KTR | రుణమాఫీ 46శాతమే.. సంపూర్ణమని నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇంట్లో కూర్చుంటా : కేటీఆర్ సవాల్
రెండు లక్షల రుణమాఫీ దశాబ్ధపు అతిపెద్ద మోసం...అతిపెద్ద జోక్ అని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

నా సవాల్‌ను స్వీకరించాలి
సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్
2లక్షల రుణమాఫీ అతిపెద్ద జోక్..దశాబ్ధపు అతిపెద్ద మోసం
22లక్షల 37,844మందికి 17,934కోట్లు మాత్రమే చేశారు
మిగతా రైతుల సంగతేమిటో చెప్పాలి
మేం హెల్ప్‌లైన్ పెడితే లక్ష ఫిర్యాదులొచ్చాయి
రుణమాఫీ మోసాల లెక్కలను గవర్నర్, కోర్టుకు సమర్పిస్తాం
పార్టీ విలీనంపై రేవంత్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
ఆయనే అమెరికా అధ్యక్షుడవుతాడని సెటైర్
రేవంత్‌రెడ్డి మానసిక సంతులతపై సందేహాలు
విధాత, హైదరాబాద్ : రెండు లక్షల రుణమాఫీ దశాబ్ధపు అతిపెద్ద మోసం.. అతిపెద్ద జోక్ అని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రుణమాఫీ సంపూర్ణమన్న మాటల్లో నిజముంటే భద్రత లేకుండా మీడియాను తీసుకుని కొడంగల్ నియోజకవర్గంలో ఏదేని ఒక గ్రామానికి మనమిద్దరం వెళ్దామని.. రైతు వేదికలో రైతులతో మీటింగ్ పెట్టి వందశాతం రుణమాఫీ అయ్యిందని రైతులు చెబితే నేను అక్కడే రాజీనామా చేసి, రాజకీయాలను వదిలేసి ఇంట్లో కూర్చుంటానని కేటీఆర్ ప్రకటించారు. సీఎంకు దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలన్నారు.
సొంతూరు కొండారెడ్డిపల్లికైనా పోదామని, ఇద్దరం పోయి మీడియా ముందు వంద శాతం రుణమాఫీ అయ్యిందని చెబితే అక్కడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. 46శాతం కూడా రుణమాఫీ (Runa mafi) చేయకుండా సంపూర్ణంగా చేశామని చెప్పడం సంపూర్ణంగా దిగజారుడు తనమన్నారు. రుణమాఫీ అంతా బోగస్ అని తేలిపోయిందన్నారు. రైతుల మధ్యకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళితే రేవంత్ రెడ్డిని ప్రజలు ఫుట్బాల్ ఆడుతారని చెప్పారు. రుణమాఫీలో రైతులను మోసం చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలన్నారు. రాహుల్‌గాంధీకి సైతం రుణమాఫీ మోసం అర్ధమై ఈ కార్యక్రమానికి రాలేదన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా నూతన మహబూబ్‌నగర్ (Mahabub Nagar) జిల్లాలో 1లక్ష 72,433మందికి మూడు విడతల్లో 71,053మందికే మాఫీ అయ్యిందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం జిల్లాలో 3లక్ష 73,157మందికి మూడువిడతల్లో 1లక్ష 15,600మందికి మాత్రమే మాఫీ అయ్యిందన్నారు. అంటే సీఎం జిల్లాలో 41శాతం, డిప్యూటీ సీఎం జిల్లాలో 30శాతం రైతులకే రుణమాఫీ జరిగిందని లెక్కలతో సహా వివరించారు. తాము రుణమాఫీ సమస్యలపై హెల్ప్‌లైన్ పెడితే 1లక్ష ఫిర్యాదులు వచ్చాయని, బీఆరెస్ (BRS) ప్రజాఫ్రతినిధులంతా తమ పరిధిలోని కొన్ని గ్రామాలను శాంపిల్స్ సర్వే చేసి వివరాలను గవర్నర్‌కు, కోర్టుకు సమర్పించేందుకు పార్టీ నాయకత్వానికి వివరాలు అందించాలని కోరారు. అరకొర రుణమాఫీ చేసి హరీశ్‌రావు రాజీనామా చేయాలని పనికిరాని సవాల్ ఒకటని ఎద్దేవా చేశారు.
ఇదిగో మీ రుణమాఫీ మోసం లెక్కలు
కేసీఆర్ 2014-18లో 35లక్షల మంది రైతులకు లక్ష రూపాయల రుణమాఫీకి 17వేల కోట్లు అయితే ఇప్పుడు, 22లక్షల37,884మందికి 2లక్షల రుణమాఫీకి 17,934కోట్లు మాత్రమే ఎట్లా అవుతుందని, ఈ లెక్కలు చాలవా రుణమాఫీ బోగస్ అని, మోసానికి నిదర్శనమని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది జోక్ కాదా అని ఎద్దేవా చేశారు. ముందుగా 40వేల కోట్లు అని,కేబినెట్‌లో 31వేల కోట్లు అని..బడ్జెట్‌లో 26వేల కోట్లుగా చెప్పి, ఇప్పుడు 17వేల 934కోట్లతో రుణమాఫీ ఎలా పూర్తయ్యిందని కేటీఆర్ నిలదీశారు. ఇందులో ఎన్ని కటింగ్‌లు ఉంటాయో ఎవరికి తెలియదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీలో కోతలు పెట్టి కటింగ్ మాస్టర్‌గా మారాడన్నారు.
రుణమాఫీ జాప్యంతో బ్యాంకులకు రైతులు వడ్డీ కట్టాల్సివచ్చిందానికి రేవంత్‌రెడ్డినే బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ హయంలో 72వేల కోట్ల రైతుబంధు, 30వేల కోట్ల మేర రుణమాఫీ తో పాటు 1లక్ష కోట్లు రైతులకు అందించామని, రేవంత్‌రెడ్డి వానకాలంలో 15వేల కోట్లు రైతుబంధు ఎగవేశాడని, ఎకరాకు ఏడున్నర వేలు ఇవ్వడం లేదన్నారు. రైతులను నమ్మించి తడిగుడ్డతో గొంతుకోసిన వారు కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. రుణమాఫీ, రైతుబంధు కలిపి కేసీఆర్ రైతులకు లక్ష కోట్లు ఇస్తే మీరు 17వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మూడు సార్లు రుణమాఫీ చేసి ఏకకాల రుణమాఫీ అంటూ ప్రకటనలు చేస్తు చారణా కోడికి బారణా మసాలా కథలా ప్రచారం చేసుకుంటున్నార్నారు.
Live : BRS Working President @KTRBRS addressing the media at Telangana Bhavan https://t.co/skr3xm0t1x
— BRS Party (@BRSparty) August 16, 2024
రేవంత్‌రెడ్డి అడ్డమైన మోసాలు చూసి గిన్నిస్ బుక్ వాళ్లు కూడా పరేషాన్ అవుతున్నారన్నారు. హరీశ్‌రావును రాజీనామా చేయ్ అంటే నీవు సంపూర్ణంగా రుణమాఫీ చేయకుండా మోసం చేసి రాజీనామా సవాల్ చేయడమేంటని ప్రశ్నించారు. తులం బంగారం ఇస్తామని మోసం చేశారన్నారు. మాకు రాజీనామాలు కొత్త కాదని, రేవంత్‌రెడ్డికి మోసం కొత్త కాదన్నారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి చేయనోడు ఆయనేనన్నారు. రేవంత్ రెడ్డి పిచ్చి, పిచ్చి మాటలు మానేయాలని, ఇంత దిగజారుడు ముఖ్యమంత్రి, దివాళా తీసిన ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదన్నారు.
వీదేశీ పర్యటనకెళ్లి వచ్చాకా పంద్రాగస్టు వేడుకల్లో, వైరా సభలో సీఎం రేవంత్‌రెడ్డి జుగుప్సాకర భాషతో విమర్శలు చేశాడని, తమ్ముడి కంపనీతో ఎంవోయూ కుదుర్చుకున్న సంగతి, బామ్మర్ధికి అమృత్ కాంట్రాక్టు ఇచ్చిన సంగతి బయటపడటంతో ఆయనకు అసహనం పెరిగిపోయి మాపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటాలు చూస్తుంటే ఆయన మానసిక సంతులత మీద మాకు సందేహం ఉందన్నారు. తెలంగాణలో బాంక్రానంగల్ ఉందని, గూగూల్ విప్రో సీఈవో సత్య నాదేళ్ల అంటాడని.. ఆయన కుటుంబ సభ్యులు సీఎం మానసిక స్థితిపై పరీక్షలు చేయించుకోవాలని, రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిగా మారిపోవద్దన్నారు.
దిల్‌సుఖ్ నగర్‌లో విమానాలు దొరుకుతున్నాయని, సచివాలయం కింద లంకబిందెలను కేసీఆర్ తవ్వుకుపోయిండని, తీరా సీఎంగా వస్తే లంకబిందెలున్నాయనుకుంటే ఖాళీ బిందేలు కూడా లేవన్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమన్నారు. అమర్ రాజా బ్యాటరీస్ తరలిపోయేందుకు సిద్ధమవ్వడానికి సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే రాష్ట్రం అప్పుల పాలైందన్న మాటలే కారణమన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పామన్నారు. సీఎంగా రేవంత్‌రెడ్డి 8నెలల్లోనే 19సార్లు ఢిల్లీకి పోయాడని, అది ఆయన దుస్థితి అన్నారు.
రేవంత్‌రెడ్డి క్షమాపలు చెప్పాలి
ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకంకు సంబంధించి నేను యధాలాపంగా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నానని, అక్కా చెల్లెళ్లను అవమానించే ఉద్ధేశం నాకు లేదన్నారు. సబితక్క, సునీతక్కలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని మేం సిద్ధమవుతున్నామని కేటీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. సెప్టెంబర్ తర్వాతా డీఎంకే, బీజేడీ, టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీల నిర్వాహణపై అధ్యయనం చేసి 24ఏళ్ల తమ పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేస్తామని, కొత్త సభ్యత్వం, కొత్త కమిటీల ఏర్పాటు వంటి సంస్థాగత నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.