KCR | కాంగ్రెస్‌ది రైతు శత్రు ప్రభుత్వం.. ఈ బడ్జెట్ మొత్తం గ్యాస్, ట్రాష్: కేసీఆర్
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ‘రైతు శత్రు ప్రభుత్వం’ అని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతులకు రైతు, పేదల శతృవుగా కాంగ్రెస్ ప్రభుత్వం మారిందన్నారు

ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది
పొగిడినట్లు పొగిడి రైతులకు వెన్నుపోటు
ఏ ఒక్క పథకంపైనా పాలసీ, స్పష్టత లేవు
రైతుబంధు ఎగవేసే ప్రయత్నం
కథ చెప్పినట్లు చిల్లర మల్లరగా ప్రసంగం
మహిళలకు లక్ష కోట్ల రుణ కార్యక్రమం కొత్తది కాదు
ఆరు మాసాల సమయం ఇవ్వాలనుకున్నాం
రాష్ట్రంలోని అన్ని వర్గాలను వంచిస్తున్నారు
ఇది ఎవరి బడ్జెటో తేలుస్తాం.. చీల్చి చెండాడుతాం
బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్
విధాత, హైదరాబాద్ : ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ‘రైతు శత్రు ప్రభుత్వం’ అని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతులకు రైతు, పేదల శతృవుగా కాంగ్రెస్ ప్రభుత్వం మారిందన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా గురువారం అసెంబ్లీకి హాజరైన కేసీఆర్.. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం కథలా.. చిల్లర మల్లర ప్రసంగంలా సాగిందని విమర్శించారు. డబ్బొచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకొంటున్న కాంగ్రెస్ సర్కారు రైతులను పొగిడినట్లు పొగిడి వెన్నుపోటు పొడిచిందన్నారు.
రైతు బంధును రైతు భరోసాగా పెంచి ఇస్తామని చెప్పి, దుర్వినియోగం నెపంతో ఎగవేసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. రైతుబంధుపై దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. ధాన్యం కొనుగోలు, విద్యుత్తు, నీళ్లు సరఫరా చేయడం లేదని, చాలా ఇబ్బందులు పెడుతున్నారన్నారని విమర్శించారు. రైతుబంధు, రైతు భరోసాల ప్రస్తావనే లేదని, ఎప్పుడు ఇస్తారని తమ ఎమ్మెల్యేలు అడిగితే దానికి సమాధానం చెప్పటం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని తాము రెండు పంటలకూ రైతు బంధు ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయంపై తమకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు.
బడ్జెట్ మొత్తం ట్రాష్.. గ్యాస్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని, అన్ని వర్గాల ప్రజలను నిరాశ పరిచిందని కేసీఆర్ అన్నారు. ఈ బడ్జెట్ మొత్తం గ్యాస్, ట్రాష్ అని కొట్టిపారేశారు. ఇది ఎవరి బడ్జెట్టో విశ్లేషణలో మునుముందు తేలుతుందన్నారు. బడ్జెట్‌పై బ్రహ్మాండంగా చీల్చి చెండాడుతామని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడున్న బడ్జెట్‌లో ఒక్క పథకం మీద కూడా స్పష్టత లేదని విమర్శించారు. బడ్జెట్‌లో ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రకటించలేదని, ఒక్క పాలసీ ప్రకటించలేదని విమర్శించారు.
LIVE: Leader of the Opposition, Sri KCR, is speaking at the assembly media point. https://t.co/C9Lqqmsyap
— BRS Party (@BRSparty) July 25, 2024
పథకాలెటుపోయాయి?
దళితబంధు పథకం ప్రస్తావన లేదని, గొర్రెల స్కీమ్‌ను పూర్తిగా మూసివేశారని, మత్స్యకార్మికులకు భరోసానిచ్చే పథకం లేదని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనలేకపోయిందని, కరెంటు, నీళ్లు ఇవ్వడంలోనూ విఫలమైందని ఆరోపించారు. వాస్తవానికి తాము కొత్త ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇవ్వాలని పెద్దగా ప్రశ్నించలేదన్నారు. కానీ ఈ ఆరు నెలల్లో ఈ ‘అర్భక ప్రభుత్వం’ బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ చేసినట్లుగా కనబడతలేదన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలను వంచిస్తున్నదని కేసీఆర్ ఆరోపించారు.
రైతు సమాజం పట్ల వీళ్ల నిర్లక్ష్యం, ఫ్యూడల్ విధానాలకు ఈ బడ్జెట్ గొప్ప నిదర్శనమని విమర్శించారు. మహిళలకు లక్ష కోట్ల రుణాలు చెప్పారని, అది కూడా కొత్త పథకమేం కాదన్నారు. ఐటీ, వ్యవసాయ, పారిశ్రామిక అంశాలపై పాలసీలు లేవని పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ పాలసీ ఏమీ లేకపోగా, దాని గురించి స్టోరీ టెల్లింగ్‌లా ఉంది తప్ప బడ్జెట్‌లా ఏదీ లేదన్నారు. పేద వర్గాలకు, సంక్షేమ పథకాలకు పాలసీ లేదన్నారు. ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరుగలేదన్నారు. ఇది పేదల బడ్జెట్ కాదు.. రైతుల బడ్జెట్ కాదు. దీనిపై భవిష్యత్తులో మేం చీల్చి చెండాడుతామని కేసీఆర్ చెప్పారు.