Warangal : నిర్లక్ష్యం పై ‘నీటిలో’ నిరసన జెండాలు

వరంగల్ బస్టాండు నిర్మాణంలో ఆలస్యం పై బీజేపీ శ్రేణులు నీటిలో తెప్పలపై నిరసన తెలిపారు. నాయకుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.

Warangal : నిర్లక్ష్యం పై ‘నీటిలో’ నిరసన జెండాలు

విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగరంలో కొత్తగా బస్తాండు కడుతామంటూ… ఉన్న బస్టాండును కూల్చేసి పెద్ద పెద్ద గోతులు తీసి పనులు అర్ధాంతరంగా వదిలివేయడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర్మాణ స్థలంలో నిలిచిన నీటిలో తెప్పల పై బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయంలో చేపట్టి ఆగిపోయిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం , స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ పట్టించుకోకపోవడం పై బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవి కుమార్ నాయకత్వంలో నిరసన ప్రదర్శించారు. నిర్మాణ స్థలంలో తీసిన గోతులతో నిలిచిన నీటిలో తెప్పల ప్రయాణాన్ని పార్టీ శ్రేణులతో కలిసిప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండ సురేఖ, మాజీ సీఎం కేసీఆర్ కు ఉచిత పడవ ప్రయాణం కల్పిస్తున్నామంటూ వారి మాస్క్లు ధరించి నిరసన తెలిపారు.

కబ్జాలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి పైలేదు: గంటా

బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు పేదల భూముల్ని కబ్జా చేయడంలో.. సెటిల్‌మెంట్‌ పనుల్లో ఉన్న శద్ర్ధ బస్టాండ్ నిర్మాణం పై లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆరోపించారు. ఆ పార్టీల నేతలు ఈ పనుల్లో బీజీబిజీగా ఉన్నారని ఆరోపించారు. వరంగల్ అభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యం వల్ల వరంగల్ ప్రజలు బస్టాండ్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ రాజధాని ఓరుగల్లులో బస్టాండ్ లేకపోవడం సిగ్గుచేటన్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదని విమర్శించారు. మంత్రి సురేఖ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మార్క్ గా ఈ బస్టాండ్ మారిందని విమర్శించారు. ఈ నేతల పాపాలకు వరంగల్ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎమ్మెల్యే నరేందర్ బస్టాండ్‌ పేరుతో నయవంచన చేస్తే.. ప్రస్తుత మంత్రి సురేఖ అసమర్థతతో బస్టాండ్‌ నిర్మాణానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. కోట్ల రూపాయలతో కొత్త బస్టాండ్‌ నిర్మిస్తామంటూ ఇదిగో.. నమూనా బస్టాండ్‌ అంటూ నరేందర్ మాయమాటలు చెప్పి ఉన్నదానిని కూల్చాడని మండిపడ్డారు. చారిత్రక నగరమైన వరంగల్‌ కనీస అభివృద్ధికి ఒక్క అడుగు పడకపోవడంతో ఈ నిరసన చేపట్టామన్నారు. బస్టాండ్ సమస్య తీర్చకుంటే ప్రజాప్రతినిధుల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రత్నం సతీష్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, నాయకులు కంభంపాటి పుల్లారావు, బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, జలగం రంజిత్ రావు, గజ్జెల శ్రీరాములు జిల్లా, మండల పదాధికారులు, వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు మహిళా మోర్చా పాల్గొన్నారు.