Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి ఊహించ‌ని దెబ్బ ప‌డ‌నుందా.. మెగా ఫ్లాపుల జాబితాలో చిత్రం చేరే ప్రమాదం

Ustaad Bhagat Singh | మెగా ఫ్యామిలీకి ఈ మధ్యకాలంలో వరుసగా ఎదురవుతున్న ఫ్లాపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.

  • By: Sandeep |    movies |    Published on : Mar 23, 2026 12:07 PM IST
Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి ఊహించ‌ని దెబ్బ ప‌డ‌నుందా.. మెగా ఫ్లాపుల జాబితాలో చిత్రం చేరే ప్రమాదం

Ustaad Bhagat Singh | మెగా ఫ్యామిలీకి ఈ మధ్యకాలంలో వరుసగా ఎదురవుతున్న ఫ్లాపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.

మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే నిరాశపరిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.41.01 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. అదే సమయంలో ధురంధర్: ది రివెంజ్ వంటి భారీ చిత్రంతో పోటీ పడటం కూడా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

రూ.10 కోట్ల మార్క్ కూడా దాట‌లేదు..

మొదటి రోజు తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. రెండో రోజు కలెక్షన్లు రూ.10.62 కోట్లకు పడిపోగా, మూడో రోజు స్వల్పంగా పెరిగి రూ.10.68 కోట్ల వద్ద ఆగిపోయాయి. ఆదివారం అయిన నాలుగో రోజు కూడా రూ.10 కోట్ల మార్క్ దాటలేకపోవడం చిత్ర బలహీనతను స్పష్టంగా చూపించింది. మొత్తం మొదటి వీకెండ్‌లో ఈ సినిమా సుమారు రూ.60.8 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. షేర్ పరంగా చూస్తే రూ.40 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయింది.

ఈ చిత్రానికి రూ.126 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వాలంటే కనీసం రూ.200 కోట్ల గ్రాస్ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే ఆ లక్ష్యానికి దూరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఓవర్‌సీస్ మార్కెట్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉండగా, దాదాపు 70 శాతం నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మెగా హీరోల ఫ్లాపులు..

ఇటీవల మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు వరుసగా నిరాశపరుస్తున్నాయి. చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’, రామ్ చరణ్ చేసిన ‘గేమ్ చేంజర్’, అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే వాటికి వచ్చిన భారీ ఓపెనింగ్స్ కారణంగా కొంతమేర నష్టాలు తగ్గించుకోగలిగాయి.

కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రం ఆ అవకాశాన్ని కూడా కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అజ్ఞాతవాసితో పోల్చినా ఓపెనింగ్స్ తక్కువగా ఉండడం గమనార్హం. సోమవారం నుంచి కలెక్షన్లు మరింత పడిపోతే, ఇది మెగా ఫ్యామిలీకి మరో భారీ డిజాస్టర్‌గా నిలిచే ప్రమాదం ఉందని ట్రేడ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇకపై వచ్చే రోజుల్లో కలెక్షన్లు ఎలా ఉంటాయో, ఈ సినిమా గమ్యం ఎటు తిరుగుతుందో చూడాలి.