టైటానిక్ షిప్‌లా బీఆరెస్ మునిగిపోతుంది … బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో బీఆరెస్ పార్టీ టైటానిక్ షిప్ లా మునిగిపోతుందని.. ఆ పార్టీ ప్రస్థానం చరిత్రలో రాసుకోవాల్సిందేనని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

విధాత : తెలంగాణ రాజకీయాల్లో బీఆరెస్ పార్టీ టైటానిక్ షిప్ లా మునిగిపోతుందని.. ఆ పార్టీ ప్రస్థానం చరిత్రలో రాసుకోవాల్సిందేనని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆరెస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావు, సహా ఎవరొచ్చిన బీజేపీలో చేర్చుకుంటామన్నారు. బీఆరెస్‌కు సీఆర్ఎస్ (కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం) ఖాయమని అన్నారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు. భవిష్యత్తు రాజకీయాలపై అవగాహాన లేని వారే కాంగ్రెస్‌లో చేరుతారని, బీఆరెస్ నుంచి వెళ్లే ఎమ్మెల్యేలకు తాత్కాలిక ప్రయోజనాలే మిగులుతాయన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ టెక్నికల్ గా మాత్రమే రద్దు అయ్యిందని, ఐటీఐఆర్ గురించి తెలిస్తే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. జగ్గారెడ్డి పెరిగింది ఆర్ఎస్ఎస్‌లోనని.. ఆయన మొదట గెలిచింది బీజేపీ నుంచే అని గుర్తుచేశారు.
జగ్గారెడ్డి బీజేపీపై చేసిన విమర్శలు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఉందన్నారు. మెదక్‌కు ఇందిరమ్మ రాకముందే బీహెచ్ ఈఎల్, ఇక్రిశాట్ వచ్చాయన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు గైడ్ లైన్స్ అన్ని అమలు చేశామన్నారు సమ్మిళితంగా మెదక్‌ను డెవలప్ చేస్తామని, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని హామీ ఇచ్చారు. ములుగు మండలం క్షీర సాగర్ గ్రామంలో 80 మంది దళితుల భూములు అక్రమంగా వెంకట్రామ్ రెడ్డి లాక్కున్నారన్నారు. క్షీర సాగర్ నుంచే పని మొదలు పెడతామని, దళితుల భూములు వారికి అప్పగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గోవధ అల్లర్లు, కంపెనీల మీద స్పందించారని, అటువంటి కంపెనీలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నీట్ పరీక్షపై ప్రతిపక్షాలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని, కోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం అన్ని వివరాలు ఇవ్వనుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సైతం పరీక్ష రద్దుకు అంగీకరించలేదని గుర్తు చేశారు.