ట్రాన్స్‌జెండర్‌కు బీఎస్పీ ఎమ్మెల్యే టికెట్

- వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి
- బరిలోకి చిత్తారపు పుష్పిత లయ
విధాత: రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సాహసం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి చిత్తారపు పుష్పిత లయ అనే ట్రాన్స్‌జెండర్‌కు టికెట్ కేటాయించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బహుజన సమాజ్ పార్టీ 43 మంది అభ్యర్ధులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది.
ఇందులో పుష్పిత లయ పేరు ఉండటంతో రాజకీయవర్గాల తీవ్ర చర్చనీయాంశమైంది. కరీమాబాద్‌లో నివాసముంటున్న పుష్పిత లయ ఇప్పటికే బీఎస్పీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ టికెట్ దక్కడంతో రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్లందరూ సంబరాలు జరుపుకున్నారు.
ఏండ్ల తరబడి హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న ట్రాన్స్‌జెండర్లు, రాజకీయ అస్తిత్వం కోసం కూడా ఆరాటపడుతున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిసి తమకు స్థానిక సంస్థలు, లేదంటే ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ప్రధాన రాజకీయ పార్టీలు ఏవి కూడా వారి వాదన, ఆవేదనను పట్టించుకోలేదు. బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్రాన్స్‌జెండర్‌కు టికెట్ కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది.