ఒక కత్తి.. రెండు దాడులు.. కాంగ్రెస్, బీజేపీలపై బీఆరెస్ విమర్శలు

- డైవర్షన్ పాలి టిక్స్ సాధనంగా వ్యూహం
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ దుబ్బాక బీఆరెస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటన అధికార బీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పటికే పరస్పర విమర్శలతో సాగుతున్న ప్రచార ఘట్టాన్ని మరింత హీట్ ఎక్కించింది.
ముఖ్యంగా బీఆరెస్ పార్టీ తమ అభ్యర్థిపై జరిగిన దాడిని సీరియస్‌గా తీసుకుంటునే ఈ ఘటనను ఎన్నికల ప్రచారాస్త్రంగా విపక్షాలపైకి ఎక్కుపెట్టింది. నిందితుడు కాంగ్రెస్ పార్టీ వాడని, రాజకీయంగా బీఆరెస్‌ను ఎదుర్కోలేని కాంగ్రెస్ భౌతిక దాడులకు పాల్పడుతుందంటూ సీఎం కేసీఆర్ సహా మంత్రులు బహిరంగ ఆరోపణలు చేస్తు కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు సాగిస్తున్నారు.
ఇదే సమయంలో దుబ్బాక నియోజకవర్గంలో మాత్రం స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావును లక్ష్యంగా చేసుకుని బీఆరెస్ శ్రేణులు నిరసనలకు దిగడం, బీజేపీ శ్రేణులపైన, ఆ పార్టీ ఆఫీస్‌పైన దాడులకు దిగడం ద్వారా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కాయి. దుబ్బాక బంద్ సైతం బీఆరెస్ నిర్వహించింది. సోషల్ మీడియా వేదికగా రఘునందన్‌రావు టార్గెట్‌గా బీఆరెస్ ప్రచార దాడిని ఉదృతం చేసింది.
ఇలా ఒక కత్తి దాడి ఘటన ఆసరగా బీఆరెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం బయట కాంగ్రెస్ లక్ష్యంగా, దుబ్బాక లోపల బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు లక్ష్యంగా విభిన్న ప్రచార దాడులను నిర్వహించిన తీరు కత్తిదాడి ఘటన చుట్టు ముసురుకున్న రాజకీయాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. బీఆరెస్ రాజకీయ లక్ష్యాల విమర్శల వెల్లువలో కత్తిదాడి ఘటనకు అసలు కారణాలేమిటి…నిందితుడు ఎందుకు దాడిచేశాడన్న అంశాలు మసకబారిపోయాయి.
కత్తి వేటుకు..వైఫల్యాలు మాటుకూ..
కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి ఘటనను ఎన్నికల ప్రచార సమయంలో బీఆరెస్ తనకు అనుకూలంగా మలుచుకుని తనకు వ్యతిరేకంగా విపక్షాలు సాగిస్తున్న విమర్శల నుంచి ప్రజల దృష్టిని మళ్లీంచే సాధనంగా మార్చుకున్నది. ఎన్నికల వేళ గ్రూప్ 2 విద్యార్థినిలు ప్రవళిక, రెహమత్‌ల ఆత్మహత్యల అంశం, గ్రూప్ పరీక్షల రద్దులతో నెలకొన్న ప్రతికూలతతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ఎదురైన అప్రతిష్ట, ఆరు గ్యారంటీల హామీలతో కాంగ్రెస్ జోష్‌లోకి రావడం వంటి వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు కత్తిదాడి ఘటన బీఆరెస్‌కు అందివచ్చిన అస్త్రంగా నిలిచింది.
అసలే మాటల దాడుల్లో, డైవర్షన్ పాలిటిక్స్‌లో ప్రతిపక్షాల కంటే రెండాకులు ముందే ఉండే బీఆరెస్ అధినేత సీఎం కేసీఆర్, సహా కేటీఆర్, హరీశ్‌రావులు కత్తి దాడి ఘటనను తమ ప్రచార దాడికి పదునైన అస్త్రంగానే మలుచుకుని కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా తమ దాడి ఉదృతం చేయడం ఆసక్తికర మలుపు. మరోవైపు దాడి వెనుక రాజకీయ లక్ష్యాలు, దురుద్దేశాలు లేవని, నిందితుడి వ్యక్తిగత కోణంలోనే ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి జరిగిందని కాంగ్రెస్, బీజేపీలు బీఆరెస్ ఆరోపణల దాడిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
అయితే దాడికి గురైన ఎంపీ పట్ల వ్యక్తమయ్యే సానూభూతిని దాటి ప్రతిపక్షాల కౌంటర్ అటాక్ జనంలోకి వెళ్లకుండా కత్తి దాడి ఘటనను సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు తమ సభల్లో పదేపదే ప్రస్తావిస్తూ వీలైనంత మేరకు ప్రతిపక్ష పార్టీలను ఇరుకన పెడుతున్నారు. వారు ఇదే రీతిలో తమ పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కత్తి దాడి ఘటన అస్త్రానికి ప్రచార పర్వంలో సానపెడుతునే ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో భారీ వర్షాలు వరదల సమయంలో క్లౌడ్ బరెస్టు..విదేశీ కుట్ర అన్న సీఎం కేసీఆర్ మాటలు..మేడిగడ్డ బ్యారేజీ కుంగితే విద్రోహ కుట్రనేమో అంటూ బీఆరెస్ జనబాహుళ్యంలోకి వదిలిన మాటలు, కేంద్రంతో విరోధం వస్తే ధాన్యం కొనుగోలు ప్రక్రియపై గగ్గోలు వంటివన్ని డైవర్షన్ పాలిటిక్స్‌లో గులాబీ నేతల చతురతకు సంకేతంగా వారు గుర్తు చేస్తున్నారు.