BRS MLA harishrao | 650 పేజీల రిపోర్టు పెట్టండి.. సర్కారును చీల్చిచెండాడుతాం : మాజీ మంత్రి హరీశ్‌రావు

జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెల్లడించిన నివేదిక మొత్తం ట్రాష్‌ అని మాజీ మంత్రి, బీఆరెస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. అన్నీ అబద్దాలు.. అవాస్తవాలు.. రాజకీయ దురుద్దేశాలేనని తేల్చి చెప్పారు.

BRS MLA harishrao | 650 పేజీల రిపోర్టు పెట్టండి.. సర్కారును చీల్చిచెండాడుతాం : మాజీ మంత్రి హరీశ్‌రావు

BRS MLA harishrao | హైదరాబాద్‌, ఆగస్ట్‌ 5 (విధాత): జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెల్లడించిన నివేదిక మొత్తం ట్రాష్‌ అని మాజీ మంత్రి, బీఆరెస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. అన్నీ అబద్దాలు.. అవాస్తవాలు.. రాజకీయ దురుద్దేశాలేనని తేల్చి చెప్పారు. 60 పేజీల నివేదికలోని అంశాలు అసలు నివేదికలోనివేనా? వండి వార్చినవా? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. 650 పేజీల రిపోర్టుపెట్టండి.. చీల్చిచెండుతాం అని చెప్పారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా 60 పేజీలతో ప్రభుత్వం విడుదల చేసిన షార్ట్‌ నివేదికపై మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం నిర్మాణ తీరుతెన్నులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత ఉంటే తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. నిపుణుల కమిటీ నిర్ణయం, సీడబ్ల్యూసీ సూచన మేరకే కాళేశ్వరం నిర్మాణ స్థలాన్ని మార్చామని చెప్పారు. దానికి అసెంబ్లీ ఆమోదం, క్యాబినెట్‌, గవర్నర్‌ అనుమతులూ ఉన్నాయని తెలిపారు. అయినా కమిషన్‌ నివేదికపై సీఎం, మంత్రుల పచ్చి అబద్ధాలు వల్లించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ సొంత నిర్ణయమనేది కాంగ్రెస్ దుష్ప్రచారమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. చిత్తశుద్ధి ఉంటే కమిషన్‌ పూర్తినివేదికను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. ‘కేసీఆర్‌ది నీళ్ల కోసం తండ్లాట.. మీది రాజకీయ ఉబలాట. కాళేశ్వరం పడావుపెట్టాలె.. బనకచర్లకు నీళ్లు జారగొట్టాలనేది రేవంత్‌రెడ్డి గురుదక్షిణ. అంతిమంగా గెలిచేది న్యాయమే.. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. మేడిగడ్డ పిల్లర్లు బాగు చేయిస్తాం.. రైతులకు నీళ్లిస్తాం’ అని హరీశ్‌రావు చెప్పారు.

అసెంబ్లీలో చీల్చిచెండాడుతాం..

ప్రభుత్వం 60 పేజీలతో విడుదల చేసిన రిపోర్టును పరిశీలిస్తే అందులో అన్నీ అబద్దాలు.. అవాస్తవాలు.. రాజకీయ దురుద్దేశాలు కనిపిస్తున్నాయని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వం బయటపెట్టిన రిపోర్టును చూస్తే కమిషన్‌ ఏకపక్షంగా ఇచ్చినట్లుందని అన్నారు. ‘రిపోర్టు పూర్తిగా ట్రాష్‌, బేస్‌లెస్‌. బేస్‌లెస్‌ ఎలిగేషన్స్‌ ఉన్నాయి’ అని హరీశ్‌రావు తెలిపారు. చరిత్రలో రాజకీయ వేధింపుల కోసం అనేక కమిషన్లు వేశారని, అవేవీ న్యాయస్థానాల్లో నిలబడలేదని గుర్తు చేశారు. ఇది కూడా న్యాయస్థానాల్లో నిలబడదని అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్టును చూస్తే నచ్చిన పేరాలు లీకులు.. నచ్చని లీడర్లు బాధ్యులు అన్నట్లుగా, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ‘ఒక ముఖ్యమంత్రిగా ప్రాజెక్టును రివ్యూ చేయడం బాధ్యత. ఇది రాజకీయ జోక్యం ఎట్లవుతుంది? రివ్యూ చేయడం అవుతుంది. ప్రజలకు త్వరితగతిన నీళ్లు ఇవ్వడం ఒక బాధ్యతాయుత ప్రభుత్వం చేసే పని. దీనిని రాజకీయ జోక్యమనరు. ఇది ప్రభుత్వ, ముఖ్యమంత్రి బాధ్యత’ అని హరీశ్‌రావు సమర్థించుకున్నారు.

కాంగ్రెస్.. బీజేపీల కుట్ర..

రేవంత్‌రెడ్డి పాలన గాలికి వదిలి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మరో వైపు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దండుకునేందుకు కమీషన్లు, ప్రతిపక్షాల మీద కక్షసాధించేందుకు రాజకీయ కమిషన్లను వాడుకుంటున్నదని ఆరోపించారు. ఆర్థికశాఖలో బిల్లు పాస్ కావాలంటే 10 -12శాతం కమీషన్లు అని ఎవరిని అడిగినా చెబుతారన్నారు. కాంట్రాక్టర్లే సచివాలయంలో ధర్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ మూడుసార్లు కుప్పకూలితే అక్కడికి పోని ఎన్‌డీఎస్‌ఏ.. మేడిగడ్డ విషయంలో మాత్రం ప్రభుత్వం పిలవకుండానే వస్తుందని సెటైర్‌ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయని కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టును బయటపెట్టి రాజకీయ కుట్రలకు ప్రభుత్వం పాల్పడుతున్నదని విమర్శించారు. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా ఇబ్బందిపెట్టాలనే ఈ రిపోర్టు రూపొందించారని ఆక్షేపించారు.

ఆర్ధర్‌ కాటన్‌గా కేసీఆర్‌ చరిత్రపుటల్లో నిలుస్తారు..

‘బ్రిటీష్‌కాలంలో సర్‌ ఆర్థర్‌ కాటన్‌.. ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించారు. రైతులకు మేలు జరగాలని కష్టపడి గోదావరి జిల్లాలకు నీరందించారు. బ్రిటీష్‌ ప్రభుత్వం కాటన్‌ మీద హెమ్మింగ్‌టన్‌ కమిషన్‌ వేసింది. ఆ కమిషన్‌ 900 ప్రశ్నలడిగింది. చాలా కాలం వేధించింది. అయినా గోదావరి జిల్లా ప్రజల గుండెల్లో కాటన్‌ నిలిచి ఉన్నారు. కేసీఆర్‌ కూడా చరిత్రపుటల్లో.. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలుస్తారు. కాళేశ్వరం ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయినే. తెలంగాణ భవిష్యత్తుకు గుండెకాయలాంటిది. ఈ విషయం రేవంత్‌రెడ్డికి కూడా తెలుసు’ అని హరీశ్‌రావు చెప్పారు.

అసెంబ్లీకి నాటి సీఎం కేసీఆర్‌ ప్రజెంటేషన్‌..

అసెంబ్లీ, క్యాబినెట్‌ ఆమోదాలు లేకుండా కేసీఆర్‌ ఒక్కరే నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ‘నాడు కేసీఆర్‌ ఎంతో ఫెయిర్‌గా ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను శాసనసభకు వివరించారు. ‘అసెంబ్లీలో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ పెట్టి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు, శాసనసభకు వివరించిన ముఖ్యమంత్రి ఓన్లీ కేసీఆర్‌’ అని అన్నారు. శాసనసభలో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకే అసెంబ్లీలో వివరిస్తే.. ఆయన ఎలా సొలో డెసిషన్‌ తీసుకున్నారని అంటారు? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.