DTC Kishan Naik | రవాణా శాఖలో ఘరానా అవినీతి: డీటీసీ కిషన్ నాయక్ వద్ద వందల కోట్ల అక్రమాస్తులు స్వాధీనం
తెలంగాణ రవాణా శాఖలో భారీ అవినీతి బయటపడింది. మహబూబ్‌నగర్ జిల్లా డీటీసీ కిషన్ నాయక్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. డాక్యుమెంట్ల ప్రకారం రూ.12.72 కోట్ల ఆస్తులు, మార్కెట్ విలువలో రూ.200–250 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడగా, 15 బృందాలతో రాష్ట్రవ్యాప్తంగా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కేసు రవాణా శాఖలో లంచాల దందాపై తీవ్ర చర్చకు దారితీసింది.
Telangana Transport Scam: DTC Kishan Naik Arrested, Assets Worth Over ₹250 Crore Seized by ACB
- అవినీతి తిమింగలం డీటీసీ కిషన్ నాయక్ అరెస్ట్ : రిమాండ్
- రూ.250 కోట్లకు పైగా అక్రమాస్తులు..
- 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు
- ఏసీబీ చరిత్రలోనే అరుదైన కేసు
(విధాత క్రైమ్ బ్యూరో)
హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖలో అవినీతి ఎంత లోతుగా పాతుకుపోయిందో మరోసారి బట్టబయలైంది. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) కిషన్ నాయక్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే షాక్ తిన్నారు.
ఈ కేసులో కిషన్ నాయక్‌ను అరెస్ట్ చేసిన అనంతరం ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నేటి (డిసెంబర్ 24, 2025) తెల్లవారుజామున ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
సోదాల్లో డాక్యుమెంట్ల ప్రకారం రూ.12.72 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించగా, బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఇవి రూ.200 నుంచి రూ.250 కోట్లకు పైగా ఉంటాయని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు బయటపడటం ఏసీబీ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం.
15 బృందాలతో ఏకకాలంలో సోదాలు.. డ్రైవర్ పరారీ

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడన్న ఫిర్యాదుల నేపథ్యంలో డిసెంబర్ 23 తెల్లవారుజామున ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లి ఆర్‌ఆర్ నగర్ కాలనీలోని కిషన్ నాయక్ నివాసంతో పాటు, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, మహబూబ్‌నగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం సహా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో మొత్తం 12–15 చోట్ల 15 ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించారు.
ఒకసారి ఈ అవినీతి అనకొండ ఆస్తుల చిట్టా చూద్దామా..!
సోదాల్లో నిజామాబాద్‌లో లహరి ఇంటర్నేషనల్ హోటల్‌లో 50 శాతం వాటా, రాయల్ ఓక్ ఫర్నిచర్ షోరూమ్, అశోక టౌన్‌షిప్‌లో రెండు ఫ్లాట్లు, సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, 10 ఎకరాల కమర్షియల్ స్థలం, పాలీహౌస్ షెడ్, రూ.1.37 కోట్ల నగదు, కిలోకు పైగా బంగారు ఆభరణాలు, ఇన్నోవా క్రిస్టా, హోండా సిటీ వంటి లగ్జరీ వాహనాలు వెలుగుచూశాయి. మహబూబ్‌నగర్ డీటీవో కార్యాలయం నుంచి కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆస్తుల్లో చాలా భాగం బినామీల పేర్లపై ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ముఖ్యంగా కిషన్ నాయక్ ప్రైవేట్ డ్రైవర్ శివశంకర్‌ను ప్రధాన బినామీగా అనుమానిస్తోంది. అల్వాల్‌లోని అతడి నివాసంలో సీసీ కెమెరాలు ఉండగా, అతడి పేరుతో కార్లు, నగదు, స్థలాలు ఉన్నట్లు సమాచారం. దాడుల విషయం తెలిసిన వెంటనే శివశంకర్ కుటుంబంతో సహా పరారయ్యాడు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.

1994లో అసిస్టెంట్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరిన కిషన్ నాయక్, బోధన్, మద్నూర్ చెక్‌పోస్ట్, నిజామాబాద్‌లో ఎంవీఐగా, మేడ్చల్, మెహిదీపట్నం ఆర్టీవోగా పనిచేశారు. ఏడాది క్రితం మహబూబ్‌నగర్ డీటీసీగా బాధ్యతలు చేపట్టారు. నెలకు రూ.1–1.25 లక్షల జీతం మాత్రమే ఉన్న అధికారికి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న కోణంలో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అవినీతి నిరోధక చట్టం(ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్) సెక్షన్ 13(1)(b), 13(2) కింద కేసు నమోదు చేశారు.
రవాణా శాఖలో లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్ సేవల పేరుతో సాగుతున్న లంచాల దందాపై ఈ కేసు తీవ్ర చర్చకు దారితీసింది. లంచాలు డిమాండ్ చేసే అధికారులపై పౌరులు టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా వాట్సప్ 9440446106కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. వారి గుర్తింపును పూర్తి రహస్యంగా ఉంచుతామని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram