బీఆర్ఎస్ నాయకుల అడ్డగింత.. నీళ్లివ్వలేని మీరూ ఓట్లడుగుతున్నారా?

- నిలదీసిన హంగిర్గ గ్రామస్థులు
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం తానూర్ మండలం హంగిర్గ గ్రామంలో బుధవారం ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను గ్రామస్థులు అడ్డుకున్నారు. పదేళ్లుగా గుర్తుకు రాని మా గ్రామం.. ఎన్నికల వేళ గుర్తుకు వచ్చిందా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీళ్లు, నిధులు, పథకాలు, గ్రామ అభివృద్ధి, రోడ్డు, మురికి కాలువల నిర్మాణాలు ఎక్కడ అంటూ నిలదీశారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు అని చెప్పిన మీరు.. ఇంతవరకు ఒక నల్లా బిగించలేదని, చుక్క తాగునీరు రావడంలేదని వాపోయారు.
పదేళ్ల కాలంలో మంచినీళ్లు కూడా ఇవ్వని మీరు ఓటు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసారని విమర్శించారు. సిటింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకటి కూడా అమలు చేయలేదని గ్రామస్థులు ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుని నిరసన తెలియజేశారు.