తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలిసేందుకు బెంగళూరు వెళ్లడం కాంగ్రెస్ రాజకీయ వర్గాలలో ఆసక్తి కరంగా మారింది. నిన్న భట్టితో కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఉత్తమ్, శ్రీధర్ బాబులు భేటీ సందర్బంగా కొండా సురేఖపై చర్యలకు సిఫారసు చేస్తూ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికపై కీలక చర్చలు జరిపినట్లుగా సమాచారం. అనంతంర కొండా మురళి తన కూతురు చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అనంతరం భట్టి ఖర్గేతో భేటీ నిమిత్తం బెంగళూరు వెళ్లారు. గురువారం కూడా ఆయన అక్కడే ఉన్నారు.
క్రమశిక్షణా కమిటీ కొండా సురేఖపై చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో కొండా సురేఖ అంశంతో పాటు రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి వ్యవహారాలపై కూడా భట్టి ఈ రోజు ఖర్గేతో భేటీలో చర్చించనున్నట్లుగా కాంగ్రెస్ వర్గాల టాక్. అంతకుముందు కొండా సురేఖ సైతం ఖర్గేను కలిసి కూతురు సుస్మితా సీఎం రేవంత్ రెడ్డిపైన చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే లోపు సురేఖ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలన్న ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగిస్తారా? లేక రాజీ దిశగా చర్యలు తీసుకుంటారా? అన్నదానిపై ఖర్గేతో భేటీలో భట్టి చర్చించనున్నట్లుగా సమాచారం.
తక్షణమే కొండాపై వేటు వేయడమా?..లేక మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ వరకు ఆగడమా? అన్నదానిపై ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. కొండా కుటుంబం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ నాయకత్వం అభిప్రాయాలపైనా భట్టి-ఖర్గే మధ్య చర్చలు కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఖర్గేతో భట్టి భేటీ అనంతరం కొండా సురేఖ వ్యవహరంతో పాటు రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డిపై చర్యల విషయంలో పార్టీ నుంచి కీలక ఆప్డేట్ వెలువడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
