విధాత, హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ కోల్పోయిన ఎమ్మెల్యే సీట్లు ప్రధాన కారణాల్లో ఒకటి. మళ్లీ అధికారంలోకి రావాలంటే ఆ రెండు జిల్లాల్లో బీఆర్ఎస్ పుంజుకొని తీరాల్సిందే. అందుకు అవసరమైన రాజకీయ వ్యూహాల్లో భాగంగా బీఆర్ఎస్ నాయకత్వం పదును పెడుతుంది. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో, బయట కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఆ జిల్లా మంత్రులను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తునే మరోవైపు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల మంత్రుల శాఖల్లోని లోపాలు, అక్రమాలపై వరుస ఆరోపణలు సంధిస్తుండటం కాక రేపుతుంది. ఇప్పటికే నైనీ బొగ్గు గనులు, వెలుగుమట్ల భూదాన్ భూముల సమస్యలతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించి అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా బీఆర్ఎస్ నాయకత్వం ఎటాక్ చేసింది. బడ్జెట్ అంశాల ఆసరగా భట్టిపైన, రైతు భరోసా, యూరియా కొరత అంశాల క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుపైన, ఖమ్మం ప్రాజెక్టుల పనులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై గులాబీ పార్టీ నేతలు నిరంతర విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.
నల్లగొండ మంత్రులపై హరీశ్ రావు అవినీతి ఆరోపణాస్త్రాలు
నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్ఆండ్ బీ శాఖలో హ్యామ్ రోడ్ల టెండర్లలో రూ.18వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ తాజాగా హరీశ్ రావు ఆరోపణలతో సంచలనం రేపారు. ఇది ఇలా ఉండగానే మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన పౌరసరఫరాల శాఖలో ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి నిర్ణయంతో భారీ కుంభకోణం జరిగిందంటూ అసెంబ్లీలో సోమవారం హరీశ్ రావు కీలక ఆరోపణలు చేశారు. సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న ప్రేమ్ చంద్ గార్గ్ ను సలహాదారుగా పెట్టుకున్నారా? లేదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఏడాదిగా కాకినాడ ఎయిర్ పోర్టులో పడిఉన్న 7,500మెట్రిక్ టన్నుల బియ్యం సంగతేమిటని నిలదీశారు. గత యాసంగి ధాన్యం బోనస్ రూ.1100కోట్లను ఎప్పడు ఇస్తారు?.. ఆధిత్య బిర్లా గ్రూప్ కు టెండర్ పిలిచి ఇచ్చారా..నామినేషన్ మీద ఇచ్చారా? అన్న అంశాలపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై హౌస్ కమిటీ వేసి విచారిస్తే ఆధారాలు సమర్పిస్తామని స్పష్టం చేశారు. హ రీశ్ రావు ఆరోపణలను ఉత్తమ్ కుమార్ రెడ్డి తిప్పికొట్టారు. హరీశ్ రావు సూచించిన వాళ్లకు టెండర్ ఇవ్వలేదని నాపై అసత్య ఆరోపణలు చేయడం సమంజం కాదన్నారు. ప్రేమ్ చంద్ అనే వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు.
అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వరి ధాన్యం వేయవద్దంటున్నారని, యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా? అని ప్రశ్నించారు. వచ్చే సీజన్ లో వరి వేయాలా వద్దా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ ఖరీఫ్ సీజన్ లో కేంద్రం 56లక్షల మెట్రిక్ టన్నులకే అనుమతించినప్పటికి 70లక్షలు కొనుగోలు చేశామని, అదే పద్దతిలో యాసంగి ధాన్యం కూడా ప్రతి గింజ కొంటామని తెలిపారు. బోనస్ ఇప్పటికే 3,500కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. అలాగే కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పనులకు సంబంధించి కూడా మంత్రి ఉత్తమ్ పై అసెంబ్లీ సమావేశాలలో, బయట బీఆర్ఎస్ దాడి కొనసాగిస్తుండటం ఆ పార్టీ రాజకీయ వ్యూహాలకు నిదర్శనంగా కనిపిస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరోవైపు బీఆర్ఎస్ తను కోల్పోయిన ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తుంటే..ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం తాము బలహీనంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో బలం పెంచుకునే వ్యూహాలు అమలు చేస్తుండటం ఆసక్తికరం. ఇందులో భాగంగా ఇప్పటికే జీహెచ్ఎంసీని మూడు కార్పోరేషన్లుగా విభజించి…వాటి ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తుండటం విశేషం.
ఇవి కూడా చదవండి :
Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి ఊహించని దెబ్బ పడనుందా.. మెగా ఫ్లాపుల జాబితాలో చిత్రం చేరే ప్రమాదం
Gold Silver Price Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
