BRS Party | రాజకీయ పద్మవ్యూహంలో బీఆర్ఎస్!.. నలుదిక్కుల దాడికి గురవుతున్న కేసీఆర్
BRS Party | తెలంగాణ పేగు బంధాన్ని తెంచుకుని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన పార్టీ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నాయకత్వంరాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిలలాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

బీజేపీ, కాంగ్రెస్, సర్కార్ ముప్పేట దాడి
కంట్లో నలుసుగా మారిన కల్వకుంట్ల కవిత
ఉద్యమ సమయంలో అనేక రక్షణ కవచాలు
బలంగా నిలిపిన తెలంగాణ సెంటిమెంట్
రక్షణ కవచంలా నిలిచిన రాష్ట్ర సాధన లక్ష్యం
ఇప్పుడు బీఆరెస్‌పై సెంటిమెంటూ లేదు..
ఆయనకు రక్షణ కవచాల్లాంటి అంశాలూ లేవు
చుట్టూ ముసుకున్న కేసులు, విచారణలు
అంతా కేసీఆర్ స్వయంకృతపరాధమేనా!?
BRS Party | విధాత ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ పేగు బంధాన్ని తెంచుకుని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన పార్టీ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నాయకత్వంరాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిలలాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్, బీజేపీ నుంచి ముప్పేట రాజకీయ దాడులను ఎదుర్కొంటున్నారు. తాజాగా కన్నబిడ్డ కల్వకుంట్ల కవిత నుంచి ఇంటిపోరుతో కంటిమీద కునుకు కరువై నలువైపులా దిగ్బంధానికి గురయ్యారు. గతంలో ఇలాంటి ఎన్నో అడ్డంకులు, అవరోధాలు అనుభవించారని కొందరు నాయకులు గంభీర ప్రకటనలు చేస్తున్నారు. కానీ.. గడిచిన 25 యేళ్ళ పార్టీ ప్రస్థానంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు ఒక ఎత్తయితే, ఇప్పుడు ఎదుర్కొంటున్న దాడులు వాటికి పూర్తిగా భిన్నమైనవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తొలి దశలో కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ‘తెలంగాణ సెంటిమెంట్’, రక్షణ కవచంగా ‘రాష్ట్ర సాధన లక్ష్యం’ నిలిస్తే, తదుపరి రాష్ట్రంలో ‘అధికారం’ అపరిమితమైన అండగా ఉన్నది. కానీ, ఇప్పుడు భిన్నమైన పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ అనుభవిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశస్థాయి పార్టీ కాస్తా మళ్ళీ ‘తెలంగాణ’ ప్రాంతీయ పార్టీగా చెప్పుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొన్న విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా మారిన పాత్ర, ఎంపీల బలం లేకపోవడంతో పాటు రాష్ట్రంలో కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించడంతో ఆయన ప్రతిష్ఠ మసకబారింది. ఇదంతా కేసీఆర్ స్వయం కృతాపరాధమనే వాదన బలంగా ఉంది.
అధికారంలో ‘ఏకపక్షం’
అధికారంలో ఉండగా కేసీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం అనుసరించిన ఏకపక్ష, ప్రజా, విపక్ష వ్యతిరేక విధానాలూ, అప్రజాస్వామిక పద్ధతులు, ‘నియంతృత్వ’ పోకడలకు ప్రజలు గుణపాఠం చెప్పడం వల్ల కేసీఆర్‌కు ఈ దుస్థితి తలెత్తిందనే అభిప్రాయాలున్నాయి. ఎవరి మాటనూ లెక్కపెట్టకపోగా, విపక్షాలను కనుమరుగు చేసేందుకు యథేచ్ఛగా బాహాటంగా చేసిన ప్రయత్నాలు, ‘విచ్చలవిడి’గా వనరుల దోపిడీ ఫలితమే తాజా పరిస్థితి అంటున్నారు. పదికాలాల పాటు అధికారంలో ఉండాల్సిన పార్టీ, పతాక స్థాయిలో నిలిచి ఉండాల్సిన అధినేత కేసీఆర్.. అత్యాశ ఫలితంగా ప్రతిష్ఠను కోల్పోయారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటమి సమయంలోనూ దాదాపు దశాబ్దంపాటు అధికారంలో ఉండేందుకు సహకరించిన ప్రజలకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా, లాంఛనంగా గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామా పత్రాన్ని అందజేయాల్సి ఉండగా.. అవేవీ కేసీఆర్ పాటించని విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. తర్వాత కూడా.. ఓటమిలో ప్రజల తిరస్కరణ ఉందనే అంశాన్ని చర్చకు రాకుండా, కనీస ఆత్మవిమర్శ లేకుండా, ప్రజా తీర్పును అవహేళన చేసే ‘అహంభావ’ వైఖరి ప్రదర్శించడం వల్ల మరింత నష్టం వాటిల్తుతున్నదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. చేసిన పాపాలు కేసీఆర్‌ను వెంటాడుతున్నాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
ప్రతిపక్షానికి దూరంగా
టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా రూపొంతరం చెందిన తర్వాత రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినప్పటికీ 39 మందిని గెలిపించి బలమైన ప్రతిపక్షంగా ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. కారణాలేవైనా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఆ పాత్ర నిర్వహణను విస్మరించారనే విమర్శలు మేధావి వర్గంలోనూ బలంగా ఉన్నాయి. ఆయన బయటికి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారనే ప్రచారం కూడా ఉంది. ఏమైనా స్వంత ఆలోచనా? లేదా ఎవరిదైనా సలహానా? ఏది ఏమైనా.. తన పాత్ర నిర్వహించడంలో కేసీఆర్ ఉదాసీన వైఖరి.. ‘అధికారం’ ఉంటే తప్ప అధినేత జీవించలేని పరిస్థితుల్లో ఉన్నారనే సంకేతం పంపుతోందని సీనియర్ జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు. తన పాత పద్ధతి ప్రకారం ఫాంహౌస్ నుంచి ‘ప్రజల’కు దూరంగా, రాజకీయ చాణక్యం నెరుపుతున్నారు. దీని ఫలితంగా పార్టీ శ్రేణుల్లో, ఎమ్మెల్యేలలో నమ్మకం సన్నగిల్లుతోందని అంటున్నారు. క్యాడర్‌కు భరోసా కరువైందని ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నది. రాజకీయంలో పండిపోయిన కేసీఆర్ అసెంబ్లీలో, బయట నిలబడి మాట్లాడితే ఆ తీరే వేరనే అభిప్రాయం ఇప్పటికీ ఉంది. ఇదిలా ఉండగా అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే కొందరు ఎమ్మెల్యేలు ఎంతో కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదంటూ విమర్శలు ప్రారంభించారు. దీంతో సీఎం రేవంత్ నంబర్ గేమ్ ప్రారంభించారు. తత్ఫలితంగా పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పక్షానికి స్నేహస్తాన్ని అందించారు. దీనిపై బీఆర్ఎస్ బ్లేమ్ గేమ్ చేపట్టినా కనీస నైతిక మద్ధతు లభించడంలేదు. అధికారంలో ఉండగా ఆడిన ఆటలిప్పుడు ఆ పార్టీకి శాపంగా మారాయంటున్నారు.
స్కీములే స్కాములు
అధికారంలో ఉండగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పలు స్కీంలు ‘అవినీతి’ కుంభకోణాలు’గా మారాయి. గొర్రెల స్కాం, విద్యుత్ స్కాం, కాళేశ్వరం కట్టడంలో మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో బుంగలు, ఈ కార్ రేస్‌లో ఆర్థిక అవకతవకలు, ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ ఒక్కటేమిటి.. తాడే పామై కరిచినట్లుగా పరిస్థితి మారింది. దీనికి తోడు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ లాంటి కొన్ని కేసులు బహిర్గతమైన అంశాలతో ఆ పార్టీపై ఉన్న కనీస గౌరవం సన్నగిల్లిపోయిందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన సూత్రధారిగా ఇరుక్కోవడం ఇబ్బందికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఫాం హౌస్‌లో జారిపడి కేసీఆర్ తుంటి విరగడం, లిక్కర్ స్కాంలో కవిత అరెస్టుతో ఒక విధంగా ఇంటా బయట తీవ్రమైన ఇబ్బందుల్లో పడింది. గోరుచుట్టుపై రోకటి పోటు మాదిరిగా లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కంటంటే ఒక్క స్థానంలో కూడా గెలువకపోవడం తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఫలితాలపై అనేక అనుమానాలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీకి అవయవదానం చేసిందని బహిరంగ విమర్శలు చేసింది. నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీచేసినా చావుదెబ్బతిన్నారు. తర్వాత జరిగిన కరీంనగర్ టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా పోటీకి దూరంగా ఉండంటంతో పార్టీలో తీవ్ర చర్చ సాగింది. అష్టకష్టాలు పడి కవితను జైలు నుంచి బెయిల్ పై తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై కూడా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు వల్ల కవితకు బెయిల్ వచ్చిందనే విమర్శలు కాంగ్రెస్ నాయకులు చేశారు.
కేసులు, విచారణల ఉచ్చు
అధికార కోల్పోగానే మీదపడిన కేసులు, విచారణ కమిషన్‌ల ఫలితం ఎలా ఉన్నా.. ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ ముఖ్యనాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, తాజాగా పార్టీకి దూరమైన కల్వకుంట్ల కవితకు ఇబ్బందులు తప్పేట్లులేవు. కేసుల్లో కోర్టుకు హాజరుకావడం, కేసుల విచారణ ఎదుర్కోవడం ఈ వయస్సులో కేసీఆర్ కు ఇబ్బందికరమైన అంశం. ఇప్పటికే కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఐదున్నర నెలలు జైలులో ఉన్నారు. మిగిలిన కేసుల్లో ఎవరైనా జైలుకు వెళ్లే అవకాశాలు పక్కలో బల్లెంలా ఉన్నాయి. కేసీఆర్ తో పాటు మిగిలిన నాయకులంతా ఈ కేసులు, స్కాంల వల్ల తమ పరువును, ప్రతిష్ఠ కోల్పోతున్నారు. అవినీతి, అక్రమాల మరకలతో ‘స్థాయి’ తగ్గిపోయి, ప్రజల్లో పలుచనకావడం, కేడర్లో అపనమ్మకం పెరుగుతోంది. తాజాగా కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడంతో కేసుల రూపం మారనున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అప్పగిస్తారనే వార్తలు వెలువడుతున్నాయి.
కంట్లో నలుసులా కవిత
లోక్ సభ ఎన్నికల తర్వాత, కవిత జైలులో ఉన్న సందర్భంగా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు చేశారని, చీకట్లో ఒప్పందాలు జరుగుతున్నాయంటూ సీఎం రేవంత్, కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క స్థానం కూడా దక్కకపోవడం ఒక కారణంగా వారు చెబుతున్నారు. ఈ విమర్శల పై బీఆర్ఎస్ ఎదురుదాడి చేసినప్పటికీ ఉన్నట్టుండి కేసీఆర్ బిడ్డ కవిత ఇదే విషయాల పైన బాంబు పేల్చారు. తాను జైలులో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయని, తాను వ్యతిరేకించానంటూ ప్రకటించి సంచలనానికి తెరతీశారు. ఇదే అంశంపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామంటూ కేటీఆర్ తన ఇంటికే వచ్చారంటూ ప్రకటించి ఈ వాదనకు మరింత బలం చేకూర్చారు. దీంతో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కక్కలేని మింగలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. పార్టీలో అపనమ్మకం పెరుగుతూ వస్తోంది. పర్యవసానంగా గువ్వల బాలరాజు లాంటి వారు రాజీనామా చేశారు. ముందు కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కేటీఆర్ ను పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించింది. కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే గుర్తిస్తానంటూ ధిక్కారస్వరాన్ని వినిపించింది. తాజాగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ దానికి హరీష్, సంతోష్‌లే కారణమంటూ రాజముద్ర వేసి సంచనలం సృష్టించారు. పర్యవసానంగా సస్పెన్షన్ గురయ్యారు. కవిత మాటలతో బీఆర్ఎస్ లో నెలకొన్న కుటుంబ ఆధిపత్యపోరు, కేసీఆర్ కూడా పరిష్కరించలేని అచేతన పరిస్థితి వెలుగు చూశాయంటున్నారు పరిశీలకులు. ఈ పరిణామాల వల్ల కేడర్‌లో ఆత్మ విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా గతంలో మాదిరి కేసీఆర్ సైతం వేగంగా పనిచేసే అవకాశం లేదు. అనారోగ్య సమస్యలు, వయస్సు మీద పడుతున్న ఈ స్థితిలో కేసీఆర్ అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
కలిసివస్తున్న ‘కాలం’
ఇన్ని ఇబ్బందుల్లోనూ బీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కూ అప్పుడప్పుడు కాలం కాస్తంత కలిసివస్తోందని, ఇందంతా ఉపశమనం మాత్రమేనని రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హామీ ఇచ్చినప్పటికీ దానికి వంద రోజుల గడవు విధించడం విమర్శలకు కలిసొచ్చింది. ఎస్ఎల్బీసీ సొరంగం యంత్రాలు కుప్పకూలడంతో ఎనిమిది మృతి చెందడం, సుంకిశాల వాల్ కూలడం, తాజాగా ‘యూరియా కొరత’, ఆకస్మిక వరదలు లాంటి ఆపత్కాల సమస్యలు ఆ పార్టీకి కొంత ఊపిరిపీల్చుకునేందుకు ఉపకరించవచ్చేమో, వీటితో అధికార పార్టీపై విమర్శలెక్కుపెట్టి తప్పించుకోవచ్చేమోగానీ, నలువైపులా గట్టిగా బిగుస్తున్న ఉచ్చులతో బీఆర్ఎస్ పార్టీ, అధినేత కేసీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారనేది మాత్రం సుస్పష్టమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.