీకి, కాంగ్రెస్‌కు తేడా ఏముందన్నారు. పార్టీ ఫిరాయించిన వాళ్లకు ఏకంగా ఎంపీ టికెట్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ‘ఇదేనా కాంగ్రెస్‌ రీతి.. నీతి? ఇంత జిమ్మిక్కులు, డ్రామాలు ఎందుకనో అర్థం కావడం లేదు రాహుల్‌జీ’ అని ట్విటర్‌లో ప్రశ్నించారు.