Harish Rao | పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేదాక నిద్రపోము : హరీశ్‌రావు
ఎమ్మెల్యేలు ఉన్నా వెళ్లిపోయినా బీఆరెస్‌కు పోయేదేమీ లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వైఎస్ హయాంలోనూ బీఆరెస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని గుర్తు చేశారు.

వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయం
ఎమ్మెల్యేలు పోయినా పోయేదేమి లేదు
బీఆరెస్‌ను ఎవరూ ఏమి చేయరు
టీఆరెస్ కండువాలో కనిపించిన హరీష్ రావు
మళ్లీ పార్టీ పేరు మారబోతుందన్న చర్చ
విధాత, హైదరాబాద్ : పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు మేము నిద్రపోమని, సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత కోసం పోరాడుతామని, పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బుధవారం పటాన్ చెరు బీఆరెస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. 2001లో కేసీఆర్ ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించారని, అప్పుడు కూడా కుట్రలు జరిగాయని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన 12మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడని, కానీ కుట్రలు ఫలించలేదని, న్యాయం గెలిచిందని.. కేసీఆర్ 14 ఏళ్లు పోరాటం ఫలించి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. నాడు బీఆరెస్ పార్టీ పని అయిపోయిందనన్న వాళ్లు తర్వాత కనిపించకుండా పోయారన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా పోయేదేమి లేదన్నారు.
ఎమ్మెల్యే పోతే పార్టీ పోదని, పటాన్‌చెరులో మంచి కార్యకర్తలు ఉన్నారని, ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ ఎగిరేది గులాబి జెండానే అన్నారు. మీరందరూ కష్టపడితేనే ఇక్కడ బీఆరెస్ ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి గెలిచారని, పటాన్‌చెరుకు ఏం కావాలంటే అది ఇచ్చామని, రోడ్లు, తాగునీళ్లు, స్టేడియం వంటి ఎన్నో అందించామని, నిధులు వరద పారించామని చెప్పారు. గూడెం పోయినా గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు నిద్రపోమన్నారు. మహిపాల్ రెడ్డికి మూడుసార్లు టికెట్లిచ్చి గెలిపిస్తే పార్టీ మారడానికి మనసెలా వచ్చింది? ఇది న్యాయామా? నీకిది తగునా? అని ప్రశ్నించారు. వైసీపీ నీకు టికెట్ ఇవ్వకపోతే తల్లిలా దగ్గరికి తీసుకుని నీకు టికెట్ ఇచ్చింది బీఆరెస్ పార్టీ అని గుర్తు చేశారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పుదాం అని వచ్చిన నాకే మీరు వేలాది మందిగా తరలివచ్చి ధైర్యం చెప్పారన్నారు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకుందామని, మళ్లీ గులాబీ జెండా ఎగిరేవరకు కష్టపడి పనిచేద్దామన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు మేము నిద్రపోము.
సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాడుతాం.
పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో
ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది.– పటాన్చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
ఈ సందర్భంగా… pic.twitter.com/uV2cURlSRK
— BRS Party (@BRSparty) July 17, 2024
పాలేవో..నీళ్లేవో ప్రజలు గ్రహిస్తున్నారు
ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారని, కేసీఆర్ పాలనను, కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటున్నారన్నారు. పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అన్న రేవంత్ తనే ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నాడన్నారు. జీవోలో రేషన్ కార్డు ఆధారంగా రైతు రుణమాఫీ అని చెప్పారని, వ్యతిరేకత వస్తోందని మాట మార్చుతున్నారని, పాస్ బుక్ ఉంటే సరిపోతుందని నోటి మాటతో చెప్తున్నారని, అదే నిజమైతే జీవో మార్చాలని డిమాండ్ చేశారు. వడ్లకు బోనస్ అని తర్వాత సన్నవడ్లకే బోనస్ అంటూ 90 శాతం రైతులకు బోనస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఎగ్గొట్టాడని, ఇప్పుడు రుణ మాఫీ విషయంలోనూ అదే చేస్తున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీకి పీఎం కిసాన్ నిబంధనలు ఎందుకు..? రేషన్ కార్డు నిబంధనలు ఎందుకని, గతంలో మేం ఎట్లా చేశామో అలాగే పాసుపుస్తకం ఆధారంగా చేయాలన్నారు. రు నూరైనా సరే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆరెస్ పార్టీయేనన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఏ ఎన్నికలు వచ్చినా కష్టపడి పనిచేసి గెలుద్దామని, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఐదేళ్లకు మించి అధికారంలో లేదన్నారు. ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ సరిగ్గా అమలు కాలేదని, బస్సు తప్ప అంతా తుస్సే నని, ఆ బస్సులోనూ లొల్లులేనని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ లీడర్లను వదిలిపెట్టరని, పరిపాలన స్తంభించిందని, జీతాలు అందడం లేదని, పాలేంటే నీళ్లేంటో తెలిసిపోతుందన్నారు. మ్మెల్యే పోతే పార్టీ పోదని, పటాన్ చెరులో మంచి కార్యకర్తలు ఉన్నారని, ఇక్కడ ఎగిరేది మళ్లీ మన జెండానే అన్నారు. పదేళ్ల పాలనలో మనం అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించామని, కొన్ని విషయాలు విస్మరించామని, కార్యకర్తలపై, నాయకత్వంపై దృష్టిపెడతామన్నారు. మన మంచితనాన్ని ప్రజలు గుర్తిస్తారని, పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. దానికి ఇప్పట్నుంచే సిద్ధం కావాలని, కేడర్‌కు పార్టీ అండగా ఉంటుందన్నారు.
టీఆరెస్ కండువాతో హరీశ్‌రావు
పటాన్ చెరు కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు టీఆరెస్ పేరుతో ఉన్న పార్టీ గులాబీ కండువాను కప్పుకుని పాల్గొనడం చర్చనీయాంశమైంది. కార్యకర్తలు పొరపాటున పాత కండువా కప్పివుంటారా లేక నిజంగానే పార్టీ పేరు మళ్లీ టీఆరెస్‌గా మార్చుకోబోతున్నందునే టీఆరెస్ పేరుతో పార్టీ కండువాలు ముద్రించారా అన్న చర్చ సాగుతుంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో 2001ఏప్రిల్ 27న టీఆరెస్ పేరుతో పార్టీ స్థాపించారు. రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణలో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చాకా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న లక్ష్యంతో టీఆరెస్ పార్టీ పేరును 2022ఆక్టోబర్ 5 తేదీన బీఆరెస్ గా మార్చారు.
అనంతరం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోగా..2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలువకుండా పార్టీ దారుణ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మళ్లీ పార్టీ పేరును బీఆరెస్ నుంచి టీఆరెస్‌గా మార్చాలన్న వాదన కేడర్‌లో బలంగా వినిపిస్తుంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులలో మెజార్టీ సైతం టీఆరెస్ పార్టీ పేరునే కోరుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ తిరిగి పార్టీ పేరు మార్చవచ్చన్న ప్రచారం రేకెత్తింది. ఈ క్రమంలో పటాన్ చెరు కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు టీఆరెస్ పేరుతో ఉన్న పార్టీ కండువాను కప్పుకుని కనిపించడం పార్టీ పేరుమార్పు చర్చను మళ్లీ తెరపైకి తెచ్నినట్లయ్యింది.