BRS | రైతు రుణమాఫీపై బీఆరెస్ నిరసనల హోరు
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతులందరికి 2లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆరెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాయి

చేవెళ్లలో కేటీఆర్, సబిత..ఆలేరులో హరీశ్‌రావులు
నియోజకవర్గం, మండల కేంద్రాల్లో ధర్నాలు
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతులందరికి 2లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆరెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాయి. బీఆరెస్ నిరసనలను కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాలో ఆంక్షలు లేకుండా రైతులందరికి రుణమాఫీ చేయాలని, సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు రైతు ధర్నాల్లో పాల్గొన్నారు. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్లలో జరిగిన రైతు నిరనసలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు. మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆలేరులో నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తిరుమలగిరి మండల కేంద్రంలో బీఆరెస్ కార్యకర్తలు ధర్నా చేస్తుండగా, వారితో కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ పడ్డారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై దాడికి యత్నించారు. వాహనాల అద్దాలు ధ్వంసం చేసి, రాళ్లు, కోడిగుడ్లు విసురుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడి సమాచారంతో తుంగతుర్తి బయలుదేరిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డిని పోలీసులు తిమ్మాపురం వద్ధ అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కిషోర్‌పై దాడిని జగదీశ్‌రెడ్డితో పాటు కేటీఆర్ ఖండించారు. మరోవైపు కేటీఆర్ పిలుపు మేరకు సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం వివాదంలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ తల్లి విగ్రహానికి, ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.