భూమాత.. అన్నదాతకు భరోసా
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పేరు వింటేనే రైతుల గుండెల్లో దడ పుట్టేది. ఎందుకంటే ఆ పోర్టల్ అంతా తప్పులతడకే. భూ క్రయవిక్రయాలకు సంబంధించి రాష్ట్ర రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది.

ధరణితో రైతు జీవితం ధ్వంసం..
భూమాతతో ఇక వెలుగులే..
భూ సమస్యల నివారణ దిశగా భూమాత..
మ్యుటేషన్ సమయంలో విచారణకు వెసులుబాటు
తప్పుగా తేలితే మ్యుటేషన్ నిలిపివేత
ప్రతి భూకమతానికి భూధార్ నంబర్..
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక సెక్షన్..
ప్రజాభిప్రాయ సేకరణకు గడువు ఆగస్టు 23
హైదరాబాద్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పేరు వింటేనే రైతుల గుండెల్లో దడ పుట్టేది. ఎందుకంటే ఆ పోర్టల్ అంతా తప్పులతడకే. భూ క్రయవిక్రయాలకు సంబంధించి రాష్ట్ర రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. అసలు ధరణి పోర్టల్ ఉన్న సమస్యలు ఏంటి..? దాని వల్ల రైతులకు కలుగుతున్న ఇబ్బందులు ఏంటి..? అనే అంశాలను కాంగ్రెస్ పార్టీ నిశితంగా పరిశీలించింది. ధరణి పోర్టల్ వల్ల కలుగుతున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాడింది. భూ సమస్యలకు నిలయంగా మారిన ధరణి పోర్టల్‌ను తాము అధికారంలోకి రాగానే ఎత్తేసి.. దాని స్థానంలో భూమాత అనే పోర్టల్‌ను తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. అన్నదాతకు ఇచ్చిన మాట ప్రకారం.. భూమాత పోర్టల్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే భూ క్రయవిక్రయాలు, తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన ఆర్‌వోఆర్ – 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు.. ‘ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్-2024’ పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును నిన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాసనసభ ముందుకు తెచ్చారు. భూ రికార్డుల నిర్వహణ కోసం వీలైనంత త్వరగా ‘ఆర్‌వోఆర్- 2024’ను తెచ్చేందుకు సంకల్పించినట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని.. వారిచ్చిన సూచనలు, సలహాల మేరకు కొత్త ఆర్‌వోఆర్ బిల్లుకు తుదిరూపమిచ్చి సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ధరణిలో పరిష్కారం దొరకని సమస్యలను పరిష్కారించడంతో పాటు భవిష్యత్తులోనూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా ఈ కొత్త సమగ్ర ఆర్‌వోఆర్ – 2024 ముసాయిదాకు రూపకల్పన చేసినట్లు రెవెన్యూ మంత్రి తెలిపారు.
ఆర్‌వోఆర్ -2024 ముసాయిదా ప్రకారం.. భూహక్కుల రికార్డులను ఎప్పటికప్పుడు సవరించడం, ఇప్పటి వరకు పాస్‌బుక్‌లు రాని భూముల సమస్యలను పరిష్కరించడం, సర్వే చేసి కొత్తగా భూ హక్కుల రికార్డు తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశాలుగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూ ఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ వంటి సెక్షన్లను ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు.
రికార్డ్ ఆఫ్ రైట్స్ -2024 చట్టం ముసాయిదా బిల్లు రూపకల్పన కోసం రాష్ట్ర రెవెన్యూ వర్గాలు విస్తృతంగా కసరత్తు చేశాయి. తెలంగాణలో ఇప్పటి వరకు అమలైన 1936, 1948, 1971, 2020 నాటి చట్టాలను నిశితంగా పరిశీలించి, వాటి అమలు వల్ల వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకొని కొత్త చట్టాన్ని రూపొందించారు. తెలంగాణలో ఆర్‌వోఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాలను అంచనా వేసి మొత్తం 20 సెక్షన్లతో 23 పేజీలతో ముసాయిదాను సిద్ధం చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో 18 రాష్ట్రాల్లోని ఆర్‌వోఆర్ చట్టాలను ప్రభుత్వం పరిశీలించింది. బీహార్‌లో అమల్లో ఉన్న మ్యుటేషన్ చట్టాన్ని కూడా అధ్యయనం చేసింది. భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య(భూధార్), గ్రామీణ ప్రాంత ఆస్తుల రికార్డు తయారు చేయడం ద్వారా భవిష్యత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే మార్పులకు అనుగుణంగా చట్ట సవరణలు చేయాల్సిన అవసరం లేకుండా అమలు చేసే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాలకు మార్గం చూపేలా సెక్షన్లను ఏర్పాటు చేసింది. ఆర్‌వోఆర్ -2024 ముసాయిదా రూపకల్పనలో భూచట్టాల నిపుణుడు ఎం సునీల్ కుమార్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీఎంఆర్‌వో ప్రాజెక్టు డైరెక్టర్ వి లచ్చిరెడ్డి భాగస్వాములయ్యారు. ‘ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్-2024’ ముసాయిదాను భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)www.ccla.telangana.gov.inవెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది ప్రభుత్వం.
ఆర్‌వోఆర్-2024 ముసాయిదాలోని ముఖ్యాంశాలు..
– సెక్షన్ – 4 లో కొత్తగా ఆర్‌వోఆర్ రికార్డు రూపొందించుకోవడానికి, ఉన్న దాన్ని సవరించుకోవడానికి, అసలు ఆర్‌వోఆర్‌లోకి ఎక్కని వాటిని తీసుకురావడానికి అవకాశం ఉంది. సర్వే జరిగినా ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.
– 18 రకాలుగా భూమిపై హక్కులు సంక్రమించే అవకాశం ఉంది. ఈ 18 రకాల్లో ఏ రకంగా హక్కుల బదలాయింపు జరిగినా.. ఆర్‌వోఆర్ – 2024లో నమోదు చేయాల్సిందే. ఇక రిజిస్టర్డ్ దస్తావేజులు, వారసత్వం, భాగ పంపకాల ద్వారా హక్కుల బదలాయింపునకు పాత చట్టంలోని నిబంధననే కొనసాగించారు. ఈ పద్ధతుల్లో తహసీల్దారే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేస్తారు. అయితే మ్యుటేషన్ చేసే సమయంలో విచారణ జరిపే వెసులుబాటు కల్పించారు.
– ఏవైనా అభ్యంతరాలు ఉంటే మ్యుటేషన్ నిలుపుదల చేయొచ్చు. ఆర్వోఆర్ – 2020 లో ఈ అవకాశం లేదు. భాగ పంపకాలు, వారసత్వం, వీలునామా లాంటి వారికి మ్యుటేషన్ చేసే అధికారం కూడా తహసీల్దార్‌కే అప్పగించనున్నారు. విచారణ అనంతరమే దీన్ని చేపట్టాల్సి ఉంటుంది. ఒక వేళ తిరస్కరిస్తే కారణాలు తెలియజేయాల్సి ఉంటుంది.
– రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసే సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్‌కు వెళ్లే వారు ఈ మ్యాప్‌ను తప్పకుండా తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్ వివాదాలకు చెక్ పెట్టేలా ఈ కొత్త నిబంధన తెస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన చట్టంలో ఈ నిబంధన లేదు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాతనే ఈ మ్యాప్ తప్పనిసరి అని ప్రస్తుత బిల్లులో పొందుపరిచారు.
– ఆర్‌వోఆర్ – 2020 చట్టం కింద నిలిచిపోయిన 9 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి సెక్షన్ – 6 వెసులుబాటు కల్పిస్తుంది. దరఖాస్తుల విచారణ అధికారిగా ఆర్డీవో వ్యవహరించనున్నారు. గతంలో కలెక్టర్లకు అధికారం ఉండే. ఈ దరఖాస్తుల పరిష్కార సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అయితే కొత్తగా సాదాబైనామాల దరఖాస్తులను తీసుకుని పరిష్కరించే అధికారాన్ని ఈ బిల్లులో ప్రతిపాదించారు. కొత్త దరఖాస్తుల పరిష్కార సమయంలో మాత్రం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
– కొత్తగా గ్రామీణ ప్రాంత ఇంటి స్థలాలకు(ఆబాదీ) కూడా ప్రత్యేక హక్కుల రికార్డు తయారు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. భూధార్‌తో పాటు ఈ ఆబాదీల ఆర్‌వోఆర్‌కు అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు. గత చట్టంలో ఆర్‌వోఆర్ రికార్డుకు, గ్రామ పహాణీకి సంబంధం ఉండేది కాదు. ఈ కొత్త చట్టంలో హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో ఆ హక్కుల రికార్డును నమోదు చేసేలా నిబంధన విధించారు.
– తహీసల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే అప్పీల్, రివిజన్‌కు కొత్త చట్టం అవకాశం ఇస్తుంది. కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్లకు అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. తర్వాత సీసీఎల్ఏకు సెకండ్ అప్పీల్ చేసుకోవచ్చు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన చట్టంలో లేదు.
– కొత్త చట్టం ద్వారా పహాణీ ఉన్నతీకరణ(అప్‌డేట్) చేపట్టనున్నారు. రాష్ట్రంలో 2014 నుంచి పహాణీల అప్‌డేషన్ నిలిచిపోయింది.
భూములకు భూధార్ అనే ప్రత్యేక నంబర్..
రికార్డ్ ఆఫ్ రైట్స్ -2024 ముసాయిదా ప్రకారం.. ప్రతి కమతానికి ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్‌ను కేటాయించనున్నారు. ఈ ప్రత్యేక నంబర్‌ను ‘భూధార్’ అని పిలువనున్నారు. అక్షాంశ, రేఖాంశాలతో సరిహద్దులు, భూమి యజమాని వివరాలను పొందుపరుస్తారు. ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములకు ప్రత్యేక సిరీస్‌తో భూధార్ నంబర్‌ను కేటాయించనున్నారు. ఈ కొత్త చట్టం ద్వారా తాత్కాలిక భూధార్, శాశ్వత భూధార్ అనే రెండు విధానాలను చట్టం ద్వారా అమల్లోకి తేనున్నారు. ప్రతి కమతానికి ఒక ప్రత్యేక భూధార్ సంఖ్య కేటాయిస్తారు. తాత్కాలిక భూధార్‌ను రికార్డుల పరిశీలన ద్వారా ఇస్తారు. భూముల సమగ్ర సర్వే చేపట్టిన తర్వాత శాశ్వత భూధార్ సంఖ్య ఇవ్వనున్నారు.
ఆర్‌వోఆర్ -2024 ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ..
ఈ ముసాయిదా బిల్లుపై ప్రభుత్వం విస్తృత ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు సిద్ధమైంది. ఇందుకుగాను సీసీఎల్‌ఏ ఈ నెల 23 వరకు గడువు విధించింది. ప్రజలు తమ అభిప్రాయాలను ఈ మెయిల్, లేదా పోస్టు ద్వారా తెలియజేసేందుకు అవకాశం కల్పించింది. మొయిల్ ద్వారా అయితే ror2024rev@telangana.gov.inద్వారా తెలియజేయాలి. లేఖ ద్వారానైతే ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్‌ఏ కార్యాలయం, నాంపల్లి స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, అబిడ్స్, హైదరాబాద్ 500001 చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ముసాయిదా బిల్లుపై సూచనలు, సలహాలు స్వీకరించిన తర్వాత.. బిల్లుకు తుదిరూపమిచ్చి.. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.