Harish Rao | ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఎక్కడా: హరీశ్‌రావు

రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ పాఠ్యపుస్తకాలు అందించకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ట్విటర్ వేదికగా మండిపడ్డారు.

  • Publish Date - June 19, 2024 / 02:13 PM IST

విధాత : రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటి వరకూ పాఠ్యపుస్తకాలు అందించకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ పెట్టారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధి లేమికి పాఠ్యపుస్తకాల పంపిణీలో వహించిన నిర్లక్ష్యమే నిదర్శనమన్నారు.

422 జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది పేద, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారన్నారని, వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలోని కొన్ని జూనియర్ కాలేజీల్లో మొదటి ఏడాది జీరో అడ్మిషన్స్ నమోదవడం పట్ల ప్రభుత్వం దృష్టి సారించి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

అదేవిధంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు, జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వర్తించే 1,654 గెస్ట్ ఫ్యాకల్టీని రెన్యువల్ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని తమ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్‌ రావు వెల్లడించారు

Latest News