Jagadish Reddy | హైదరాబాద్‌పై వారివన్ని పిచ్చి కలలే: జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్ యూటీ, ఉమ్మడి రాజధాని అంటూ కొందరు పిచ్చి కలలు కంటున్నారని, అటువంటి కలలు నిజం కావని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు

బోనస్ ఇవ్వలేకనే డ్రామాలు
మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి
విధాత, హైదరాబాద్: హైదరాబాద్ యూటీ, ఉమ్మడి రాజధాని అంటూ కొందరు పిచ్చి కలలు కంటున్నారని, అటువంటి కలలు నిజం కావని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూటీ, ఉమ్మడి రాజధాని ఇంకా కొందరు తెలంగాణను ఏపీలో కలపాలన్న వారికి సంబంధించిన పిచ్చి కలలని విమర్శించారు. జూన్ 2 తర్వాత హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకే చెందుతుందన్నారు.రాష్ట్ర అవతరణ వేడుకలు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైన జరుపుకునేవేనన్నారు. వేడుకలను చూడటానికి ఎవరైనా రావచ్చన్నారు.
వేడుకల్లో సోనియాగాంధీని పిలిచి ప్రభుత్వం ద్వారా సన్మానాలు చేయడం సరైందికాదని, అది దుర్వినియోగ చర్య అన్నారు. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చే పథకాలు అమలయ్యాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో కప్పదాట్లు వేస్తూ ప్రజలను మళ్లీ మోసం చేస్తుందని విమర్శించారు. వరికి బోనస్ ఇవ్వలేక డ్రామాలు వేస్తున్నారన్నారు. విత్తనాలు కూడా సక్రమంగా ఇవ్వలేకపోతున్నారన్నారు.
రాష్ట్రంలో ఐదు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ నిర్వహణను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు.సెల్‌ఫోన్ల లైట్ల వెలుతురులో ఆసుపత్రుల్లో వైద్యం చేస్తున్న దుస్థితి నెలకొందన్నారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని దాటవేస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే మేం 30వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి నిసిగ్గుగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటు వేస్తున్నామంటే మన గొంతును అభ్యర్థికి ఇస్తున్నట్లేనని స్పష్టం చేశారు. ప్రశ్నించే కాంగ్రెస్ అభ్యర్థి గొంతు ప్రశంసించే గొంతుగా మారిందని, అందుకే ప్రశ్నించే గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.