Deshapati Srinivas : తెలంగాణ సొమ్ము ఏపీ టోల్ గేట్లకు ఎందుకు?

ఏపీ టోల్ గేట్లకు తెలంగాణ ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. టోల్ మినహాయింపులో ప్రభుత్వ వైఖరిపై విమర్శలు చేశారు.

Deshapati Srinivas : తెలంగాణ సొమ్ము ఏపీ టోల్ గేట్లకు ఎందుకు?

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును ఏపీ టోల్ గేట్లకు ఖర్చు చేయడం ఏ రకమైన పరిపాలన అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సంక్రాంతికి విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా ఏపీ వెళ్లే వారికి టోల్ గేట్ చార్జీలు మినహాయించాలని, అవసరమైతే ఆ మొత్తం మేమే చెల్లిస్తామని తెలంగాణ ఆర్ ఆండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల కేంద్రానికి రాసిన లేఖపై దేశపతి స్పందించారు. టోల్ మినహాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై మండిపడ్డారు. పంతంగి, కొర్లపాహాడ్ వద్ద మినహాయింపు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలోని చిల్లకల్లు టోల్ డబ్బులనూ రాష్ట్ర ఖజానా నుంచే చెల్లిస్తారా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుండి వేల సంఖ్యలో ప్రజలు రాయలసీమ మార్గంలో ప్రయాణిస్తారని.. ఆ రూట్లలో టోల్ గేట్ల వద్ద మినహాయింపు ఎందుకు ప్రకటించలేదు? అంటూ దేశపతి నిలదీశారు.

బతుకమ్మ, దసరా పండుగలకు హైదరాబాద్ నుండి లక్షలాది మంది సొంత ఊళ్లకు వెళ్లే టైంలో.. ఈ టోల్ మినహాయింపు ఆలోచన ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డల పండుగలు మీకు పండుగలు కావా? అప్పుడు ట్రాఫిక్ కష్టాలు మీకు కనిపించలేదా? తెలంగాణ ప్రజల ఈ వివక్ష ఎందుకు అంటూ మండిపడ్డారు. రాబోయే దసరా, బతుకమ్మ పండుగలకు కూడా.. ఇదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం ఇప్పుడే ప్రకటించాలని దేశపతి డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

ONGC Gas Leak : ఏపీలో ఓఎన్జీజీ గ్యాస్ లీక్..భారీగా ఎగిసిపడుతున్న మంటలు
Chandrababu : నది జలాలపై వివాదంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు