BT roads । తెలంగాణ గ్రామీణ రోడ్లకు మహర్దశ.. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు
రాబోయే నాలుగేండ్లలో ఈ రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు రూ. 12,000 కోట్ల అంచనా వ్యయం అవుతుందని పంచాయతీరాజ్ విభాగం ఇటీవలే ప్రతిపాదనలు తయారు చేసింది. 2024-25 లో 5000 కిలోమీటర్లు, వచ్చే ఏడాది 2025–26లో 4 వేల కిలోమీటర్లు, 2026–27లో 5 వేల కిలోమీటర్లు, 2027–28లో 3300 కిలోమీటర్ల రోడ్లను.. మొత్తం 17300 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికను సిద్ధం చేసింది.

BT roads । రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టనుంది. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో ఉన్న రోడ్లన్నింటినీ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే నాలుగేండ్లలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కవరయ్యేలా రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ఏడాదికి నాలుగు అయిదు వేల కిలోమీటర్ల చొప్పున మొత్తం 17300 కిలోమీటర్ల రోడ్లను వార్షిక ప్రణాళికకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో మొత్తం 68539.27 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది. ఇందులో 26146.83 కిమీ బీటీ రోడ్లు, 7752.10 కి.మీ. డబ్ల్యుబిఎం రహదారులు, 4146.63 కిమీ సిసి రహదారులు.. మిగతా 30493.72 కిమీ మట్టిరోడ్లు ఉన్నాయి. ఇప్పుడున్న పంచాయతీ రాజ్ రోడ్లు కేవలం 10 మెట్రిక్ టన్నుల వాహన సామర్ధ్యంతో నిర్వహిస్తున్నారు. కానీ కొంతకాలంగా 25 నుండి 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న వాహనాల రద్దీ పెరిగింది. దీంతో పంచాయతీ రాజ్ రోడ్లు తొందరగా దెబ్బతింటున్నాయి.
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. కొన్నేండ్లుగా ప్రభుత్వం పంచాయతీ రాజ్ రోడ్ల నిర్వహణకు, పునరుద్ధరణకు తగినన్ని నిధులను కేటాయించలేదు. మరోవైపు నిరంతరం కురిసిన భారీ వర్షాలతో చాలాచోట్ల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పీఆర్ రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ మధ్య పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. ఇటీవల వరదల అనంతరం అంచనా వేసిన నష్టాలు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ముందుగా17,300 కిమీ రోడ్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు నిర్మించాలని లక్ష్యంగా ఎంచుకుంది. మట్టి రోడ్లు, మెటల్ రోడ్లు లేకుండా గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇప్పుడున్న రోడ్ల సామర్థ్యాన్ని 10 మెట్రిక్ టన్నుల నుండి 30 మెట్రిక్ టన్నులకు పెంచనుంది. రాబోయే నాలుగేండ్లలో ఈ రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు రూ. 12,000 కోట్ల అంచనా వ్యయం అవుతుందని పంచాయతీరాజ్ విభాగం ఇటీవలే ప్రతిపాదనలు తయారు చేసింది. 2024-25 లో 5000 కిలోమీటర్లు, వచ్చే ఏడాది 2025–26లో 4 వేల కిలోమీటర్లు, 2026–27లో 5 వేల కిలోమీటర్లు, 2027–28లో 3300 కిలోమీటర్ల రోడ్లను.. మొత్తం 17300 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ రోడ్ల పనులను పీపీపీ మోడల్లో చేపట్టాలని, పది సంవత్సరాల పాటు ఈ రోడ్ల నిర్వహణను కూడా అదే సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.