పాలమూరులో ‘బ్రహ్మోస్’ క్షిపణుల తయరీ?.. దేవరకద్రలో 416 ఎకరాల స్థలం గుర్తింపు

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదన ముందుకు వచ్చింది. 416 ఎకరాల భూమి గుర్తింపు, NH-44 అనుసంధానం, హైదరాబాద్ రక్షణ సంస్థల వ్యవస్థతో తెలంగాణకు ఇది భారీ అవకాశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

BrahMos missile representational image with Devarakadra railway station

దేవరకద్రలో బ్రహ్మోస్ యూనిట్ ప్రతిపాదన పాలమూరులో పారిశ్రామిక ఆశలు రేకెత్తిస్తోంది.

హైదరాబాద్‌: రక్షణ రంగ తయారీలో తెలంగాణకు మరో భారీ అవకాశం తలుపు తడుతోంది. ప్రపంచంలోని వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటైన బ్రహ్మోస్‌కు సంబంధించిన తయారీ కేంద్రాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసే ప్రతిపాదనపై కదలికలు మొదలైనట్లు సమాచారం. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని చౌదర్‌పల్లి, బస్వాయిపల్లి, జీనుగురాల గ్రామాల సమీపంలో సుమారు 416 ఎకరాల భూమిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ ప్రాజెక్టుకు తుది అనుమతులు లభిస్తే, ఇది కేవలం పాలమూరు పారిశ్రామిక ముఖచిత్రాన్నే కాకుండా తెలంగాణ రక్షణరంగ వ్యవస్థలో భారీ మార్పులు తెచ్చే పెద్ద పెట్టుబడిగా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు వ్యవసాయం, వలసలు, సాధారణ పరిశ్రమల చర్చలకే పరిమితమైన పాలమూరు ప్రాంతం.. రక్షణ తయారీ రంగంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశాన్ని ఈ ప్రతిపాదన తెచ్చిపెట్టింది.

దేవరకద్ర ఎందుకు కీలకం?

భూమి, సముద్రం, గగనం నుంచి ప్రయోగించగల సామర్థ్యం బ్రహ్మోస్ ప్రత్యేకత.

బ్రహ్మోస్ వంటి అత్యంత సున్నితమైన రక్షణ తయారీ ప్రాజెక్టులకు భద్రత, భూమి లభ్యత, రోడ్డు కనెక్టివిటీ, విమానాశ్రయానికి చేరువ, ఇప్పటికే ఉన్న సాంకేతిక పర్యావరణం వంటి అంశాలు కీలకం. దేవరకద్ర ఈ కోణాల్లో అనుకూలంగా ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రతిపాదిత స్థలం జాతీయ రహదారి 44కి సమీపంలో ఉంది. హైదరాబాద్‌ను బెంగళూరుతో కలిపే ఈ మార్గం దేశంలో అత్యంత ముఖ్యమైన రవాణా కారిడార్లలో ఒకటి. అలాగే శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉండటం కూడా లాజిస్టిక్స్ పరంగా ప్రయోజనకరంగా భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన సంస్థలు ఇప్పటికే బలంగా ఉన్నాయి. ప్రత్యేకించి డిఆర్​డిఎల్​ పక్కన ఇప్పటికే బ్రహ్మోస్​ ఇంటెగ్రేషన్​ కాంప్లెక్స్​(BrahMos Integration Complex – BIC) ఉంది. ఇక్కడ క్షిపణులకు వివిధ వ్యవస్థలతో అనుసంధానించే పని జరుతుంది. అదేకాకుండా, DRDO ల్యాబ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మిధాని, HAL కార్యకలాపాలు, ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీలు తెలంగాణకు బలమైన పునాది కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు దగ్గరగా, విస్తారమైన భూమి అందుబాటులో ఉండే మహబూబ్‌నగర్‌ను విస్తరణ కేంద్రంగా చూడవచ్చన్న అభిప్రాయం ఉంది.

మూడు గ్రామాల్లో భూమి గుర్తింపు

దేవరకద్రలో ప్రతిపాదిత బ్రహ్మోస్ యూనిట్ కోసం చౌదర్‌పల్లి, బస్వాయిపల్లి, జీనుగుర్ల పరిసరాల్లో భూమి పరిశీలన జరిగినట్లు సమాచారం.

దేవరకద్ర మండలంలోని చౌదర్‌పల్లి, బస్వాయిపల్లి, జీనుగురాల పరిసరాల్లో భూమిని పరిశీలించినట్లు తెలుస్తోంది. పరిశ్రమల శాఖ స్థాయిలో భూమి గుర్తింపు, ప్రాథమిక సౌకర్యాల పరిశీలన, ప్రాజెక్టు అనుకూలతపై కసరత్తు జరిగినట్లు సమాచారం.

భూమి సుమారు 400 నుంచి 416 ఎకరాల మధ్య ఉండొచ్చని చెబుతున్నారు. రక్షణ తయారీ యూనిట్‌కు ప్రధాన ఉత్పత్తి ప్రాంతం మాత్రమే కాకుండా, పరీక్షలు, నిల్వ, భద్రతా వలయం, రవాణా సౌకర్యాలు, అనుబంధ పరిశ్రమల కోసం కూడా విస్తారమైన స్థలం అవసరం అవుతుంది. అందుకే ఇలాంటి ప్రాజెక్టులకు పెద్ద భూప్రాంతం అవసరం అవుతుంది.

అయితే ఈ దశలో ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదన, స్థల పరిశీలన, అనుమతుల దశలోనే ఉంది. కేంద్ర రక్షణ శాఖ, బ్రహ్మోస్ ఏరోస్పేస్(BrahMos Aerospace), రాష్ట్ర ప్రభుత్వం స్థాయిల్లో తుది నిర్ణయాలు పూర్తయ్యాకే నిర్మాణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

‘బ్రహ్మోస్’ అంటే ఏమిటి?

బ్రహ్మోస్ యూనిట్ ప్రతిపాదనతో తెలంగాణ రక్షణ తయారీ పటంలో మరింత ప్రాధాన్యం పొందే అవకాశం.

బ్రహ్మోస్(BrahMos) అనేది భారత్‌–రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థ(Supersonic Cruise Missile System). భారత DRDO, రష్యాకు చెందిన NPO Mashinostroyenia భాగస్వామ్యంతో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఏర్పడింది. బ్రహ్మపుత్ర, మోస్క్వా నదుల పేర్ల నుంచి ‘బ్రహ్మోస్’ అనే పేరు వచ్చింది.

ఈ క్షిపణిని భూమి, సముద్రం, గగనం, జలాంతర్గామి వేదికల నుంచి ప్రయోగించవచ్చు. వేగం, ఖచ్చితత్వం, వివిధ వేదికల నుంచి ప్రయోగించగల సామర్థ్యం కారణంగా బ్రహ్మోస్ భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన ఆయుధంగా గుర్తింపు పొందింది.

ఇటీవలి సంవత్సరాల్లో బ్రహ్మోస్ కేవలం భారత సైనిక సామర్థ్యానికే కాకుండా, రక్షణ ఎగుమతులకూ ముఖ్యమైన ఉత్పత్తిగా మారింది. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ వ్యవస్థల ఎగుమతి ఒప్పందం తర్వాత, ఈ క్షిపణి అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా భారత తయారీ సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది. ప్రస్తుతం యూఏఈ కూడా ఈ వ్యవస్థను కొనుగోలు చేయాలనే ఆసక్తితో ఉందనే వార్తలు వస్తున్నాయి.

లక్నో తర్వాత తెలంగాణపై దృష్టి

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ(BrahMos Integration & Testing facility) ఇప్పటికే ప్రారంభమైంది. ఆ యూనిట్‌లో అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ వంటి కీలక ప్రక్రియలు జరుగుతున్నాయి. లక్నో యూనిట్ ప్రారంభం తర్వాత బ్రహ్మోస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, సరఫరా గొలుసును బలపరచడం, దేశీయ రక్షణ తయారీని విస్తరించడం వంటి అంశాలపై కేంద్రం దృష్టి పెట్టింది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త యూనిట్‌పై చర్చలు జరగడం సహజమైన పరిణామంగా పరిశ్రమ వర్గాలు చూస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న రక్షణ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ సామర్థ్యాలు ఈ ప్రతిపాదనకు బలం చేకూరుస్తున్నాయి.

₹500 కోట్ల పెట్టుబడి అంచనా

ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు ప్రారంభ దశలో సుమారు ₹500 కోట్ల పెట్టుబడి రావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రక్షణ తయారీ యూనిట్‌లు సాధారణ పరిశ్రమల కంటే భిన్నంగా ఉంటాయి. భద్రతా ప్రమాణాలు, నాణ్యత పరీక్షలు, ప్రత్యేక పరికరాలు, అధునాతన తయారీ సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం అవుతాయి.

ఈ యూనిట్ ఏర్పడితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 నుంచి 2,000 ఉద్యోగాలు రావొచ్చని అంచనా. తయారీ, ఇంజినీరింగ్, నాణ్యత నియంత్రణ, లాజిస్టిక్స్, భద్రత, మెయింటెనెన్స్, పరిపాలన, అనుబంధ సేవల రంగాల్లో ఉపాధి అవకాశాలు ఏర్పడే వీలుంది.

దీంతో పాటు చిన్న, మధ్య తరహా అనుబంధ పరిశ్రమలకు కూడా కొత్త అవకాశాలు తెరుచుకోవచ్చు. రక్షణ తయారీ రంగంలో ఒక్క ప్రధాన యూనిట్ వచ్చినా, దానికి సరఫరా చేసే భాగాలు, సామాగ్రి, పరికరాలు, ఎలక్ట్రానిక్స్, ప్యాకేజింగ్, రవాణా వంటి రంగాల్లో స్థానిక వ్యాపారాలకు అవకాశం పెరుగుతుంది.

పాలమూరుకు పారిశ్రామిక మలుపు

బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ భారత రక్షణ రంగంలో కీలక ఆయుధంగా గుర్తింపు పొందింది.

మహబూబ్‌నగర్ జిల్లా చాలా కాలంగా వలసల జిల్లాగా గుర్తింపు పొందింది. సాగునీటి ప్రాజెక్టులు, రోడ్డు కనెక్టివిటీ, హైదరాబాద్‌కు చేరువ, కొత్త పెట్టుబడులతో ఈ ప్రాంతం గత కొన్నేళ్లుగా మార్పు దశలో ఉంది. బ్రహ్మోస్ వంటి హై-టెక్ రక్షణ తయారీ యూనిట్ ఇక్కడికి వస్తే, అది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు.. ప్రాంతీయ అభివృద్ధికి కొత్త మలుపు అవుతుంది.

దేవరకద్ర పరిసరాల్లో మౌలిక వసతులు మెరుగుపడే అవకాశం ఉంది. రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, భద్రతా వ్యవస్థలు, కార్మికులకు నివాసాలు, శిక్షణా కేంద్రాలు, విద్యా సంస్థలు, చిన్న వ్యాపారాలు పెరగొచ్చు. హోటళ్లు, రవాణా, రియల్ ఎస్టేట్, సేవా రంగాలకూ దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.

తెలంగాణకు డిఫెన్స్ క్లస్టర్ అవకాశం

తెలంగాణ ఇప్పటికే దేశంలోని ముఖ్యమైన ఏరోస్పేస్, డిఫెన్స్ కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ పరిసరాల్లో DRDO ల్యాబ్స్, BDL, MIDHANI, ECIL, HAL కార్యకలాపాలు, అంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థల భాగస్వామ్యాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో కూడా ప్రెసిషన్ ఇంజినీరింగ్, డ్రోన్స్, ఏరోస్ట్రక్చర్స్, రక్షణ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సంస్థలు పెరుగుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో మహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ యూనిట్ ఏర్పడితే, హైదరాబాద్‌కు దక్షిణంగా కొత్త రక్షణ తయారీ వలయం ఏర్పడే అవకాశం ఉంది. హైదరాబాద్–మహబూబ్‌నగర్–బెంగళూరు మార్గం భవిష్యత్తులో డిఫెన్స్, ఏరోస్పేస్ తయారీకి మరింత కీలకంగా మారవచ్చు.

ఇంకా తుది అనుమతులు రావాలి

అయితే ఈ ప్రాజెక్టు అమలు విషయంలో ఇంకా కీలక దశలు మిగిలే ఉన్నాయి. భూమి బదలాయింపు, పర్యావరణ అనుమతులు, భద్రతా అనుమతులు, కేంద్ర రక్షణ శాఖ ఆమోదం, బ్రహ్మోస్ ఏరోస్పేస్ తుది నిర్ణయం వంటి అంశాలు పూర్తయ్యాకే ప్రాజెక్టు నిర్మాణ దశకు వెళ్లే అవకాశం ఉంటుంది.

రక్షణ రంగ ప్రాజెక్టులు సాధారణ పరిశ్రమల మాదిరిగా వేగంగా ప్రకటించి వెంటనే ప్రారంభించే విధంగా ఉండవు. భద్రత, వ్యూహాత్మక అవసరాలు, సరఫరా వ్యవస్థ, భూమి స్థితి, సాంకేతిక అవసరాలు అన్నీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ముందడుగు పడుతుంది.

తెలంగాణకు భారీ అవకాశం

ప్రతిపాదన తుది ఆమోదం పొందితే, ఇది తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఒకవైపు రాష్ట్రానికి భారీ పెట్టుబడి, మరోవైపు పాలమూరుకు ఉపాధి అవకాశాలు, ఇంకోవైపు దేశ రక్షణ తయారీ సామర్థ్యానికి కొత్త బలం లభించవచ్చు.

హైదరాబాద్ ఇప్పటికే సాంకేతిక, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో బలమైన స్థానం సంపాదించింది. ఇప్పుడు ఆ బలం మహబూబ్‌నగర్ దిశగా విస్తరిస్తే, తెలంగాణ రక్షణ తయారీ పటంలో మరింత స్పష్టంగా కనిపించే రోజు దూరంలో ఉండకపోవచ్చు.

 

Latest News