M Kondandareddy : తెలంగాణలో ఈ నెల 21నుంచి పత్తి కొనుగోలు

రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి: ఈ నెల 21నుంచి తెలంగాణలో సీసీఐ పత్తి కొనుగోలు ప్రారంభం, రైతులు మద్దతు ధర పొందాలి.

M Kondandareddy : తెలంగాణలో ఈ నెల 21నుంచి పత్తి కొనుగోలు

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 21నుంచి కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోలు ప్రారంభిస్తుందని..ఇంతలో తొందరపడి రైతులెవరూ తమ పత్తిని దళారులకు విక్రయించి నష్టపోవద్దని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి తెలిపారు. ఇవాళ సీసీఐ అధికారులతో ఫోన్ లో మాట్లాడటం జరిగిందని.. రాష్ట్రంలో పత్తి కొనుగోలు అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. గతేడాది పత్తి కొనుగోలులో జరిగిన లోపాల గురించి సీసీఐ అధికారులకు వివరించామని..ఈ ఏడాది సీసీఐ కొనుగోళ్లలో దళారులు ప్రవేశించకుండా చూడాలని కోరడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పత్తి ధర క్వింటాలుకు మార్కెట్‌లో రూ.6,700 మాత్రమే ఉందని, అది సీసీఐ మద్దతు ధర 8,110 కంటే రూ.1,410 తక్కువగా ఉందన్నారు. రైతులు సీసీఐకి పత్తి విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు.

మరోవైపు సీసీఐ పత్తి కొనుగోలు ప్రక్రియ వాస్తవానికి ఆక్టోబర్ 1నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పత్తి కొనుగోలు, ఆ తర్వాత శుద్ధి చేసి బేళ్లుగా కట్టి రవాణా చేసే పని కోసం సీసీఐ పిలిచిన జాబ్‌వర్క్‌ టెండర్లకు మిల్లర్లు ముందుకు రాలేదు. రెండుసార్లు టెండర్లు పిలిచిన ఎవరు ముందుకు రాలేదు. దీంతో కొనుగోలు ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది. నిబంధనలు మారిస్తేనే టెండర్లలో పాల్గొంటామని మిల్లర్లు చెబుతున్నారు. గత సంవత్సరం అమలైన విధానాన్నే కొనసాగించాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు..సీసీఐ టెండర్ల సమస్యను పరిష్కరించేందుకు తీసుకునే చర్యలపైనే పత్తి కొనుగోలు ప్రక్రియ ఆధారపడి ఉంది.