Kavitha resignation| నా రాజీనామా ఆమోదించండి : కన్నీటితో కవిత వినతి

ఎమ్మెల్సీ పదవికి చేసిన తన రాజీనామాను ఆమోదించాలని బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత శాసన మండలి వేదికగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కన్నీటితో విజ్ఞప్తి చేశారు.

Kavitha resignation| నా రాజీనామా ఆమోదించండి : కన్నీటితో కవిత వినతి

విధాత, హైదరాబాద్ : ఎమ్మెల్సీ పదవికి చేసిన తన రాజీనామాను(Kavitha resignation) ఆమోదించాలని బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత శాసన మండలి వేదికగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కన్నీటితో విజ్ఞప్తి (emotional speech in council)చేశారు. కవిత మండలి వేదికగా తన రాజీనామాకు దారితీసిన పరిణామాలను భావోద్వేగంతో కన్నీళ్ల పర్యంతమై వివరించారు.  తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ స్ఫూర్తితో తాను అడుగుపెట్టానని..బతుకమ్మ ఉత్సవాల పేరుతో ఉద్యమ ఉదృతికి కృషి చేశానని తెలిపారు. 2004నుంచి రాష్ట్ర సాధనలో తెలంగాణ జాగృతి తరుపున చేసిన కృషితో పాటు చట్టసభలలో తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు బీఆర్ఎస్ ఎంపీగా, ఎమ్మెల్సీగా తను చేసిన కృషిని వివరించారు. నిజమాబాద్ ఎంపీ టికెట్ అడ్డుకోలేదని.. పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేశానన్నారు.

కన్నీటి పర్యంతమైన కవిత

పార్టీలో తనను మొదటి రోజు నుంచే అడ్డుకునే ప్రయత్నం చేశారని కవిత కన్నీటి పర్యంతమయ్యారు. నా వద్దకు ఎప్పుడు కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తల పైరవీలకు రాలేదని..బీడీ కార్మికులు, ఉద్యోగస్తులు, మహిళలు వంటి శ్రామిక వర్గాలే తనవద్దకు సహాయం కోసం వచ్చాయని, నా చేతనైనంత వరకు సహాయం చేశాయన్నారు. బీఆర్ఎస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, పార్టీ విధానాలను ప్రశ్నించినందుకు కక్షగట్టి పార్టీ నుంచి బహిష్కరించారని వాపోయారు. బీఆర్ఎస్ పార్టీ మౌత్ పీస్ గా ఉన్న మీడియా నాకు మద్దతుగా నిలవలేదన్నారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ పాలనలో అన్యాయం జరిగిందన్నారు. సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి, జిల్లా కలెక్టరేట్లు ఇలా..బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన ప్రతి భవనంలో అవినీతి జరిగింది అని, సిద్దిపేట, సిరిసిల్లలో ప్రారంభానికి ముందే కలెక్టరేట్లు నీటమునిగాయని కవిత విమర్శించింది. ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలకు గండి కొట్టారన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు చేసిన దురాగతలపై పార్టీ అధినాయకత్వానికి తెలిపిన ప్రయోజనం లేదన్నారు. నేరెళ్ల దళితులపై దాడి..బోధన షుగర్ పార్టీ తెరవకపోవడం వంటి అన్యాయాలు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేరేళ్ల దళితులకు న్యాయం చేయడం లేదని వ్యాఖ్యానించారు.

నా తండ్రి కేసీఆర్ చుట్టు దురాగతాలను కూతురుగా నాకున్న చొరవతో ఆయనకు వివరించానని కవిత తెలిపారు. అయినా వాటిని అడ్డుకోలేదని వాపోయారు. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు కూడా తాను అంగీకరించలేదన్నారు. తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని..జాతీయ స్థాయిలో ఏం చేస్తారని బీఆర్ఎస్ గా మార్చుకున్నారని కవిత విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోలేదని, లక్షకోట్లు ఖర్చు పెట్టిన నీళ్లు రాలేదని, ఓ కంపెనీ పారిశ్రామిక వేత్తలు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పాలనలో భారీగా లబ్ధి పొందారన్నారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టారన్నారు. కేసీఆర్ తెలంగాణ రాకముందు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి,తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోషించారని విమర్శించారు. కొందరు నేతలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు 4 లక్షలకు 5 లక్షలకు అమ్ముకున్నారన్నారు.

కేసీఆర్ కక్షతో నన్ను జైలులో పెట్టారు

కేసీఆర్ పై కక్షతో నన్ను జైల్లో పెట్టారని, నేను ఒంటరిగా ఈడీ, సీబీఐలపై కొట్లాడానని కవిత స్పష్టం చేశారు. పార్టీ అండగా నిలబడకపోవడం నాకు బాధకల్గించిందని వాపోయారు. 8ఏళ్లుగా పార్టీలో నన్ను తీవ్ర ఇబ్బందుల పాలు చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ వచ్చాక పీసీ. ఘోష్ కమిటీకి వ్యతిరేకంగా కేసీఆర్ కు మద్దతుగా కొట్లాడానని, కేసీఆర్ ను విమర్శిస్తే బీఆర్ఎస్ నుంచి ప్రతిఘటన లేదని, కేటీఆర్, హరీష్ రావులను అంటే మాత్రం ఆందోళన చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ 8పేజీల రాజ్యాంగం ఒక జోక్ అని, నా సస్పెండ్ లో అందులోని ఏ నిబంధనలు పాటించలేదని విమర్శించారు. 20సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పడిన కష్టాన్ని మరిచి అన్యాయంగా సస్పెండ్ చేశారన్నారు. హరీష్ రావు లాంటి అవినీతి పరుల పేర్లు చెప్పగానే నన్ను సస్పెండ్ చేశారని, ఎలాంటి నైతికత లేని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని కవిత తెలిపారు. సస్పెండ్ చేసే ముందు కనీసం నా వివరణ కూడా అడగలేదు అని, నన్ను బహిష్కరించే ముందు రాత్రికి రాత్రే క్రమశిక్షణా కమిటీ పుట్టుకొచ్చింది అన్నారు. జాతీయ పార్టీగా ఎదగాలి అనుకున్న ఒక పార్టీని ఇలా నడపడం కరెక్ట్ కాదు అని కవిత హితవు పలికారు.

నాది ఆత్మగౌరవ పంచాయతీ

నాది ఆస్తుల పంచాయతీ అని, ఆత్మగౌరవం పంచాయతీ కాదని కాంగ్రెస్ ఆరోపిస్తుందని, కాని లక్ష్మినరసింహస్వామి దేవుడి మీద, నా ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చెబుతున్నానని నాది ఆస్తుల పంచాయతీ కాదని, ఆత్మగౌరవ పంచాయతీ అని కన్నీటితో కవిత స్పష్టం చేశారు. 0.3శాతం మాత్రమే బీఆర్ఎస్ లో మహిళలకు ప్రాతినిధ్యం ఉందని విమర్శించారు. రాణి రుద్రమ దేవి గూర్చి మాట్లాడుతున్న పార్టీలు మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదన్నారు. నీళ్లు, విద్య విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ చేస్తే ప్రజలు తప్పకుండా బుద్ది చెబుతారని కవిత తెలిపారు. నేను నిజం పక్షాన, నైతికత పక్షాన ఉన్నానని, బీఆర్ఎస్ లో వాస్తవాలు కేసీఆర్ కు తెలియకుండా నాపై కక్షగట్టి సస్పెండ్ చేశారన్నారు.

వ్యక్తిగా వెలుతున్నా..శక్తిగా తిరిగొస్తా

నేను వ్యక్తిగా ఈ సభలో నుంచి బయటకు పోతానని, కాని భవిష్యత్తులో ఓ శక్తిగా తిరుగొస్తానని, తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తానని కవిత భావోద్వేగంతో తెలిపారు. ‘తెలంగాణ జాగృతి’.. రాజకీయ పార్టీగా మారుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే భావోద్వేగాల మధ్య రాజీనామా చేయవద్దని తాను సూచిస్తున్నానని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కాలమే నిర్ణయిస్తుందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. కాని ఇప్పటికే 4నెలలు గడిచిందని, చాల సుదీర్ఘంగా ఆలోచించి రాజీనామా చేశానని, బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదని నా రాజీనామా ఆమోదించాలని కవిత పునరుద్ఘాటించారు.