MLA Maheshwar Reddy | మేఘా ఓ క్రిమినల్ కంపెనీ.. ఆధారాలు బయటపెడుతా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మాణ సంస్థ మేఘా ఒక క్రిమినల్ కంపెనీ అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

MLA Maheshwar Reddy | నిర్మాణ సంస్థ మేఘా (Megha) ఒక క్రిమినల్ కంపెనీ అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు ఎక్కడ అందచేయాలంటే అక్కడ అందించేందుకు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ధ మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మేఘా సంస్థ మీద ఉన్న ఆరోపణలపై సీబీఐ ఎంక్వైరీకి (CBI inquiry) సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు. పాలకులకు కమిషన్లు కట్టబెడుతూ నాసిరకం పనులు చేస్తూ విలువైన ప్రజాధనం దోపడి, దుర్వినియోగానికి కారణమవుతున్న మేఘాను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పెత్తనం మాత్రం మేఘా కృష్ణారెడ్డిదే అన్నారు. ప్రభుత్వం మారిన కాంట్రాక్టర్ మారడా? అని ప్రశ్నించారు. నాసిరకం పనులు చేసిన ఆయనకే మళ్లీ కాంట్రాక్టులు ఇస్తున్నారని తప్పుబట్టారు. సుంకిశాల పంప్‌హౌజ్ (Sunkishala pumphouse) కూలి పది రోజులు అయినా ప్రభుత్వం దృష్టికి రాలేదా? అని అడిగారు. ఒకవేళ ప్రభుత్వం దృష్టికి వచ్చినా.. మేఘా కృష్ణారెడ్డిని కాపాడుకునేందుకు అసలు విషయాన్ని దాచారా? అని ప్రశ్నించారు. గతంలో సుంకిశాల అంచనా వ్యయం రూ.800 కోట్లు అని.. కాని మేఘా కృష్ణారెడ్డి దానిని రూ.4 వేల కోట్లకు పెంచారని కీలక ఆరోపణలు చేశారు. కాంట్రాక్టుల పేరుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డికి రాష్ట్ర సంపద దోచి పెడుతున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
మేఘ కృష్ణా రెడ్డి పెద్ద క్రిమినల్… ఇవిగో ప్రూఫ్స్ | BJLP Leader Alleti Maheshwar Reddy Press Meet#alletimaheshwarreddy #PressMeet #BJPTelangana #livestreaming #nirmalmla #TelanganaBJP #telanagana #bjlpleader #telanganabjpfloorleader #bjlpleaderalletimaheshwarreddy… pic.twitter.com/rQFq8Om86X
— Alleti Maheshwar Reddy (Modi Ka Parivar) (@maheshreddy_bjp) August 10, 2024
నాసిరకం పనులు చేస్తుందంటూ మేఘా కంపెనీకి కేంద్ర ప్రభుత్వం (central government) షోకాజ్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయి 10రోజులు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి రాలేదా అంటూ ఆయన మండిపడ్డారు. సుంకిశాల పనులు మేఘా కంపెనీయే చేసిందన్నారు. అసలు మేఘా మీద చర్యలు ఎందుకు లేవు? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కూడా పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారని, సీబీఐకి ఫిర్యాదు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడేమో క్రిమినల్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డికే సీఎం దోచిపెడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతిని సీబీఐకి సిఫార్సు చేయడం లేదని అడిగారు. దాని మీద రిటైర్డ్ జడ్జి (retired judge) కమిటీ వేశారని, జడ్జికి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, అడిగిన కీలక ఫైళ్లను సైతం ప్రభుత్వం ఆయనకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ కమిటీని ప్రభుత్వమే నీరు గార్చే పనిలో ఉందని ఏలేటి అనుమానం వ్యక్తం చేశారు. కొడంగల్ ఎత్తిపోతల పనులు కూడా మేఘాకే ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారని మాకు సమాచారం ఉందని ఆరోపించారు. తెలంగాణలో గొర్రెలను తినేటోడు పోయి.. బర్రెలను తినేటోడు వచ్చాడన్నారు. మాజీ సీఎం, బీఆరెస్ అధినేత కేసీఆర్ దోచుకున్న అవినీతి సొమ్ములో రేవంత్ రెడ్డి వాటా అడుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని చెప్పుకొచ్చారు. వీరిద్దరికి మధ్యవర్తిగా కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి సెటిల్మెంట్ చేస్తున్నట్లు మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.