Godavari Pushkaralu । గోదావరి పుష్కరాలకు కేంద్రం నుంచి ఏపీకి వంద కోట్లు.. తెలంగాణకు ఎన్ని కోట్లో తెలుసా?
ప్రతిపక్ష పార్టీలు పరిపాలించే రాష్ట్రాలపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మరోసారి వివక్షను ప్రదర్శించింది. గోదావరి పుష్కరాల కోసం ఏపీకి వంద కోట్లు కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం రాజకీయంగా విమర్శలకు తావిస్తున్నది.

Godavari Pushkaralu । 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే గోదావరి (godavari) పుష్కరాలకు ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వాలు సిద్దం అవుతున్నాయి. గోదావరి పుష్కరాలు గోదావరి నదీ తీరం పొడవునా జరుగుతాయి. 12 ఏళ్లకు ఒక్కసారి (once in 12 years) వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి. 12 ఏళ్ల తరువాత 2027లో జరిగే ఈ పుష్కరాలకు మహారాష్ట్ర (Maharashtra), తెలంగాణ (Telangana), చత్తీస్ ఘడ్(, Chhattisgarh), ఒడిశా (Odisha), ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తాయి. భక్తులు (devotees) పుష్కర స్నానాలు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వాలు పుష్కర ఘాట్లు (Pushkara ghats) నిర్మిస్తాయి. వీటి నిర్మాణంతో పాటు నదీకి ఇరువైపులా అభివృద్ది చేయడానికి కేంద్రం కూడా నిధులు విడుదల చేస్తోంది. అలా కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులు కలిపి అభివృద్ది కార్యక్రమాలు (development programs) చేపడుతుంది. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాక్టీస్. కానీ దీనికి విరుద్దంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి పనిని రాజకీయ లబ్ది కోణంలోనే చూస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే కాబోలు.. గోదావరి నది ప్రవహించే మన పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌కు రూ. 100 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 8 సీట్లలో బీజేపీ ఎంపీలను గెలిచిపించి ఢిల్లీకి పంపించిన తెలంగాణ ప్రజలను అవమానించింది.
వాస్తవంగా గోదావరి నది (Godavari River) ఆంధ్ర ప్రదేశ్ కంటే తెలంగాణలోనే ఎక్కవ భూభాగంలో ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం (Tryambakeswaram) వద్ద బ్రహ్మగిరి పర్వతాలలో పుట్టిన గోదావరి 1,465 కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతం(Bay of Bengal)లో కలుస్తోంది. ఈ నది మహారాష్ట్రలో48. 6శాతం, తెలంగాణలో 18 శాతం, చత్తీస్ ఘడ్‌లో 10.9 శాతం, ఒడిశాలో 5.7 శాతం, ఆంధ్ర ప్రదేశ్‌లో 4.5 శాతం ప్రవహిస్తోంది. పుష్కర స్నానాలు ఈ ఐదు రాష్ట్రాలలో జరుగుతాయి. కానీ గోదావరి నది కేవలం 4.5 శాతంమాత్రమే ప్రవహించే ఏపీకి రూ.100 కోట్లు ఇచ్చిన కేంద్రం 18శాతం భూభాగంలో గోదావరి ప్రవహించే తెలంగాణకు ఒక్కరూపాయి కూడా ఇవ్వకపోవడంపై తెలంగాణ సమాజం మండి పడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందన్న అక్కసుతోనే నిధుల విడుదలపై కేంద్రం వివక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్న భావన ఏర్పడుతోంది.
కేంద్రం తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
పుష్కరాల నిధుల్లో కేంద్రం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని బీఆరెస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (brs leader harish rao) అన్నారు. గోదావరి పుష్కరాలకు ఆంధ్రా(andhra)కు రూ.100 కోట్లు ఇచ్చి మరి తెలంగాణకు గుండుసున్నాచూపించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరోసారి మండిచేయి చూపడం పట్ల ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయారని ఆరో పించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. లోక్‌సభ(loksabha)లో బీఆర్‌ఎస్ ఉండి ఉంటే, తెలంగాణకు అన్యాయం జరిగేది కాదన్నారు. కేంద్ర బడ్జెట్ (central budget)లోనూ తెలంగాణకు సున్నా కేటాయింపులు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు అడిషనల్ గ్రాంట్ కింద 15,000 కోట్లు ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చారని మా బాధ కాదు, తెలంగాణకు అన్యాయం జరుగుతోందనేదే మా ఆవేదన అని తెలిపారు. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొదటి నుండి మొండి చెయ్యే చూపించిందని హరీశ్‌రావు అన్నారు.. తెలంగాణ రాష్ట్రం పట్ల ఇంత వివక్ష ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని, హక్కుగా రావాల్సిన నిధులను కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.